breaking news
rs 157 crores seized
-
చెట్టుకింద ప్లీడర్ ఇంట్లో.. రూ. 157 కోట్లు!
-
చెట్టుకింద ప్లీడర్ ఇంట్లో.. రూ. 157 కోట్లు!
ఆయనో న్యాయవాది. పేరు రోహిత్ టాండన్. కానీ ఆయన పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. సుప్రీంకోర్టు కాదు కదా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో కూడా ఎవరూ ఆయనను గుర్తుపట్టరు. కానీ ఇప్పటివరకు ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇంటి మీద చేసిన దాడుల్లో ఏకంగా రూ. 157 కోట్లు బయటపడ్డాయి. ఒకసారి కాదు.. ఏకంగా మూడు సార్లు దాడులు చేశారు. తాజాగా చేసిన దాడిలో 13.5 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. వాటిలో రద్దుచేసిన 500, 1000 రూపాయల కట్టలతో పాటు కొత్తగా విడుదలైన 2వేల రూపాయల కట్టలు కూడా ఉన్నాయి. వీటిలో కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లే ఏకంగా రూ. 2.61 కోట్ల మేరకు ఉన్నాయి. అన్ని నోట్లు ఈయనకు ఎక్కడినుంచి వచ్చాయన్న విషయమై ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు అధికారుల హస్తం లేకుండా ఇది సాధ్యం కాదని అంటున్నారు. ఆదాయపన్ను శాఖతో పాటు ఢిల్లీ క్రైంబ్రాంచి పోలీసులు కలిసి చేసిన సోదాల్లో.. టాండన్ ఇంట్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా నోట్లు బయటపడ్డాయి. అట్టపెట్టెల్లో దాచిపెట్టిన నగదును మొత్తం బయటకు తీశారు. అయితే టాండన్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం గాలింపు మొదలైంది. దాదాపు గత రెండు నెలలుగా టాండన్ మీద ఢిల్లీ పోలీసులు కన్నేసి ఉంచారు. తొలిసారి అక్టోబర్ 7వ తేదీన ఈయన ఇల్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడి చేసినప్పుడు ఏకంగా 125 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. తాజాగా జరిగింది మూడో దాడి. రెండు వారాల క్రితం రెండోసారి దాడిచేసినప్పుడు రూ. 19 కోట్లు బయటపడ్డాయి. వీటిలో ఏ మొత్తానికీ ఆయన వద్ద లెక్కలు లేవు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు ముగిసిన వారం రోజుల తర్వాత అందిన పక్కా సమాచారంతో తొలిసారి అక్టోబర్ 7న దాడి చేశారు. అప్పట్లో మనీలాండరింగ్‌కు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా బయటపడ్డాయి. ఇప్పటి వరకు మూడు సోదాల్లో కలిపి ఈయన వద్ద రూ. 157 కోట్లు స్వాధీనమయ్యాయి.