న్యూడ్ పెయింటింగ్ ఎంతకు కొన్నాడో తెలుసా!
న్యూయార్క్: పికాసో లాంటి ప్రముఖుల పెయింటింగ్స్ అమ్మకాల కోసం నిర్వహించే వేలం పాట కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా మంది ఉత్సాహాన్ని చూపించే విషయం తెలిసిందే. అయితే అదే తరహాలో న్యూడ్ పెయింటింగ్ కోసం న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంపాటకు కూడా భారీ సంఖ్యలో కళాభిమానులు తరలివచ్చారు. ఈ చిత్రం ఏదో సాధారణ ధర పలికిందనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. చైనాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం న్యూయార్క్‌లో ఏకంగా భారతీయ కరెన్సీలో అక్షరాలా 1,131 కోట్ల రూపాయలు(170.4 మిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి మరీ న్యూడ్ పెయింటింగ్ ను తన సొంతం చేసుకున్నాడు. కాగా ఇది రెండో అతి ఖరీదైన పెయింటింగ్‌కు నిలవడం విశేషం.
రాయ్ లిచ్టెన్స్టిన్ గీసిన ఈ మోడీగ్లియానీ న్యూడ్ పెయింటింగ్ ఖరీదైన వాటిలో రెండో స్థానంలో నిలవడంతో వేలం నిర్వాహకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గరిష్టంగా ఈ కళాఖండానికి 100 మిలియన్ల అమెరికన్ డాలర్ల ధర పలుకుతుందని వారు భావించారు. గతంలో పికాసో గీసిన ఓ చిత్రం 'లెస్ ఫెమ్మెస్ డి అల్గర్' ప్రపంచ చరిత్రలోనే అత్యధికంగా అంటే భారతీయ కరెన్సీలో 1,189 కోట్ల రూపాయలకు అమ్ముడయింది. 75 అమెరికన్ మిలియన్ డాలర్లతో ఈ వేలం ప్రారంభమై ఏకంగా 170.4 మిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. రాయ్ గీసిన ఓ పెయింటింగ్ 'నర్స్' గతంలో 95.4 మిలియన్ల అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఆ రికార్డును తిరగరాస్తూ న్యూడ్ పెయింటింగ్ వేలంపాటలో వేలకోట్ల రూపాయల ధర పలికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.