breaking news
Rock gardens
-
రాయచోటి రాక్ గార్డెన్స్.. శిలల సొగసు చూడతరమా!
వైఎస్సార్ జిల్లా: రాయచోటి ప్రాంతంలోని కొండల్లో వివిధ ఆకృతులతో ఏర్పడిన శిలలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద రాతి గుండుపై మరో గుండు, దానిపై ఇంకొకటి...ఇలా ఎవరో పేర్చినట్లు ఉంటాయి. కొన్ని శిలలు అడుగు భాగాన కొద్దిపాటి ఆధారంతో నిలుచుని ఎప్పుడూ పడిపోతాయో అన్నట్లు ఉంటాయి. లక్కిరెడ్డిపల్లె మండలం గంధం వాండ్లపల్లె సమీపాన ఉన్న కొండపై అచ్చం ఓ మనిషి మద్దెల వాయిస్తున్నట్లుగా ఉన్న ఓ రాయి విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక ప్రజలు దీన్ని బొమ్మ కొండ లేదా మద్దెల కొండ అని పిలుస్తారు. ఇక్కడికి సమీపంలోనే మరో కొండలోని ఓ రాయి వెలిగించిన కొవ్వొత్తి రూపంలో ఉంది. కడప నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలో గువ్వల చెరువు దాటాక వచ్చే మేదరపల్లె వద్దనున్న చెరువులో ఉన్న రాయి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. పాలకడలిలో శేష తల్పాన్ని పోలినట్లు ఈ రాయి కనబడుతుంది. శిలలు వివిధ ఆకృతుల్లో ఏర్పడటానికి గల శాస్త్రీయ కారణాలు తెలియని ప్రజలు ఒక్కొ రాయి చుట్టూ ఒక్కొ కథను అల్లారు. అవే నేటికీ ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి గుట్టకు, ప్రతి రాయికి ఏదో ఒక కథ ప్రచారంలో ఉంది. రాయచోటి రాక్ గార్డెన్స్ వెనుక ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. జియాలజిస్టులు చెబుతున్న ప్రకారం లావా చల్లబడుతూ వచ్చిన క్రమంలో ఇలాంటి కొండలు, గుట్టలు ఏర్పడ్డాయి. టెంపరేచర్, ప్రెషర్‌ను బట్టి రకరకాల రూపాలు ఏర్పడ్డాయి. రాయచోటి ప్రాంతంలోని శిలలు ఇగ్నస్ రాక్స్ లేదా మాగ్నాటిక్ రాక్స్ అంటారు. ఆర్కియన్ యుగంలో ఇవి ఏర్పడ్డాయి. కొన్ని లక్షల సంవత్సరాలు గాలి, వాన, నీరు రాపిడి వల్ల శిలలు వివిధ ఆకృతులను సంతరించుకున్నాయి. అడుగు భాగాన చిన్నపాటి ఆధారంతో ఎప్పుడు మీద పడుతాయో అన్నట్లుగా ఉండే శిలలను టార్స్ అని పిలుస్తారు. గ్రానైట్‌లో ఉండే సిలికా కంటెంట్ సాలిడ్ అయ్యి గువ్వల చెరువు ప్రాంతంలో క్వార్ట్జైట్స్ ఏర్పడ్డాయి. రాయచోటి ›ప్రాంతంలోని రాక్ గార్డెన్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల స్టోన్ క్రషింగ్ యజమానులు ఇష్టమొచ్చిన రీతిలో కొండలను ధ్వంసం చేస్తున్నారు. చాలాచోట్ల అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇందువల్ల అందమైన శిలలు క్రమేపీ ధ్వంసం కావడం ప్రకృతి ప్రేమికులను ఆందోళన పరుస్తోంది. అరుదైన శిలలను కాపాడి భావి తరాలకు అందించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
చూసొద్దాం... రాక్ గార్డెన్స్!
దేనికీ స్పందించని మనిషిని రాతితో పోలుస్తుంటారు. కానీ ఈ రాతి ఉద్యానాలను సందర్శించిన వారు ఆ పోలిక తప్పని చెబుతారు. జీవం ఉట్టిపడే ఈ ఉద్యానాల ప్రత్యేకత అలాంటిది. రాతి కట్టడాల గురించి తెలుసు, పచ్చని మొక్కలతో అలరారే ఉద్యానాలూ తెలుసు... మరి పూర్తిగా రాళ్లతోనే నిర్మితమైన ఉద్యానాల గురించి తెలుసా!! లేదంటే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనిషి చేతుల్లో పురుడు పోసుకున్న ఈ ప్రకృతి వనాలను సందర్శిస్తే ‘రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు...’ అని సంధించిన ఓ మహాకవి ప్రశ్నకు సమాధానం ఇవేనా అనిపించకమానదు. నెక్ చంద్ రాతి వనం మన దేశంలోని చండీగఢ్‌లో సుఖ్నా సరస్సుకు దగ్గరలో ఉన్న రాతి ఉద్యానం సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు. చండీగఢ్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్పెక్టర్ అయిన నెక్ చంద్ ఈ ఉద్యాన సృష్టికర్త. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీన్ని తీర్చిదిద్దాడు. వాస్తవానికి ఈ గార్డెన్ ఏర్పాటుపై నిషేధం విధించింది అప్పటి ప్రభుత్వం. అందుకని 18 ఏళ్లపాటు చీకటి రాత్రుల్లోనే ఎవరికీ తెలియకుండా ఈ రాతి తోటను సృష్టించాడు. రాత్రివేళ రహస్యంగా సమీపంలోని అడవికి వెళ్లి, రాళ్లను చేతులతో మోసుకొచ్చేవాడు. కొండ ప్రాంతాలకు సైకిల్ పై వెళ్లి పెద్ద పెద్దరాళ్లను తీసుకువచ్చేవాడు. కూల్చివేసిన భవనాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాడు. వీటన్నింటి మిశ్రమంతో నృత్యభంగిమల్లో ఉన్నవి, సంగీతకారుల శిల్పాలు, జంతువులకు సంబంధించిన శిల్పాలను ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ పార్క్ కోసం 50 మంది శ్రామికులు రేయింబవళ్లు ఏకాగ్రతతో పని చేశారు. 1975లో ఈ రాతి ఉద్యానం వెలుగులోకి రావడం, ప్రభుత్వం చంద్ శ్రమను గుర్తించి, పట్టణంలో పనికిరాని వస్తువులను, విరిగిన సెరామిక్ రాళ్లను ఇందుకోసం ఉపయోగించమని సూచించింది. 1976లో ఈ పార్క్‌ను పబ్లిక్ ప్లేస్‌గా గుర్తించి ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చింది. 1983లో ఈ ఉద్యానం పేరిట ప్రత్యేక తపాలా బిళ్ళను వెలువరించారు. ఈ రాక్‌గార్డెన్ సందర్శనకు ప్రతిరోజూ 5 వేల మందికి పైగా సందర్శకులొస్తున్నారు. సన్ యట్-సెన్ చైనీస్ గార్డెన్ కెనడాలోని వాంకోవర్‌లో కొలువుదీరిన ఈ సంప్రదాయ గార్డెన్‌ను రాయి, నీరు, గ్రహాలు, నిర్మాణం.. ఈ నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని రూపొందించారు ఉద్యాన సృష్టికర్తలు జో వాయ్, డొనాల్ వ్యుఘన్లు. 1985-1986లో నిర్మించిన ఈ గార్డెన్‌కి చైనాలోని తాయ్ సరస్సు దగ్గర ఉన్న రాళ్లను తెప్పించి నిర్మించారు. తాయ్ సరస్సులోని రాళ్లకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, అదృష్టాన్ని కలిగిస్తాయని చైనీయుల నమ్మకం. ఆధునిక చైనా జాతీయ నాయకుడైన డాక్టర్ సన్ యట్-సెన్ పేరును దీనికి పెట్టారు. ప్రకృతికి దీటుగా ఏర్పాటు చేసిన ఈ ఉద్యానం విజ్ఞాన, విహార, ధ్యానానుభూతులను ఏకకాలంలో కలిగిస్తోంది. డంబర్టన్ ఓక్స్ గార్డెన్ అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో డంబర్టన్ ఓక్స్పేరుతో ఉంది ఈ రాతి వనం. బీట్రిక్స్ ఫెర్రాండ్ అనే వ్యక్తి రంగురంగు రాళ్లతో అత్యద్భుతంగా 1920ల కాలంలో ఈ రాతి ఉద్యానాన్ని రూపొందించారు. అలంకరణ కోసం రకరకాల రాతి ముక్కలను ఈ స్టైల్ గార్డెన్ నిర్మాణానికి ఉపయోగించారు. వాకర్ రాక్ గార్డెన్ వాషింగ్టన్లో వాకర్ రాక్ గార్డెన్‌ను ఆంటోనీ గౌడి 1950లో అభివృద్ధి చేశాడు. దీని రూపకర్త మిల్టన్ వాకర్. ఇతను బోయింగ్ విమానాల మెకానిక్‌గా పనిచేసేవాడు. తన భార్య మిల్టన్‌తో కలిసి 20 ఏళ్లపాటు అత్యంత ప్రేమగా ఈ ఉద్యానాన్ని సృష్టించాడు. ఈ రాతి ఉద్యానంలోని కట్టడాలకు రాళ్లు, చెక్కలు, రంగురంగుల గాజు ముక్కలను ఉపయోగించాడు. 18 అడుగుల పొడవైన టవర్, అలంకృత ఫౌంటెయిన్లు, ఆల్ఫ్స్ పర్వతాలను పోలిన సుందర రూపాలు, సీతాకోకచిలుకలను పోలిన రాళ్ల నిర్మాణాలు ఇక్కడ కనువిందుచేస్తాయి.