Registered Medical Practitioner
-
ఆర్ఎంపీలకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది. ఫార్మా కంపెనీలు, వారి ప్రతినిధులు, వైద్య పరికరాల సంస్థల దగ్గర్నుంచి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కానుకలు, డబ్బులు, ఆతిథ్యం స్వీకరించకూడదని నిబంధనలు విధించింది. ఫార్మా కంపెనీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనడం, ప్రయాణ సదుపాయాలను తీసుకోవడం వంటివి చేయకూడదని పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు వృత్తిపరమైన బాధ్యతని కలిగి ఉంటూ ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2నే ఈ నిబంధనల్ని జారీ చేసింది. అంతే కాదు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఇతర పరికరాల వినియోగాన్ని ఆమోదిస్తూ ప్రకటనలివ్వకూడదంది. -
మహిళా ఆర్ఎంపీ నెంబర్ తీసుకుని.. ఫోన్లు, మెసేజ్‌లు.. ఏకంగా క్లినిక్‌కు వెళ్లి..
సాక్షి, మొయినాబాద్(రంగారెడ్డి): మహిళా ఆర్ఎంపీ డాక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్థించిన వ్యక్తిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దమంగళారంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారం గ్రామానికి చెందిన దళిత మహిళ(28) ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తూ గ్రామంలోనే క్లినిక్ నడుపుతుంది. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం క్లినిక్‌కు వెళ్లి చూపించుకున్నాడు. అదే సమయంలో ఆమె సెల్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ప్రతిరోజు ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈనెల 17న మళ్లీ క్లినిక్‌కు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించి క్లినిక్ నుంచి వెళ్లగొట్టింది. రాత్రి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు అతన్ని అడగడానికి ఇంటికి వెళ్లగాఅప్పటికే అతడు పరారయ్యాడు. మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి వాంగ్మూలం మేరకు అతనిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్ రాడ్‌తో టీచర్‌పై.. కుటుంబం ఆత్మహత్య: తండ్రి వివాహేతర సంబంధమే కారణం! -
ఆర్ఎంపీ వైద్యం వికటించి యువకుడి మృతి
సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): ఆర్ఎంపీ వైద్యం వికటించి మండల పరిధిలోని గుంటుపల్లెకు చెందిన యువకుడు వడ్డే మణిదీప్ (17) మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పెద్దయ్య నాయుడు తెలిపిన వివరాలు.. ఈనెల 22న మణిదీప్ జ్వరం, కాళ్ల నొప్పులతో బాధ పడుతూ వెల్దుర్తిలోని ఆర్ఎంపీ వైద్యుడు వెంకటేశ్వర్లు(అనిల్ క్లినిక్)ను సంప్రదించాడు. అతడు కుడికాలి మక్కికి ఇంజక్షన్ వేసి నయమవుతుందని పంపేశాడు. ఇంటి కెళ్లిన తరువాత కాలు వాపు వచ్చింది. మరుసటి రోజు బొబ్బలు వచ్చాయి. మంగళవారం తండ్రితో కలిసి ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రశ్నించగా డోనుకు గానీ, కర్నూలుకు కానీ వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. డోన్‌లోని వాణి పాలి క్లినిక్‌కు వెళ్లగా ఇంజక్షన్ వికటించిందని, కర్నూలుకు వెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తన కుమారుడు మృతికి ఆర్ఎంపీ వైద్యుడే కారణమంటూ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘వారికి ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు’
సాక్షి, అమరావతి : జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చేవారికి ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు.. ఎప్పటికప్పుడు వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలని ఆదేశించింది. ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో వారి వద్దకు వస్తే సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు సమాచారమివ్వాలని ఆర్ఎంపీలకు సూచించింది. వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాకూ కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేయన్నుట్లు, ప్రస్తుతం అందుబాటులో 4 రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది. (వారందరికీ నా ధన్యవాదాలు: ఆమిర్ ఖాన్) భారత్‌లో 7447 కేసులు.. 239 మరణాలు టర్కీలో అద్భుతం.. కేవలం 10 రోజుల్లోనే.. -
రోగిని తీసుకొస్తే ‘నీకింత... నాకింత’
‘‘కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లోని ఓ హాస్పిటల్‌కు జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన వ్యక్తిని బంధువులు, ఆర్ఎంపీ సహకారంతో తీసుకొచ్చారు. కాలు తొంటిభాగం విరగడంతో బాల్ రీప్లేస్మెంట్ చేయాలన్నాడు డాక్టర్. వెంటనే హాస్పిటల్ నిర్వాహకుడు రంగప్రవేశం చేశాడు. రూ.2 లక్షల ప్యాకేజీ కింద బేరం కుదిరింది. అడ్వాన్స్ చెల్లించి ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్ పీఆర్వో అక్కడికక్కడే 30 శాతం కమీషన్ రూ.60 వేలు ఆర్ఎంపీకి ఇచ్చేశాడు.’’ ‘‘ఓ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ రిఫరెన్స్‌తో వచ్చిన రోగి నుంచి ఓ ప్రైవేటు హాస్పిటల్ వైద్యం కోసం లక్ష రూపాయలు వసూలు చేసింది. అయితే ఆర్ఎంపీకి ఇవ్వాల్సిన 30 శాతం కమీషన్ ఇవ్వలేదు. దీంతో సదరు ఆర్ఎంపీ సమస్యను వాళ్ల అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హాస్పిటల్ యాజమాన్యం కొంత మొత్తాన్ని కమీషన్‌గా చేతిలో పెట్టి పంపించారు. తనకు రావలసిన పూర్తి కమీషన్ కోసం ఆయన చాలా కాలమే పోరాడాడు.’’ ‘‘1980–90 దశకంలో పీపుల్స్‌వార్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మెడికల్ ప్రాక్టీషనర్లుగా రూ.లక్షల్లో సంపాదించిన వాళ్లు ఉమ్మడి కరీంనగర్లో ఉన్నారు. వైద్యంతోపాటు గర్భ విచ్చిత్తి స్పెషలిస్టుగా రూ.లక్షలు సంపాదించిన ఓ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ కరీంనగర్‌లోని ఓ సినిమా థియేటర్ సమీపంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాడు. ఈ అబార్షన్ స్పెషలిస్టు హాస్పిటల్‌పై గతంలో దాడి కూడా జరిగింది. కన్సల్టెంట్ డాక్టర్లతో, ఎలాంటి సర్టిఫికెట్ లేకపోయినా తాను కూడా వైద్యం చేస్తూ ఇప్పటికీ ‘క్యాష్పిటల్’ను నిర్వహిస్తున్నాడు. తాను వచ్చిన దారిలోనే మెడికల్ ప్రాక్టీషనర్లనే ఏజెంట్లుగా చేసుకుని వైద్య వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.’’ సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో హాస్పిటల్స్ డబ్బులు సంపాదించి పెట్టే ‘క్యాష్’పిటల్స్గా మారాయి. వైద్యం పక్కా వ్యాపారంగా తయారైంది. వైద్యుడే ఆసుపత్రి స్థాపించి రోగులకు సేవలు అందించే కాలం నుంచి వైద్యున్ని నియమించుకుని, ఆర్ఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లు, పీఆర్వోల సాయంతో వ్యాపారం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రోగం లేకపోయినా.. సృష్టించి వైద్యం చేసే స్థాయికి కరీంనగర్‌లోని ‘కాసు’పత్రులు దిగజారాయి. రోగి బాధను, భయాన్ని ‘క్యాష్’ చేసుకునే వ్యాపారం ప్రణాళికాబద్ధంగా సాగిపోతోంది. కొత్తగా ఏర్పాటైన దవాఖానాల నుంచి అంతో ఇంత పేరున్న హాస్పిటళ్ల వరకు గ్రామాలు, కోల్‌బెల్ట్ ఏరియాలోని మెడికల్ ప్రాక్టీషనర్ల పైనే ఆధారపడి వ్యాపారం సాగిస్తున్నాయి. రోగి చెల్లించే ఫీజుల నుంచి 30 నుంచి 60 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నాయి. చివరకు ఒకటి రెండు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం కమీషన్లు ఇచ్చి రోగులను ఆసుపత్రులకు రప్పించుకునే దయనీయ స్థితి కరీంనగర్లో నెలకొంది. రోగిని తీసుకొస్తే నీకింత... నాకింత అనే ధోరణిలో వైద్య వ్యాపారం సాగిపోతోంది. రోగుల డబ్బుతో హైఫై బతుకులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ(రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్) నుంచి పట్టణాల్లోని పెద్ద డాక్టర్ల వరకు పేద, మధ్య తరగతి రోగుల నుంచి వసూలు చేసే డబ్బులతోనే బతుకుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇన్‌పేషంట్‌గా చేరినప్పుడే “రెఫర్ బై’ అనే కాలంలో సదరు మెడికల్ ప్రాక్టీషనర్ పేరును రాసుకుని వసూలు చేసిన మొత్తం నుంచి మాట్లాడుకున్న కమీషన్ ఇవ్వడం పరిపాటిగా మారింది. కరీంనగర్ జిల్లాలో జరిగే వైద్య వ్యాపారంలో మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పేషెంట్లదే సింహభాగమని చెప్పవచ్చు. ఆయా ప్రాంతాల ఆర్ఎంపీలు నేరుగా కరీంనగర్‌లోని తమకు కమీషన్లు ఇచ్చే ఆసుపత్రులకు బలవంతంగా పంపిస్తున్నారు. ప్రొఫెషనల్ డాక్టర్ కూడా సంపాదించలేనంత సొమ్మును కేవలం రెఫరల్ కేసుల ద్వారా ఆర్ఎంపీలు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో డాక్టర్లను నియమించుకుని సొంతంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకున్నవారు కూడా ఉన్నారు. దీంతో కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు పూర్తిగా ఆక్రమ మార్గంలోనే పయనిస్తున్నాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ పోషిస్తున్నాయి. ఆ ఖర్చును సైతం రోగులపై రుద్దుతూ.. మరో వైపు డాక్టర్లకు సైతం రోగుల సంఖ్య పెంచేలా టార్గెట్లు నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాలు, సింగరేణి కోల్‌బెల్ట్‌లోని ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్ఎంపీల ద్వారా వచ్చిన రోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును అందరూ కలిసి పంచుకుంటున్నారు. ఇదంతా పెద్ద మాఫియాగా నడుస్తున్న వ్యవహారం. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో వీరి వ్యాపారం దిగ్విజయంగా సాగిపోతోంది. మెడికల్ టెర్మినాలజీ తెలియకున్నా... అక్షరం ముక్క మెడికల్ టెర్మినాలజీ రాని ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ల పేరుతో చలామణి అవుతున్నారు. ఇంటికి వచ్చి మందులు ఇచ్చే మెడికల్ ప్రాక్టీషనర్ల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. కమీషన్లు, గిఫ్టులు, వాటాలు, స్టార్ హోటళ్లలో విందులు, విదేశీయానాలు ఇలా చెప్పుకుంటూ పోతే... కొందరు ఆర్ఎంపీలు అనుభవిస్తున్న రాజభోగం అంతా ఇంతా కాదు. కరీంనగర్‌తోపాటు కొన్ని పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్‡ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలకు 20 నుంచి 60 శాతం వరకు హాస్పిటళ్ల స్థాయిని బట్టి కమిషన్లు ఇచ్చి మరీ రోగులను ఆసుపత్రులకు రప్పించుకుంటున్నా రు. ఇలాంటి కమీషన్లకు ఆశపడుతున్న ఆర్ఎంపీలు రోగులను భయపెట్టి మరీ వారు చెప్పిన ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నా చితకా వైద్యం చేసుకునే ప్రాక్టీషనర్లు ప్రైవేటు ఆసుపత్రులను, వైద్యులను శాసించే స్థాయికి ఎదిగారు. అవసరం లేకపోయినా రోగుల్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించి అడ్డగోలు ఆపరేషన్లు చేయిస్తున్నారు. చిన్నపాటి జబ్బులకు కూడా రకరకాల పరీక్షలు చేయించి తమ వాటా తీసుకుంటున్నారు. ఇటీవల ఆర్ఎంపీలు ఏర్పా టు చేస్తున్న క్లినిక్‌ల సంఖ్య పెరుగుతోంది. వీళ్లకు కమీషన్లు ఇచ్చేందుకు ప్రతీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీఆర్వో (పేషంట్ రిలేషన్ ఆఫీసర్)ను ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఆపరేషన్‌కు ఎంత కమీషన్ ఇవ్వాలి, ఏ ఆర్ఎంపీలకు ఎంత ముట్టజెప్పాలో వీరు చూసుకుంటారు. అప్పుడప్పుడూ గ్రామాలకు వెళ్లి ఆర్ఎంపీలతో కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. జిల్లా వైద్యాధికారులు ఎవరూ పీఎంపీ, ఆర్ఎంపీల ద్వారా సాగుతున్న దందాపై కనీసం దృష్టి పెట్టడం లేదు. కోల్‌బెల్ట్ ఏరియాలో మాఫియాగా సింగరేణి ప్రాంతంలో మెడికల్ ప్రాక్టీషనర్ల దందా మాఫియాగా తయారైంది. బొగ్గు గనులు అధికంగా ఉన్న పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖ ని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ, బేగంపేటతోపాటు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, సీసీసీ, రవీంద్రఖని, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, ఆసిఫాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మెడికల్ ప్రాక్టీస్ ద్వారా లక్షల్లో సంపాదించిన వారు ఉన్నారు. గని కార్మికుల కోసం సింగరేణి ఏరి యా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా మెడికల్ ప్రాక్టీషనర్లేనే ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ప్రమాదాల నుంచి పెద్ద రోగాల వరకు సింగరేణి ఉచితంగా చికిత్స చేయించే అవకాశాలను కాదని, కార్మికులను ఏమార్చి చికిత్స కోసం ఆర్ఎంపీ, పీఎంపీలు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. సింగరేణి నుంచి రిఫరల్ కేసులుగా వచ్చే రోగులకు సంబంధించి అధిక మొత్తంలో కమీషన్లు ముట్ట జెపుతున్నాయి కరీంనగర్ హాస్పిటళ్లు. వేల మంది మెడికల్ ప్రాక్టీషనర్ల ద్వారా... కరీంనగర్ జిల్లాలో 259 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కరీంనగర్ పట్టణంలోనే 200 వరకు చిన్నా, పెద్ద ఆసుపత్రులున్నాయి. వీట న్నింటికీ అనుసంధానంగా సుమారు 3 వేల మంది ఆర్ఎంపీలు పనిచేస్తున్నారు. గ్రామాల్లో జ్వరం, దగ్గు, దమ్ము, ప్రాథమిక చికిత్స వరకు ఆర్ఎంపీ, పీఎంపీలు చేసే వైద్యంపై అభ్యంతరాలు ఏమీ ఉండవు. నిబంధనల ప్రకారం ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మినహా ఆపరేషన్లు చేయడం, స్టెరాయిడ్స్ ఇవ్వడం, యాంటీ బయోటిక్స్ వాడకూడదు. కరీంనగర్ గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల వంటి పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే సాధనాలుగా వీరు మారిపోయారు. -
కేజీహెచ్‌లో టీబీ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు
ఆర్ఎన్టీసీపీ చైర్మన్ డాక్టర్ ఎస్వీ కుమార్ వెల్లడి విశాఖ మెడికల్ : క్షయ వ్యాధిని త్వరితగతిన గుర్తించడంలో కీలకపాత్ర వహించే డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ కేంద్రాన్ని కేజీహెచ్‌లో నెలకొల్పినట్టు ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆర్ఎన్టీసీపీ చైర్మన్ డాక్టర్ ఎస్వీ కుమార్ తెలిపారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వసుంధర సమన్వకర్తగా, ఛాతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాంబశివరావు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ దేవీమాధవీ, కేజీహెచ్ పిల్లల విభాగధిపతి పద్మలత, మైక్రో బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.లక్ష్మి, బయో కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ విజయబాబు, కేజీహెచ్ డీఎంసీ మెడికల్ ఆఫీసర్ బాలసుందరం సభ్యులుగా ఉన్న జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమ(ఆర్ఎన్టీసీపీ) కోర్ కమిటీ సమావేశం శుక్రవారం మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయను ప్రభుత్వం నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించినందున ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అయినా ఈ వ్యాధికి చికిత్స అందించి, సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. జనాభాలో రెండు శాతం మందికే టీ బీ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధి మరొకరికి సోకడం వల్ల 48 శాతం మందికి వ్యాపిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి హెచ్ఐవీ రోగుల్లో పది రెట్లు తొందరగా వ్యాప్తించే అవకాశం ఉందన్నారు. లక్ష మందిలో 203 మందికి టీబీ సోకుతుండగా వీటిలో 140 కేసులు మాత్రమే గుర్తించగలుగుతున్నామన్నారు. దేశంలో 5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్‌ను, లక్ష మందికి ఒక డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ సెంటర్ (డీఎంసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 63 డీఎంసీ కేంద్రాలున్నాయని, ఆంధ్రా వైద్యకళాశాల, కేజీహెచ్ పరిధిలో ఒక డీఎంసీ సెంటర్ పనిచేస్తోందన్నారు. ఈ కేంద్రంలో అధునాతన ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. -
‘గుర్తింపు' లేని వైద్యం
వైద్యశాలలు దేవాలయాలతో సమానం. కష్టాల్లో ఉన్న వారు దేవుని కరుణ కోసం ఆలయాలకు వెళుతున్నట్టే అమూల్యమైన ప్రాణాలను నిలబెట్టుకునేందుకు వైద్యాలయాలకు వెళుతుంటారు. అలాంటి వైద్యాలయాలు సేవకు ప్రతీకగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వైద్యోనారాయణ హరీ అనే నానుడికి సార్థకత. ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా వైద్య సంస్థలు వెలుస్తున్నాయి. అర్హతలతో నిమిత్తం లేకుండా పుట్టగొడుగొల్లా ఆస్పత్రులు నెలకొల్పడం వెనుక సంబంధిత అధికారుల ధనదాహం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైద్య వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో ఇప్పటికే వేల సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి ఎన్ని అంటే స్వయానా జిల్లా వైద్యారోగ్యశాఖ సమాధానం చెప్పలేని దుస్థితి. కాసులిస్తే ఎలాంటి వాటికైనా డీఎంహెచ్ఓ కార్యాలయంలో అనుమతి ఇస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో కొందరు నకిలీ వైద్యులు చెలగాటమాడుతున్నారు. విచ్చలవిడిగా క్లినిక్‌లు, నర్సింగ్ హోంలను నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారు. వీటిని ఎక్కువగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) నిర్వహిస్తున్నారు. గతంలో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆర్ఎంపీలు కనిపించేవారు. నేడు నగర, పట్టణాలకు వ్యాపించారు. వాస్తవానికి వీరు దగ్గు, జ్వరం వంటి సాధారణ రుగ్మతలకు మాత్రమే వైద్యం అందించాలి. అయితే ఆర్ఎంపీలు ఏకంగా హయ్యర్, లేటెస్ట్ యాంటి బయాటిక్ మందులను సూచిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాకుండా ఎమ్ఆర్ఐ, సిటీ స్కానింగ్‌లను యథేచ్ఛగా నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారు. వాస్తవానికి ఎంబీబీఎస్ స్పెషలిస్ట్‌లు మాత్రమే హయ్యర్, లేటెస్ట్ యాంటి బయాటిక్స్‌ను సూచించాల్సి ఉంది. మరికొందరు మందుల దుకాణాలనే క్లినిక్‌లుగా మార్చేశారు. తనిఖీలు నిల్ వైద్యశాలలు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తుండాలి. కాని ఎక్కడా అలా జరగడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 313 ఆస్పత్రులు, క్లినిక్, నర్సింగ్‌హోంలు రిజిస్టర్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో 17 వరకు రెన్యువల్ కావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అనధికారికంగా వేల సంఖ్యలో క్లినిక్‌లు, నర్సింగ్ హోంలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్యులే వీటిని ఎక్కువగా నడుపుతున్నట్టు తెలిసింది. ఉదాహరణకు నెల్లూరు జూబ్లీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు గత పది నెలలుగా లాంగ్‌లీవ్‌లో ఉంటూ స్థానిక పొగతోటలో సొంత వైద్యశాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. అలాగే డీఎస్ఆర్ ఆస్పత్రిలో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న మరో వైద్యుడు తనకు ఆరోగ్యం బాలేదని రెండు నెలల క్రితం సెలవుపై వెళ్లి పొగతోటలోని తన క్లినిక్‌లో తిష్టవేసిన విషయం బహిరంగ రహస్యమే. నిబంధనలు ఇవే.. వైద్యశాల, నర్సింగ్‌హోం, క్లినిక్‌లను ఏర్పాటు చేయాలంటే నాన్ జ్యుడిషయరీ స్టాంప్‌తో నోటరీ డిక్లరేషన్ తప్పనిసరి. అద్దె భవనమైతే రెంటల్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం. వైద్యుల అర్హత ధ్రువీకరణ పత్రాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యత్వం నకలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కాపీ, ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సుల అర్హత, సిబ్బంది వివరాలు, ఆస్పత్రి పరికరాలు, వైద్యసేవల వివరాలు, ఆస్పత్రి ప్రాంగణం, ఆపరేషన్ గది, రోగుల వెయిటింగ్ హాల్ ఫొటోలు, అగ్నిప్రమాద నిరోధక యంత్రాలను అమర్చుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ ఖర్చులు డీఆర్ఏ, డీఎంహెచ్ఓ నెల్లూరు పేరుతో ఏదైనా జాతీయ బ్యాంక్‌లో డీడీ తీయాలి. ఐదేళ్ల రిజిస్ట్రేషన్ ఫీజుల వివరాలు కింది విధంగా ఉన్నాయి. క్లినిక్/ కన్సల్టేషన్ రూం రూ.1,250. పాలిక్లినిక్ రూ.2,500 20 పడకల కన్నా తక్కువున్న హాస్పిటల్/నర్సింగ్ హోం రూ.3,750 21 నుంచి 50 పడకలకు రూ.7,500 50 నుంచి 100 పడకలకు రూ.10 వేలు 101 నుంచి 200 పడకలకు రూ.15 వేలు 200కు పైబడిన పడకలు కలిగిన ఆస్పత్రికి రూ.37,000 డయాగ్నస్టిక్ సెంటర్ (బేసిక్ ల్యాబ్) రూ.2,500 డయాగ్నస్టిక్ సెంటర్ విత్ హయ్యర్ ఎక్విప్మెంట్ రూ.10,000 ఫిజియోథెరపీ యూనిట్స్ రూ.3,750