హిట్టయింది.. హాలిడేకి వెళుతున్నాం
‘‘నెల నుంచి ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అమల హాలిడేకి తీసుకువెళ్లమన్నా... తీసుకెళ్లలేదు. నిన్న సినిమా విడుదలైంది. సూపర్ హిట్టయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీనెస్లో రేపే హాలిడే ట్రిప్‌కి వెళ్తున్నాం’’ అన్నారు నాగార్జున. నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ – ‘‘కుటుంబ ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇంత భారీ సక్సెస్ సాధ్యమైంది. బీచ్ సీన్‌కి, చైతూ నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తున్నారని తెలిసి హ్యాపీగా ఫీలయ్యా. నటీనటులందరూ బాగా చేశారు.
కల్యాణ్‌కృష్ణ, దేవిశ్రీ ప్రసాద్, సత్యానంద్, జీకే మోహన్.. బాగా కష్టపడ్డారు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. నా పాత్రకు ఇంత పేరొస్తుందంటే కల్యాణ్కృష్ణే కారణం. మా వెన్నంటే ఉండి నడిపించిన నాన్నకు థ్యాంక్స్’’ అన్నారు. కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ – ‘‘నాగార్జునగారు లేకుంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్.. వేడుక చూద్దాం’ సినిమాలు, సక్సెస్‌లు ఉండేవి కాదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనకు థ్యాంక్స్. శివలాంటి మెచ్యూర్డ్ క్యారెక్టర్లో చైతూ తన నటనతో డబుల్ ఇంపాక్ట్ చూపించాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో స్క్రీన్‌ప్లే రచయిత సత్యానంద్, డీఓపీ ఎస్వీ విశ్వేశ్వర్ పాల్గొన్నారు.