‘కోటా పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి’
హైదరాబాద్: ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్య కోటాను 50 శాతానికి పెంచడం సరికాదని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు ఆయన ఈ మేరకు ఒక లేఖ రాశారు. ప్రైవేట్ యాజమాన్యాలు 50 శాతం సీట్లను సొంతంగా, ప్రత్యేక ఎంట్రెన్స్ ద్వారా భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు.
యాజమాన్య కోటా పెంచడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోటా తగ్గిపోతాయని పేర్కొన్నారు. పీజీ, బీఈడీ, డీఈడీ, లా కోర్సుల్లో 20 శాతం, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 30 శాతం యాజమాన్య కోటా ఉండగా, ప్రతిష్టాత్మకమైన మెడికల్ కోర్సుల్లో 50 శాతానికి పెంచడంలోని హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించారు.