breaking news
Psy Film
-
రావత్... వెండితెర రావణ్!
ఉత్తమ విలన్ కొన్ని సంఘటనలు ‘చిత్రం’గా జరుగుతాయి. సూచనప్రాయంగా కూడా చెప్పకుండా జరుగుతాయి. ‘ప్రదీప్ రావత్ ఎవరు?’ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కాస్తో కూస్తో ఆలోచించవచ్చుగానీ...మన తెలుగు వాళ్లు మాత్రం టకీమని చెబుతారు. వీలైతే అతని డైలాగును ఒకసారి ఇలా గుర్తుతెచ్చుకుంటారు. ‘ఒక్క ముక్క చెప్పి ఉండాలి. చెప్పలే. అంటే...లెక్కలే! నేనంటే లెక్కలేని వాన్ని నా లెక్కలో ఉంచడం ఇష్టం లేదు’ రాజమౌళి ‘సై’ సినిమాకు ఒక విలన్ కావాలి. ఆషామాషీ విలన్ కాదు. గట్టి విలన్ కావాలి. సినిమా విజయానికి విలనే కీలకం! అందుకే రాజమౌళి విలన్ల వేటలో ఉన్నాడు. ఎందరినో... స్క్రీన్‌టెస్ట్, అడిషన్ టెస్టులు చేస్తున్నాడు. కానీ ఎవరూ నచ్చడం లేదు. దీంతో ‘నాకో మాంచి విలన్ కావాలి’ అంటూ తన అసిస్టెంట్‌ను ముంబైకి పంపించాడు. ఆ అసిస్టెంట్ ఎక్కడెక్కడ తిరిగాడోగానీ ఆరోజు అమీర్‌ఖాన్ ‘లగాన్’ సినిమా చూద్దామని డిసైడైపోయాడు. అతను అలా డిసైడై ఉండకపోతే....ప్రదీప్ రావత్ ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. మనకు ఒక ఉత్తమ విలన్ తెర మీద పరిచయమయ్యేవాడు కాదు! ‘లగాన్’ సినిమాకు కృతజ్ఞతలు. ‘లగాన్’లో దేవా అనే సర్దార్ పాత్ర పోషించాడు రావత్. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పట్టణంలోని యు.సి.ఒ. బ్యాంకులో కొంత కాలం పని చేసిన ప్రదీప్ రామ్‌సింగ్ రావత్ ‘మహాభారత్’ టీవీ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘యుగ్’ టీవీ సీరియల్లో బ్రిటీష్ ఇన్స్పెక్టర్గా, ‘సర్ఫ్రోష్’ సినిమాలో ‘సుల్తాన్’గా నటించాడు. మళ్లీ ‘లగాన్’ దగ్గరకు వద్దాం. ‘లగాన్’లో దేవా దూకుడు రాజమౌళి అసిస్టెంట్‌కు బాగా నచ్చింది. ‘నేను వెదుకుతున్న విలన్ ఇతడే’ అనుకున్నాడు. రావత్‌ను సంప్రదించాడు. సౌత్ సినిమాలలో నటించడానికి విముఖంగా లేడుగానీ తనలో చిన్న సందేహం... ‘‘నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. భాష రాకపోతే బొమ్మలా నటించాల్సిందే...’’ అయితే ఈ సందేహాన్ని పక్కన పెట్టి అడిషన్ టెస్ట్‌కు హాజరయ్యాడు. ఓకే అనిపించుకున్నాడు. అలా తెలుగు వెండితెరపై బిక్షు యాదవ్‌గా అలరించాడు. నోటిలో పెద్ద చుట్ట. ముక్కుకు రింగు. కాటుక కళ్లు. పే...ద్ద మీసాలు. నాలుక మడతెట్టి వార్నింగ్ ఇచ్చే మ్యానరిజం... చూసీ చూడగానే తెలుగు ప్రేక్షకలోకానికి చేరవయ్యాడు రావత్. ఆ తరువాత... ‘భద్ర’లో వీరయ్య, ‘అందరివాడు’లో సత్తి బిహారి, ‘ఛత్రపతి’లో రాస్ బిహారి, ‘దేశముదురు’లో తంబిదురై, ‘యోగి’లో నరసింహ పహిల్వాన్, ‘జగడం’లో మాణిక్యం... ఇలా ఎన్నో పేర్లతో ఉత్తమ విలన్‌గా స్థిరపడ్డాడు రావత్. ఇక ‘గజినీ’ సినిమాలో రావత్ చెడ్డ విలనిజానికి మంచి పేరు వచ్చింది. రామ్-లక్షణ్గా సౌత్‌లో, ధర్మాత్మగా నార్త్‌లో ఆయన విలనిజానికి బోలెడు ‘చెడ్డ’ పేరు వచ్చింది. ‘‘బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం ఏమిటి?’’ అనే ప్రశ్నకు- ‘‘అవకాశాలు రాకపోవడమే’’ అని చెప్పే రావత్ తనకు అవకాశం ఇచ్చిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ‘ఉత్తమ విలన్’గా గట్టి పేరు సంపాదించుకున్నాడు. ‘లగాన్’లో దేవ పాత్ర ముఖేష్ రుషి చేయాల్సింది. అయితే డేట్స్ సమస్య వల్ల ఆ పాత్రను ముఖేష్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ అవకాశం రావత్‌కు వచ్చింది. ‘లగాన్’లో సర్దార్జీ పాత్ర ముఖేష్ చేసి ఉంటే....రావత్ ‘లగాన్’లో నటించేవాడు కాదు. ‘లగాన్’లో నటించకపోతే...రాజమౌళి దృష్టిలో పడి ఉండేవాడు కాదు. రాజమౌళి దృష్టిలో పడి ఉండకపోతే... సౌత్‌లో స్టార్ విలన్‌గా పేరుతెచ్చుకొని ఉండేవాడు కాదు... ఎంత చిత్రం! -
నల్లబాలు... నవ్వుల బాలు!
కామెడీ క్లాస్,వేణు మాధవ్ సై సినిమాలో మొదట ‘నల్లబాలు’ ది చిన్న పాత్రే. సినిమా స్టార్టింగ్‌లో కాలేజీ గోడ మీద పొలిటికల్ లీడర్ పేరు రాస్తూ నల్లబాలు ప్రత్యక్షం అవుతాడు. అక్కడికీ మొదట్లోనే తన మనిషి ఒకరు వచ్చి హెచ్చరిస్తాడు. ‘అన్నా గోడ మీద రాయడానికి పర్మిషన్ కావాలంటనే..’ అని. వింటేగా! ‘నల్లబాలు.. నల్లతాచు లెక్క..’ అంటూ రెచ్చిపోతాడు. ఇదే ఊపులో ‘దేతడి... పోచమ్మ గుడి..’ అనగానే స్పాట్లో దర్శకుడు రాజమౌళి గారితో సహా అందరూ ఒక్కటే నవ్వు. కట్ చె ప్పగానే ‘ఈ దేతడి.. పోచమ్మ గుడి.. అంటే ఏంటి వేణు?’ రాజమౌళి అడిగారు. ‘ఏం లేదండీ, ఏదో ఫ్లోలో వచ్చేసింది చెప్పేశానంతే..’ అన్నాను. అది మొదట రాజమౌళి గారికి, ఆ తర్వాత ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. పదిహేను రోజుల తర్వాత రాజమౌళిగారి నుంచి ఫోన్. ‘వేణూ.. నల్లబాలును చూసి ఎడిటింగ్ రూమ్‌లో ఒక్కటే నవ్వులు... ఆ రోల్‌తో మరిన్ని సీన్లు చేద్దాం...’ అని చెప్పారు. నేను కూడా ఉత్సాహంగా ‘ఓకే’ అన్నాను. రెండోసీన్లో పోలీస్ ముందు‘సక్కమ్మక్కలేసుకొని కొడతా..’ అని బిల్డప్ ఇస్తాడు. భాసింపట్టు వేసుకొని కూర్చోవడాన్నే సక్కమ్మక్కలేసుకోవడం అంటారు. ‘అలా కూర్చొని ఎలా కొడతావయ్యా..’ అంటూ రాజమౌళిగారు నవ్వేశారు! ముచ్చటగా మూడో సీన్లో భిక్షూయాదవ్ ఇంటి ముందు. స్టూడెంటూ, పోలీసూ గాని బండోడొకడు గోడమీద రాయడాన్ని అడ్డుకొంటే ‘నల్లబాలు.. నాకి చంపేస్తా..’ అంటూ హెచ్చరిస్తాడు... నల్లబాలుకి కట్ చెప్పి ‘నాకి ఎలా చంపేస్తావు..వేణూ’అంటూ రాజమౌళి నవ్వులు స్టార్ట్ చేశారు! కొసమెరుపు ఏమిటంటే... ఫస్ట్సీన్లో ‘అన్నా గోడ మీద రాయడానికి పర్మిషన్ కావాలంటనే..’ అంటూ కనిపించే నల్లబాలు అనుచరుడు రాజమౌళి గారే. ఆయన స్క్రీన్ మీద కనిపించిన తొలి సినిమా కూడా ఇదే! దరువెయ్యబోతే... నాకు దరువేశారు! చిన్నప్పటి నుంచి డప్పు కొట్టడం అంటే ఇష్టం. అన్నం ప్లేట్ ముందుపెట్టినా దాంతో దరువేసేవాడిని. పప్పన్నం తిన్న తర్వాత, పెరుగన్నం వడ్డించేంతలో కూడా ప్లేట్ నా చేతిలోకి వచ్చేసేది. నా దరువు పిచ్చిని చూసి అమ్మ తిట్టేది, కొట్టేది. అయినా మారలా! ఇలా నేను ఆరోక్లాసులో ఉన్నప్పుడు ఒకసారి మా కోదాడకు గద్దర్‌గారు వచ్చారు. ఊళ్లో ఆయన పాట అందుకొంటున్నంతలో ఎవరో అన్నారు.. ‘వేణూ డప్పు బాగా కొడతాడు’ అని. అంతే, అప్పటికప్పుడు ఒక డప్పు తెప్పించారు. పిల్లాడినైనా నా కోసం డ ప్పును ప్రత్యేకంగా సెట్‌చేసి కొట్టమన్నారు. అలా గద్దరన్న పాటకు దరువేసి నా ప్రతిభను ప్రదర్శిస్తున్నాను. ఇంతలో వెనక నుంచి ఎవరో పిలుస్తూ తడుతున్నారు. చిరాగ్గా వెనక్కుచూస్తే...అన్నయ్య! అక్కడ నుంచి ఇంటి వరకూ నా వీపున దరువేసుకొంటూ తీసుకెళ్లాడు. ఇంటికెళ్లాక అన్నయ్య కొట్టాడని అమ్మకు చెబితే ‘చదువుకోకుండా ఈ డప్పు పిచ్చి ఏంట్రా... పెద్దయ్యాకా శవాల ముందు డప్పుకొట్టుకొని బతుకుతావా...’ అంటూ అమ్మ మరో నాలుగు తగిలించింది. మా ఫ్యామిలీలో నన్ను కొట్టనోళ్లు ఎవ్వరూ లేరేమో! ఫ్రేమింగే కామెడీకి టైమింగ్ నవ్వించడం కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్, డైలాగుల అవసరం లేదు. ఒక్కోసారి కెమెరా ఫ్రేమింగే సీన్‌ను పండిస్తుంది. ఇది కూడా ‘సై’ సినిమా సమయంలోనే జరిగింది. విలన్ ప్రదీప్‌రావత్‌తో నాకు సీన్లుంటాయి. ‘భిక్షూ యాదవ్ అంటే వాడు నా శిష్యుడే...’ అంటూ, భిక్షూ ఎవరో తెలియక, అతడి ముందే బిల్డప్ ఇస్తాను. అసలు విషయం తెలిశాకా ‘అన్నా నీ గురువంట... నమస్తే పెట్టూ’ అంటూ భిక్షూ గ్యాంగ్‌లోని వాళ్లు అంటుంటారు. ఈ సీన్ చిత్రీకరణ కోసం మొదట ఒక స్టూల్ లాంటిది ఏర్పాటు చేసి నన్ను నిలబడమన్నారు. ఎందుకంటే ప్రదీప్‌రావత్ భారీ కాయం. ఆయన హైట్‌తో నేను మ్యాచ్ కావడానికి అలాంటి ఏర్పాటు చేశారు. అయితే అలా కాదు.. నేను మామూలుగానే నిలబడతాను, అప్పుడే ఫన్ పండుతుంది అని చెప్పాను. ఇలా షూట్ చేస్తున్నప్పుడు ప్రదీప్ నాతో కిందకి చూస్తూ మాట్లాడుతుంటాడు, నేనేమో ఫస్ట్ ఫ్లోర్‌లోని మనిషిని చూస్తున్నట్టుగా చూస్తుంటా. ఆ సీన్‌కు ఈ ఫ్రేమింగ్ భలే సెట్ అయ్యింది. మా హైట్లలో వేరియేషన్‌ను గమనించిన రాజమౌళి గారి పకపకలు నాకు ఇప్పటికీ గుర్తే!