breaking news
Protected water supply
-
కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ
తాంసి: చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం. కాలుష్యానికి ఏమాత్రం తావులేదు. గ్రామంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీ లైన్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు న్నాయి. కానీ సరైన రక్షిత నీటి సరఫరా లేదు. ఇప్పుడదే తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎంతలా అంటే ఏ ఒక్క కుంటుంబం కూడా మిగలకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయేంతగా..! విధిలేని పరిస్థితుల్లో భూగర్భ జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్న గిరిజనుల్లో పలువురు కిడ్నీ (మూత్రపిండాలు) సంబంధిత వ్యాధుల బారిన పడటం, ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. గడిచిన మూడేళ్లలో ఈ వ్యాధి బారిన పడి 12 మంది మృత్యుఒడికి చేరారు. గ్రామంలోని చేద బావులు, చేతిపంపుల నీటిని తాగడం వల్లే తమ కిడ్నీలు పాడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్న భీంపూర్ మండలం కమట్వాడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవింద్పూర్ గిరిజనులంతా గ్రామాన్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్లిపోయారు. హామీలిచ్చి మరిచిపోయారు ఆదిలాబాద్ జిల్లా గోవింద్పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు చేద బావుల నీటినే గిరిజనులువినియోగించే వారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. యువకులు సైతం వ్యాధుల బారిన పడుతుండటంతో ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన ‘సాక్షి’ 2022 నవంబర్ 4న ‘ఊరొదిలిపోతున్నారు..’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో కొందరు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని విడిచి వెళ్లవద్దని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామని భరోనా ఇచ్చారు. కానీ హామీలేవీ నెరవేరలేదు. క్రమంగా జబ్బుపడే వారి సంఖ్య, మరణాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఊరు ఖాళీ చేసి పక్కనే ఉన్న అడవి సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడ వారికి ఎలాంటి వసతులు లేవు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గుడ్డి దీపాలతో నెట్టుకొస్తున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇతర అవసరాల కోసం పక్కనున్న చెరువు, వాగు నీటిని వినియోగిస్తున్నారు. నీటిలో అధికంగా భార మూలకాలు ‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం భీంపూర్ వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల రక్త, మూత్ర నమూనాలు, గ్రామంలోని చేతిపంపుల నుంచి నీటిని సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. నీటిలో భార మూలకాల శాతం అధికంగా ఉందని, ఈ కారణంగానే కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయని అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అప్పట్నుంచీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమస్య తీవ్రత చెప్పినా పట్టించుకోలేదు బోరు బావి నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని అధికారులకు మొర పెట్టుకున్నాం. దీంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – జమునబాయి, మాజీ సర్పంచ్, గోవింద్పూర్ భార్యను బతికించుకోవాలనుకున్నా కానీ.. నా భార్య కుమ్ర భీంబాయి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పరిక్షించిన వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పారు. దీంతో ఆమెను బతికించుకునేందుకు రెండేళ్ల కిందటే మా గ్రామాన్ని వదిలేసి పక్కనే ఉన్న జెండా గూడకు వలసవెళ్లాం. కానీ కొన్నాళ్లకే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి చనిపోయింది. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు గ్రామానికి దూరంగా ఉంటూ, వ్యవసాయ పనులు కూడా ఇక్కడి నుంచే చేసుకుంటున్నా. – కుమ్ర పరశురాం, గోవింద్పూర్ గ్రామస్తుడు మరోసారి వైద్య పరీక్షలు చేస్తాం గోవింద్పూర్ గ్రామాన్ని వైద్య సిబ్బందితో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. స్థానికులు గ్రామాన్ని విడిచివెళ్లిన విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. గతంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశాం. మరోసారి నీటి పరీక్షలతో పాటు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – నిఖిల్ రాజ్, భీంపూర్ మండల వైద్యాధికారి -
ఆ నీరే ఆధారం..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పది కోట్ల మంది ప్రజలు అధిక ఫ్లోరైడ్‌తో కూడిన నీటిని తాగుతున్నారని స్వయంగా ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 12,577 జనావాసాల్లో దాదాపు 10.06 కోట్ల మంది కలుషిత నీటి బారినపడుతున్నారని పేర్కొంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి కల్తీని నివారించేందుకు నీటి శుద్ధి కేంద్రాలకు నీతిఆయోగ్ సిఫార్సు మేరకు రూ. 800 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమ బెంగాల్, రాజస్ధాన్‌లోని మారుమూల ప్రాంతాల్లో పైప్లైన్ల ద్వారా రక్షిత మంచినీటి కోసం మరో రూ. 100 కోట్లు కేటాయించామని తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. నాలుగేళ్ల వ్యవధిలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలన్నింటికీ రక్షిత మంచినీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జాతీయ నీటి నాణ్యతా మిషన్‌ను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. -
సుజలంపై నీలినీడలు
ఎన్టీఆర్ సుజల స్రవంతిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నిర్ణీత సమయంలో పథకం ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమలు కావాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ప్రక్రియ టెండర్లదశలోనే ఉంది. జిల్లాలో ఎక్కడెక్కడ వాటర్‌ప్లాంట్ యూనిట్లు ఏర్పాటుచేయాలన్నది నేటికీ ఖరారు కాలేదు. కేంద్రాల గుర్తింపు కోసం అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ప్లాంట్ల ఏర్పాటు తరువాత వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై కూడా ఒకస్పష్టతకు రాలేకపోతున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేయాలో గుర్తించలేకపోతున్నారు. విశాఖ రూరల్ : ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా గ్రామాల్లో రూ.2లకే 20 లీటర్ల రక్షిత నీటిని సరఫరా చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇందుకు సంబంధించి పైసా కూడా విడుదల చేయలేదు. ప్రైవేటు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ద్వారా దీనిని చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉండే గ్రామాలను గుర్తించారు. జిల్లాలో 376 గ్రామాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ కొద్ది రోజుల క్రితం సమావేశమయ్యారు. ఒకేసారి 376 గ్రామాల్లో ఏర్పాటు కష్టమని అధికారులే అంటున్నారు. తొలి దశలో 226 గ్రామాల్లో.. : తొలి దశలో 226 గ్రామాల్లో ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణకు 156 పరిశ్రమలు, సంస్థలు ముందుకొచ్చాయి. అయితే ప్రతీ నెలా నిర్వహణ భారం మోసేందుకు మాత్రం కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు సమకూరుస్తామని, నిర్వహణ బాధ్యతలు వేరెవరికైనా అప్పగించాలని కొందరు అధికారులను కోరినట్లు తెలిసింది. అలాగే యూనిట్ల ధర కూడా ఇష్టానుసారంగా కాకుండా నిర్దుష్టంగా ఉంటే కొనుగోలు సులభమని వారు అధికారులకు సూచించారు. 18న ధరపై నిర్ణయం : నీటి సరఫరా సామర్థ్యం మేరకు యూనిట్ ధర రూ.4.5 నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందరూ ఒక నిర్ణీత ధరకు వీటిని కొనుగోలుకు వీలుగా అధికారులు ఇటీవల ఈ యూనిట్లు సరఫరా చేసే కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 15వ తేదీ వరకు టెండర్లను స్వీకరించారు. ఈ నెల 18న వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్లాంట్ల ధరను ఖరారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చుతో పాటు నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు కొన్ని కంపెనీలు అంగీకరించకపోవడంతో ఆయా చోట్ల నిర్వహణను పంచాయతీలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఏజెన్సీలో పథకం అమలు డౌటే! : తొలి దశలో ఏజెన్సీలో 50 గ్రా మాల్లో ఈ యూనిట్లు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశించినప్పటికీ కేంద్రాల గుర్తింపు అధికారులకు తలనొప్పిగా మారింది. స్థల సమస్యతో అక్కడి అధికారులు ముందే చేతులెత్తేశారు. కనీసం 10 గ్రామాల్లో అయినా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.