breaking news
project report
-
6లోగా అదనపు సమాచారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీబేసిన్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లపై ఇతర సమాచారంగానీ, పరిశీలనలనుగానీ తమకు అక్టోబర్ 6వ తేదీలోగా సమర్పించాలని తెలంగాణకు గోదావరి బోర్డు సూచించింది. ఈలోగా అందించిన సమాచారం మేరకే ప్రాజెక్టుల అనుమతుల విషయమై ముందుకు వెళతామని, ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వకుంటే తెలంగాణ తరఫున చెప్పడానికి అదనంగా ఏమీ లేదన్నట్లుగానే భావిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండ్రోజుల కిందట బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే ఒక్కో ప్రాజెక్టుపై విడివిడిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల, చనాకా–కొరట ప్రాజెక్టుల డీనీఆర్‌లను తెలంగాణ ఇదివరకే సమర్పించగా, దీనిపై బోర్డు స్క్రూటినీ మొదలుపెట్టింది. ఒక్కో ప్రాజెక్టుకు కేటాయించిన నీరు, ప్రాజెక్టు వ్యయం, వృధ్ధిలోకి తెచ్చే ఆయకట్టుతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్న వివరాలను రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లలో వివరించింది. అయితే సీతారామసహా కొన్ని ప్రాజెక్టులపై గోదావరి బోర్డు అదనపు సమాచారం కోరింది. సీతారామ ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గే అవకాశాలున్నాయా అంటూ పలు ప్రశ్నిలు సంధించినట్లు తెలిసింది. దీంతోపాటే చనాకా–కొరటకు సంబంధించి మహారాష్ట్రకు దక్కే జలాలు, ఆ ప్రాంతంలో ఆయకట్టు వివరాలను సేకరించినట్లుగా తెలిసింది. తాము కోరుతున్న సమాచారంతోపాటు ఇతరత్రా ఎలాంటి సమాచారాన్నైనా అక్టోబర్ 6లోగా తమకు అం దించాలని కోరింది. ఈ వివరాలను సైతం పరిశీలనలోకి తీసుకొని డీపీఆర్‌లను మదింపు చేస్తామని తెలిపింది. చనాకా–కొరటపై సీడబ్ల్యూసీకి ప్రజెంటేషన్ చనాకా–కొరట ప్రాజెక్టుపై శుక్రవారం హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం ఇంజనీర్లకు ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీ నిర్మాణం, ఇప్పటివరకు చేసిన పనులు, వ్యయం, భూసేకరణ, మహారాష్ట్ర సహకారం, తెలంగాణ, మహారాష్ట్రలో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితరాలపై వివరణ ఇచ్చారు. 28న కృష్ణా బోర్డు సబ్ కమిటీ మరోమారు భేటీ గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై చర్చించేందుకు కృష్ణాబోర్డు సబ్‌కమిటీ మంగళవారం మరోమారు భేటీ కానుంది. ప్రాజె క్టుల సమాచారం, సిబ్బంది, భద్రత వంటి అంశాలపై కమిటీ చర్చించనుంది. తెలంగాణ ఇప్పటికే కొంత సమాచారాన్ని బోర్డుకు అందించగా, మరికొంత సమాచారాన్ని మం గళవారం నాటి భేటీలో సమర్పించనుంది. -
చైనా తరహాలో ఫార్మాసిటీ!
అక్కడి చెంగ్డూ సిటీ తరహాలో చేపట్టాలని నిర్ణయించిన తెలంగాణ సర్కారు అధునాతనంగా నిర్మించే దిశగా కసరత్తు ఫార్మాసిటీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన అధికారులు భూముల సేకరణ టీఎస్ఐఐసీకి.. ప్రాజెక్టు రిపోర్టుల రూపకల్పన కన్సల్టెన్సీలకు అప్పగింత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో నిర్మించతలపెట్టిన ఫార్మా సిటీని చైనాలోని చెంగ్డూ నగరం తరహాలో చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు నాలుగు వేలకు పైగా ఔషధాల తయారీ పరిశ్రమలు ఉన్న చైనాలోని ‘చెంగ్డూ బయో ఫార్మాస్యూటికల్ సిటీ’కి ఆసియా ప్రాంతంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆ నగరంలో వేలాది ఫార్మసీ కంపెనీల స్థాపనకు తోడ్పడిన మౌలిక వసతులు, సదుపాయాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే అక్కడికి రాష్ట్ర అధికారుల బృందాన్ని పంపించి, పరిశీలన చేయాలని భావిస్తోంది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలోని ముచ్చెర్ల ప్రాంతంలో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫార్మా కంపెనీల దిగ్గజాలతో కలిసి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే కూడా చేశారు. అనువైన ప్రాంతాలను గుర్తించి అక్కడే అధికారులు, ఫార్మసీ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీకి అవసరమైన భూములను గుర్తించాలంటూ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ), పరిశ్రమల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మౌలిక సదుపాయాలకు సంబంధించి అంచనా వ్యయంతో సహా అవసరమైన అన్ని అంశాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది కూడా. ఈ మేరకు భూముల సర్వే, ప్రాజెక్టు రిపోర్టు , పర్యావరణ సంబంధిత అంశాలను పరిశ్రమల విభాగం ప్రైవేటు కన్సల్టెన్సీలకు అప్పగించింది. జురాంగ్, ఐఎల్ఎఫ్ఎస్, ఎల్అండ్టీ రాంబోల్ కంపెనీలకు ఈ పనులు అప్పగించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నివేదికలు అందిన అనంతరం ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి ఫార్మా సిటీకి అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.