breaking news
Professional associations JAC
-
రిజిస్ట్రేషన్ల శాఖలో ఆ జిల్లాలే కీలకం!
- లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు,రూ. వందల కోట్లలో ఆదాయం - హైదరాబాద్, శంషాబాద్, మల్కాజిగిరి జిల్లాలపైనే అందరి దృష్టి - ఆయా జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల కోసం జోరందుకున్న పైరవీలు సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి మూడు జిల్లాలు కీలకం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖకు వచ్చే వార్షికాదాయంలో 75 శాతం ఈ మూడు జిల్లాల నుంచే వస్తుండటంతో ఆయా జిల్లాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ జిలాల్లోనే అత్యధికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఆయా జిల్లాల పరిధిలో విలువైన భూములు ఉండటం, క్రయ విక్రయాలు అధికంగా జరుగుతుండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉంది. ఏటా సుమారు లక్షదాకా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా ప్రభుత్వానికి రూ.వేల కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన 27 రెవెన్యూ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి 27మంది జిల్లా రిజిస్ట్రార్లను నియమించాల్సి ఉండగా, కీలకమైన మూడు జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ పోస్టులపైనే అందరి దృష్టి పడింది. పోస్టింగుల కోసం పైరవీల జోరు కొత్త జిల్లాల్లో పరిపాలనకు డెడ్‌లైన్ కూడా ఖరారు కావడంతో పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న వారితో పాటు తాజాగా పదోన్నతుల జాబితాలో ఉన్న గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్లు కూడా పోటీ పడుతున్నారు. అయితే.. ప్రతిపాదిత హైదరాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ జిల్లాల రిజిస్ట్రార్ కుర్చీలపై రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం కీలకంగా ఉన్న హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి వెస్ట్, రంగారెడ్డి ఈస్ట్ జిల్లాల్లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులు తమ కర్చిఫ్లు వేసేశారని, ప్రభుత్వ పెద్దలతో పాటు ఉన్నతాధికారుల ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నందున వీరికి కాకుండా మరొకరికి పోస్టింగులు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రయత్నిస్తే పోయిదేముందిలేనని కొందరు గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్లు కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చే పక్షంలో కనిష్టంగా రూ.50 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటి ముట్టజెప్పేందుకు ఐదారుగురు అధికారులు తమకు అనుకూలురైన వ్యక్తుల వద్ద సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ రిజిస్ట్రేషన్ జిల్లాలకు మినహా మిగిలిన జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను పిలిచి ఊరికే ఇచ్చినా వెళ్లేందుకు అర్హులైన అధికారులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. 16 జిల్లాల ప్రతిపాదన అటకెక్కినట్లే! రెవెన్యూ జిల్లాలతో సమానంగా రిజిస్ట్రేషన్ జిల్లాలను పెంచవద్దని, ఒకవేళ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ జిల్లాలను కూడా పెంచాలనుకుంటే ప్రస్తుతం ఉన్న 12 జిల్లాలను 16 జిల్లాలుగా చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ చేసిన ప్రతిపాదనలు తాజాగా అటకెక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉన్నతస్థాయిలో 27 జిల్లాల ఏర్పాటు నిర్ణయం జరిగిపోయాక కొత్తగా ప్రతిపాదనలను పరిశీలించే పరిస్థితి లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు జేఏసీ ప్రతినిధులకు నర్మగర్భంగా చెప్పారని కొందరు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. -
ఉద్యోగుల విభజన వేగవంతం చేయిస్తా
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ హామీ సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలంగాణలోని వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఢిల్లీలో మీ ప్రతినిధిగా ఉండి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్, కమిటీలు, అధికారులతో సమావేశమై ఉద్యోగుల విభజన ఇంకా ఆలస్యం జరగకుండా సత్వరమే పూర్తిచేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి నేతృత్వంలో 13 ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై 14 నెలలు కావస్తున్నా ఉద్యోగుల విభజన అపరిష్కృతంగానే ఉండటం బాధాకరమని, దీనికి గత ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. ఆదరా, బాదరాగా విభజన చట్టాన్ని చేసి అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. సంక్లిష్టమైన విషయాలను రాజ్యాంగ బద్ధంగా పరిష్కరించడానికి నైతిక బాధ్యత తీసుకుంటానన్నారు. ఉద్యోగుల విభజనలో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల విభజనకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న మార్గదర్శకసూత్రాలను సవరించాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. కమలనాథన్ కమిటీ కొత్త వివాదాలకు దారితీస్తు తెలంగాణకు నష్టం కలగజేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం.. ఉద్యోగుల విభజన సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో మరో ఉద్యమం ఊపిరి పోసుకోనుందని హెచ్చరించారు. సహకారం ఉంటేనే విభజన.. * ఉద్యోగ సంఘాల నేతలతో అర్చనా వర్మ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం ఉంటేనే రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన సాధ్యపడుతుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ తనను కలిసిన తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం డీవోపీటీ కార్యాలయంలో అర్చనా వర్మను కలసి ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను నిరుద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా.. ఆప్షన్ల పేరుతో ఏపీ ఉద్యోగులను భర్తీ చేసే విధానం సరికాదని, ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఆప్షన్లు ఒక ప్రాతిపదికే తప్ప పూర్తిగా అదే ప్రాతిపదికన చేయాలని చట్టం చెప్పలేదని వివరించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన డీవోపీటీ సంయుక్త కార్యదర్శి స్పందిస్తూ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే ఉద్యోగుల విభజన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డట్టు తెలిసింది.