breaking news
problems solution
-
కేఎస్ఆర్టీసీ సిబ్బంది సమ్మె
సమస్యల పరిష్కారానికి డిమాండు దొడ్డబళ్లాపురం: సమస్యలు పరిష్కరించడంతో పాటు, అధికారుల వేధింపుల నుంచి తమను రక్షించాలంటూ దొడ్డబళ్లాపురం కేఎస్ఆర్టీసీ బస్ డిపో కార్మికులు, డ్రైవర్లు, కండెక్టర్లు మెరుపు సమ్మెకు దిగారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు డిపోకు వచ్చిన సుమారు వంద మందికి పైగా కార్మికులు విధులు బహిష్కరించి డిపో ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... డిపో నుంచివేరే డిపోకి ఏడు సంవత్సరాల క్రితమే బదిలీ అయినప్పటికీ ఇప్పటికీ వారిని ఇక్కడే కొనసాగిస్తున్నారన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి కుటుంబ సభ్యులను చూసి రావాలంటే డిపో మేనేజర్ సెలవు ఇవ్వడం లేదని, ఇచ్చినా ఒక్క రోజు మాత్రమే ఇస్తారని దూరపు ప్రాంతాలకు వెళ్లాలంటే కనీసం రెండు రోజులు పడుతుందని వాపోయారు. విధులకు రావడం కాస్త ఆలస్యమైనా ఆరోజు సెలవుగా నమోదు చేస్తారన్నారు. దొడ్డబళ్లాపురం డిపోకు ఇతర డిపోలలో మూలకు పడేసిన బస్సలను ఇస్తున్నారని, ఆ బస్సులు మార్గమధ్యలోనే ఎక్కడ బడితే అక్కడ నిలిచి పోవడంతో ప్రయాణికులు గొడవకు దిగుతున్నారని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేసారు. స్టీరింగ్, గేర్, క్లచ్‌లు కండీషన్లో లేవని చెబితే ఇష్టం ఉంటే పనిచేయండి లేదంటే ఇంటికి వెళ్లండి అంటూ అధికారులు దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. డిపో మెకానిక్‌లు మాట్లాడుతూ డిపోలో మెకానిక్ సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారన్నారు. 24 గంటలూ పని చేయించడంతో పాటు సెలవులో ఉన్నా ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటారన్నారు. ఈ నెల పేమెంట్ స్లిప్‌లో కార్మికులు విధులు నిర్వహించిన దినాలను కూడా సెలవుగా చేర్చి తక్కువ వేతనం ఇచ్చారని వాపోయారు. కార్మికుల సమ్మె సమాచారం అందుకున్న డీటీఓ శివ ప్రకాశ్ ఘటనా స్థలానికి విచ్చేసి కార్మికుల సమస్యల గురించి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు ఉద్యమ బాట పట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డెరైక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లావ్యాప్తం గా 24 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తు న్న అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో కాకినాడ తరలివచ్చారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఐసీడీఎస్ పీడీ కార్యాల యం వద్ద బైఠాయించారు. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, అధికారుల తీరుపై నిరసన తెలిపారు. ప్రాజెక్ట్ డెరైక్టర్ నిర్మల సంఘ ప్రతినిధులతో చర్చించారు. ఆయా సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు ఆందోళన విరమించారు. పెంచిన పని గంటలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, సెంటర్ల అద్దెను బేషరతుగా ఏప్రిల్ నుంచి అమలు చేయాలని కోరారు. పుల్లల బిల్లులు చెల్లించాలని, గ్యాస్ సరఫరా చేయాలన్నారు. పెరిగిన పని గంటల నేపథ్యంలో బీఎల్ఓ విధుల నుంచి తప్పించాలని, ఫీడింగ్ సరఫరా కొలతలు సక్రమంగా జరిగేల చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన కోడిగుడ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్లపై వేధింపులు అరికట్టాలని, జనశ్రీ బీమా యోజన సక్రమంగా అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రైవేటు, స్వచ్ఛంధ సంస్థలకు ప్రవేశం కల్పించవద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బేబీ రాణి మాట్లాడుతూ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల అద్దె పెంచినప్పటికీ, వాటిని అమలు చేయడానికి షరతులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు అన్ని సౌకర్యాలతో పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ వ్యవస్థీకృతం పేరుతో 10 శాతం అంగన్వాడీ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రభుత ఉపసంహరించుకోవాలన్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో పోరాటం చేపట్టామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దువ్వా శేషబాబ్జి, అజయ్‌కుమార్, సీపీఎం నాయకుడు పలివెల వీరబాబు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.