breaking news
Pregnent delivery on road
-
Hyderabad: నడిరోడ్డుపై మహిళ ప్రసవం
సాక్షి, సైదాబాద్: ఆరాంఘర్‌లో నివసించే మేస్త్రీ రాజు, రాజేశ్వరి దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రాజేశ్వరి నిండు గర్భిణి. రాజుతో గొడవ పడిన ఆమె మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం శంకేశ్వరబజార్ నుంచి సైదాబాద్ వైపు వెళ్తుండగా రాజేశ్వరికి పురిటి నొప్పులు వచ్చాయి. రహదారి పక్కన ఆమె బాధపడుతూ కూర్చుండి పోయింది. అప్పుడు అక్కడే ఉన్న శంకేశ్వరబజార్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లిమెల్లి మోజెస్ తదితర కాలనీవాసులు 108కు సమాచారం ఇచ్చారు. అలాగే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి విషయం తెలిపి సహకరించాల్సిందిగా కోరారు. 108 వచ్చేలోపే పునే రాజేశ్వరి రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పుట్టిన బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లి సపర్యాలు చేశారు. 108 సిబ్బంది రాజేశ్వరికి 108లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తల్లీబిడ్డలను 108లో కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. -
ఆదుకోని. కుయ్...కుయ్...
సకాలంలో రాని 108 వాహనాలు ఆపదలో ఉన్న వారికి అవస్థలు అందని మునుపటి సేవలు ఆర్థిక ఆంక్షలే కారణం సాక్షి ప్రతినిధి, విజయనగరం: గజపతినగరం నడిరోడ్డుపై మంగళవారం గిరిజన మహిళ ప్రసవించింది. అనంతగిరి మండలం పైడిపర్తి గ్రామానికి చెందిన ఎలిగరపు జమ్మాలమ్మకు నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించినా వారు సకాలంలో రాకపోవడంతో గజపతినగరంలో ఉన్న ఆస్పత్రికి బస్సుపై తీసుకొస్తుండగా అక్కడకు చేరుకునే లోపే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే ఆమెను గజపతినగరం ప్రధాన రహదారిపై దింపేసి ఆస్పత్రికి ఫోన్ చేయగా వారు స్ట్రెచర్ పంపిస్తామని, ఆస్పత్రికి తీసుకురావాలని సిబ్బంది సెలవిచ్చారు. కాలినడకన ఆస్పత్రికొస్తుండగా మెంటాడ రోడ్డులోనే ఆమె ప్రసవించింది. – మెంటాడకు చెందిన ఓ గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుంటే మెంటాడ జెడ్పీటీసీ పొట్నూరి మాధవి 108కి ఫోన్ చేశారు. ప్రస్తుతం అందుబాటులో లేదని మెరకముడిదాం మండలం నుంచి పంపిస్తామని సమాధానం వచ్చింది. అప్పటికే కాలాతీతం అయ్యింది. ఇంకా వేచి చూడటం మంచిది కాదని ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లారు. లేదంటే ఆ గర్భిణీ ఇబ్బంది పడేది. – గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన రెడ్డి బంగారయ్య, కసిరెడ్డి సత్యం అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై విజయనగరం నుంచి గంట్యాడ వెళ్తుండగా రామవరం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయ పడ్డారు. స్థానికులు 108 కు ఫోన్ చేయగా వేరే కేసులోఉన్నామనీ, రావడానికి సమయం పడుతుందని చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న ఆ ఇద్దరినీ వేరే లగేజ్ ఆటోలో ఆస్పత్రికి తరలించారు. – జిల్లాలో 108 సేవల్లో కలుగుతున్న జాప్యానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సర్కారు తీరువల్లే ఈ పరిస్థితి ఎదురయ్యిందన్నది సర్వత్రా వినిపిస్తున్న వాదన. – 108... అపర సంజీవిని. ఒకప్పుడు ఫోన్ చేయగానే కుయ్...కుయ్..కుయ్ అంటూ పరుగెత్తుకొచ్చేవి. ఇప్పుడు పోన్ చేస్తే వెయిట్ చేయ్... వెయిట్ చేయ్ అనే సమాధానం వస్తోంది. గంటలకొద్దీ తాత్సారం చేయడం తప్ప ఆపదలో ఫోన్ చేసినోళ్లకు వెంటనే ఉపశమనం కలగడంలేదు. అనారోగ్యమా.... డెలివరీయా... రోడ్డు ప్రమాదమా... స్వల్ప గాయాలా... తీవ్రగాయాలా... అంటూ ఆరా తీసేసరికే సమయమంతా అయిపోతోంది. విషమ పరిస్థితి ఉందని చెబితే తప్ప స్పందించడంలేదు. భారాన్ని తగ్గించుకునేందుకే... ఒకప్పటి మాదిరిగా ఎవరైనా ఆపదలో ఉన్నారు 108 కావాలని ఫిర్యాదు చేస్తే వెంటనే వచ్చే పరిస్థితి లేదు. సేవలందించేందుకు సిబ్బంది ఉన్నా... సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నారు. పైగా ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను తీసుకు వెళ్లమని ఆంక్షలు పెడుతున్నారు. ఇదంతా భారాన్ని తగ్గించుకోవడానికేనన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న 108వాహనాలను ఇతరత్రా సేవలకు ఉపయోగించడంతో మరిన్ని సమస్యలొస్తున్నాయి. స్థానికంగా వాహనాలు అందుబాటులో ఉండకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తోంది. ఈ లోపు ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకుంటున్నాయి. ఈ ఆపద్భాంధవికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.