breaking news
postmartam delay
-
ఎంజీఎంలో నిలిచిపోయిన పోస్టుమార్టం సేవలు
సాక్షి, వరంగల్ : వైద్యుడు లేక ఎంజీఎం ఆసుపత్రిలో శనివారం పోస్టుమార్టం సేవలు నిలిచిపోయాయి. దీంతో మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాల్సిన డెడ్‌బాడీలు నాలుగు ఉన్నాయి. నిబంధనల మేరకు ఉదయం 10 నుండి సాయంత్రం 6 లోపు పోస్టుమార్టం చేయాల్సి ఉండగా, ఉదయం నుంచి డాక్టరు అందుబాటులో లేకుండా పోయారు. రేపు ఆదివారం కావడంతో పోస్టుమార్టం జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డెడ్‌బాడీలకు అంత్యక్రియల కోసం మృతుల ఇళ్ల దగ్గర బంధవులు వేచి చూస్తున్నారు. -
మరణించినా ఆమెను వీడని నరకం!
► ఆమె మృతి చెంది 48 గంటలు దాటింది ► పోస్టుమార్టం శనివారానికి వాయిదా వేయడంతో 60 గంటలు దాటనుంది ► అధికారుల నిర్లక్ష్యంతో కుళ్లుతున్న మృతదేహం వరకట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఆమె బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. గురువారం శవ పంచనామా పూర్తి చేసి బంధువులకు అప్పగిస్తే ఆ రోజు సాయంత్రమైనా అంత్యక్రియలు ముగించేవారు. గురువారం కూడా ఏవో కారణాలు చూపిస్తూ వాయిదా వేశారు. కనీసం శుక్రవారమైన దయతల్చుతారంటే అదీ లేదు. శనివారం పోస్టుమార్టం చేస్తామనడంతో బంధువులు గొల్లుమంటున్నారు. రెవెన్యూదే బాధ్యతంటూ వైద్యులంటే... పోలీసులదే ఈ పాపమంటూ రెవెన్యూ... ఆ రెండింటి మధ్య సమన్వయం లేకపోతే తామేమి చేయగలమంటున్నారు వైద్యులు. మానవత్వానికే తలదింపులు తెచ్చే ఘటన పిఠాపురం మండలంలో చోటుచేసుకుంది. పిఠాపురం: ఒక అభాగ్యురాలు... అత్తవారి వరకట్న దాహానికి బలైంది. నిండా 20 ఏళ్లు నిండకుండానే తనవు చాలించిన ఆమెకు మరణించిన తర్వాత కూడా నరకం తప్పడం లేదు. ఆమె మృతి చెంది 48 గంటలైనా ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసే అవకాశం లేక ఆ మృతదేహం కుళ్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు, రెవెన్యూ వైద్యశాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని మృతురాలి బంధువులు వాపోతున్నారు. కొత్తపల్లి మండలం వాకతిప్పకు చెందిన పసుపులేటి క్రాంతిరేఖ (20) అత్తవారి వరకట్న వేధింపులు తాళలేక బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గురువారం ఉదయం ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ ఎండీ ఉమర్ పరిశీలించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖాధికారుల సమన్వయ లోపంతో మృతదేహం పిఠాపురం ప్రభుత్వాసుపత్రి పోస్టుమార్టం గదిలో ఉండిపోయింది. ఇక్కడ మార్చురీ లేకపోవడం వల్ల ఆ మృతదేహం కుళ్లిపోతోందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయానికి పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఆమె మృతిచెంది సుమారు 60 గంటలవుతున్నా మానవత్వం మరచి సాగదీయడం దయనీయం. దీనిపై కొత్తపల్లి పోలీసులను సంప్రదించగా రెవెన్యూ అధికారులతో శవ పంచనామా పూర్తి కాకపోవడం వల్ల ఆలస్యమైందని చెప్పారు. శవపంచనామా పూర్తి కాక పోవడం వల్ల పోస్టుమార్టం చేయలేక పోయామని వైద్యులు చెబుతున్నారు. బిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మృతురాలి బంధువులు అంత్యక్రియలు చేయడానికి 60 గంటలు వేచి చూడాల్సి వస్తోంది.