breaking news
pilan
-
విజయనగరం నుంచే విజయం : బొత్స
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 24న విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరనున్న సందర్భంగా దేశపాత్రుని పాలెంలో పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. నాడు మహానేత వైఎస్సార్ ప్రజాప్రస్థానం నిర్వహిస్తే నేడు ఆయన తనయుడు అంతే నిబద్ధతతో ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 11 జిల్లాలో పూర్తై 12 జిల్లాలో అడుగుపెడుతున్న ప్రజాసంకల్పయాత్రను గొప్ప చారిత్రత్మాక విజయంగా బొత్స వర్ణించారు. జగన్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని.. ప్రతి జిల్లాలో అశేష జనవాహిని ఆయన వెంట కదలి వస్తోందని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీనే విజయం సాధిస్తుందని.. విజయం నగరం జిల్లా నుంచే విజయం ప్రారంభమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ అన్ని రంగాల్లో వెనకబడిందని.. అత్యాచారాలలో మాత్రం బిహార్‌ను మించిపోయిందని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు. విజయనగరం జిల్లాలో వైద్య కళాశాల, సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తానన్నారు.. కానీ ఇంతవరకూ ఒక్కసారి కూడా వాటి ప్రస్తావన కూడా తేలేదని ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్లలో జిల్లాలో ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశారా అని బొత్స ప్రశ్నించారు. కమిషన్ల కోసమే భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. పోలవరంలో జరిగిన అవినీతి గురించి కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని తెలిపారు. అవినీతి జరిగింది నిజమే కాబట్టి కాగ్ నివేదిక మీద ఇంతవరకూ చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పాలన రావాలంటే అది జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతోందని ప్రకటించారు. -
పైలాన్.. పరేషాన్!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పైలాన్ ఆవిష్కరణకు అడ్డంకులు ఎదురవుతున్నారుు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పైలాన్ నిర్మించారు. దీని ఆవిష్కరణ తేదీపై స్పష్టత రాకపోవడంతో మిషన్ కాకతీయ పనులు మొదలయ్యే పరిస్థితి కనపడడం లేదు. వర్షాలు లేకపోవడంతో చెరువుల మరమ్మతులు చేసేందుకు ప్రస్తుత సీజన్ అనువుగా ఉంది. పైలాన్ ఆవిష్కరణ, పనుల ప్రారంభానికి లంకె పెట్టడంతో పథకం ప్రారంభం వాయిదా పడుతోంది. నీటి వనరుల లభ్యత పెంచేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వందల ఏళ్ల క్రితమే గొలుసుకట్టు చెరువులను నిర్మించిన కాకతీయులను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమానికి ‘మిషన్ కాకతీయ’ అని పేరు పెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేక చిహ్నం(పైలాన్) ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాకతీయుల పరిపాలన కేంద్రంగా ఉన్న వరంగల్‌లో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్‌లోని చిన్న నీటిపారుదల శాఖ కార్యాలయం ఆవరణలో జనవరి 6న పైలాన్ నిర్మాణం మొదలుపెట్టారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. పైలాన్ ఆవిష్కరణకు వస్తానని ఉమాభారతి అంగీకరించారు. జనవరి 29న పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట భావించారు. ఈ మేరకు పైలాన్ నిర్మాణ పనులను జనవరి 25 నాటికే పూర్తి చేశారు. కానీ.. ఇప్పటివరకు ఆవిష్కరణ తేదీపై స్పష్టత రావడంలేదు. మిషన్ కాకతీయలో రాష్ట్రవ్యాప్తంగా చిన్న నీటి వనరులు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని 46,531 చెరువులను ఐదేళ్లలో పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చెరువులతో 265 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని అధికారులు అంచనా చేశారు. ప్రతి ఏటా 9,306 చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించారు. డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాల్లో 1934 చెరువుల కోసం ప్రభుత్వం ఇప్పటికి రూ.762.30 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులు పూర్తయితే 2.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అధికారులఅంచనా.