breaking news
philen cyclone
-
తుఫాన్ పీడిత ప్రాంతాల్లో బయటపడుతున్న నష్టాలు
-
సహాయక చర్యలకు పక్కా ఏర్పాట్లు: కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రాణనష్టాన్ని నివారించేందుకు ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేశామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుపాను సహాయక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘భారీ వర్షంతో పాటు తీవ్రవేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రాణనష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించాం. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రత్యేకాధికారులుగా హైదరాబాద్ నుంచి వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా. ఆర్మీ, నేవీ సిబ్బందితోపాటు జాతీయ విపత్తు సహాయక దళాల సిబ్బందిని కూడా సహాయ కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉంచాం. హెలికాప్టర్లు, బోట్లు సహా అన్నీ సిద్ధంగా ఉన్నాయి’ అని సీఎం వివరించారు. ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థ...: తుపాను వల్ల టెలిఫోన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వైర్లెస్ సెట్లు, శాటిలైట్ ఫోన్లు, హామ్ రేడియోలను సిద్ధం చేశామన్నారు. ప్రజలకు అందించేందుకు ఔషధాలు, మంచినీటి ప్యాకెట్లతో పాటు వైద్య సేవలకు సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలిచ్చామన్నారు. మంత్రులు ఆనం, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, మహీధర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పై-లీన్ తుపాను ప్రభావంతో.. భీతిల్లిన బారువ
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామం... ఉదయం 6 గంటలు: గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు. వాటికి తోడు చిరుజల్లులు. తుపాను ముప్పు హెచ్చరికలు ఉన్నా.. ‘ఆ అవన్నీ మనకు మామూలే కదా’ అన్న భావనే స్థానికుల్లో కనిపించింది. షరామామూలుగా దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఉదయం 7.30 - 10 గంటల మధ్య: వాతావరణంలో కొంత మార్పు. గాలి వేగం.. వర్షం జోరు పెరిగింది. అయినా షాపులు, హోటళ్లు తెరుచుకున్నాయి. ఎవరిలోనూ పెద్దగా ఆందోళన లేదు. ఉదయం 10 - 12 గంటల మధ్య: గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లు మించింది. దాంతోపాటే స్థానికుల్లో ఆందోళన పెరిగిపోవటం మొదలైంది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగింది. మధ్యాహ్నం 12 - 2 గంటల మధ్య: పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు గ్రామానికి చేరుకుని మైకుల్లో హెచ్చరికలు జారీ చేయటం మొదలుపెట్టారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న బీచ్‌ను ఖాళీ చేయించారు. రోడ్లు, వీధుల్లో ఉన్న వారిని ఇళ్లలోకి పంపించేశారు. వాహనాలను కూడా తిరగనివ్వలేదు. 2 - సాయంత్రం 6 గంటల మధ్య: అంతవరకు కొంత సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది. షాపులు మూతపడ్డాయి. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలి హోరెత్తింది. జనం గుండెల్లో గుబులు రేగింది. సాయంత్రం 6 గంటల తర్వాత: పరిస్థితి మరింత భీకరంగా మారింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. కరెంటు లేదు. అంతటా అంధకారం. ఏం జరుగుతుందో.. బయటకెళితే ఏమైపోతామోనన్న భయం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. తుపాను తీరాన్ని తాకకముందు బారువ గ్రామంలో శనివారం నెలకొన్న పరిస్థితి ఇది. సముద్ర తీరంలోనే ఉన్న ఈ మేజర్ పంచాయతీకి ఆనుకొని తీరంలో బారువకొత్తూరు, వాడపాలెం ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 3,500 మందిని సోంపేట, బారువల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. సముద్రపు అలలు కొత్తూరు, వాడపాలెం గ్రామాలను తాకి భీతిగొల్పాయి. ఇద్దివానిపాలెం, ఈదుపురం, కపాసుకుద్ది, నువ్వులరేవు, మంచినీళ్లపేట, బందరువానిపేట, దేవునల్తాడ, ఒంటూరు, పూడివలస తదితర పదుల సంఖ్యలో గ్రామాలు శనివారం నాటి పెను తుపాను విలయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపాయి. శనివారం రాత్రి గడిస్తే తప్ప.. తుపాను విలయం ఏ స్థాయిలో ఉంది? ఎవరు ఎక్కడున్నారు? ఆస్తులు ఎలా ఉన్నాయో?... నష్టం ఏస్థాయిలో ఉందో తెలుసుకోలేని దయనీయ స్థితి. - న్యూస్‌లైన్, కంచిలి