breaking news
People in the rural areas
-
గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు
ములుగు: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ములుగు మండలం నర్సాపూర్ మీదుగా సికింద్రాబాద్‌కు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును బుధవారం మంత్రి ఈటెల, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశంలోనే ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందూ ప్రజలకిచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తప్పకుండా నెరవేరుస్తారన్నారు. దసరా పండుగ నుంచి సీఎం కొత్త పథకాలకు శ్రీకారం చుడతారన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సీఎం, మంత్రుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జెడ్పీటీసీ సత్తయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూంరెడ్డి, మున్సిపల్ చెర్మైన్ భాస్కర్, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, సర్పంచ్ మల్లేష్‌యాదవ్, సహకార సంఘం చెర్మైన్ పోషిరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు జహంగీర్, ఉపాధ్యక్షుడు అర్జున్‌గౌడ్, అయిలయ్య, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాస్ శ్రీనివాస్,నాయకులు దేవేందర్‌రెడ్డి, బాపురెడ్డి, భాస్కర్‌రెడ్డి, గణేష్, భూపాల్‌రెడ్డి, కాంతారెడ్డి పాల్గొన్నారు. -
వ్యాధులతో గిరిజనులు విలవిల!
టేక్మాల్: సీజనల్ వ్యాధులతో గ్రామీణ ప్రాంత ప్రజలు విలవిలాడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు వ్యాధులతో వణికిపోతున్నారు. సమయానికి వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట మదిర నల్లకుంట తండాకు చెందిన గిరిజనులంతా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. తండాకు చెందిన దేవీసింగ్ (50) దోలీబాయి (40), ఇఠ్యానాయక్ (32),అంబ్యా నాయక్ (55), చాందిబాయి(40), దుమ్యా నాయక్ (54) సేవ్యానాయక్(24), ప్రవీణ్, వైష్ణవి, చరణ్, సునీత, శ్రీకాంత్, శ్రావణ్, రోహిత్, శ్రీలత తదితరులు (పది సంవత్సరాల లోపు చిన్నారులు) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారంతా జ్వరంతో, నొప్పులతో బాధపడుతూ మంచం పట్టారు. రోగాలు చిన్నారులకు ఎక్కువగా సోకడంతో పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు గత నాలుగు రోజులుగా వెళ్లడం లేదని ండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలోని నల్లాలు, చేతిపంపులు, జెట్ పంపుల చుట్టూ, ఇళ్ల చుట్టూ మురికి నీరు పేరుకుపోయింది. కాలువల్లో నీరంతా ఎక్కడి కక్కడ దుర్గధం వెదజల్లుతోంది. తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో నీరంతా కలుషితమై, ఈగలు, దోమలు వ్యాప్తి చెంది పలువురు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పలుమార్లు వైద్యాధికారులు ఫిర్యాదు చేసినా వారు తొంగి చూసిన పాపాన పోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న పాపన్నపేట మండలంలోని నార్సింగ్, శంకరంపేట, టేక్మాల్, మెదక్ తదితర పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నామన్నారు. దీంతో విపరీతమైన డబ్బు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తండాలో పారిశుద్ధ్య పనులు చేపట్టి వైద్య సేవలను అందించాలని గిరిజనులు కోరుతున్నారు.