breaking news
Pending drainage works
-
ఇదేం ‘దారి’ద్య్రం !
పాల్వంచరూరల్: భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతోంది. పెంచిన గడువు ప్రకారం గత మార్చి నెలాఖరు నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడవ ప్యాకేజీ కింద సుమారు రూ.229 కోట్ల వ్యయంతో సారపాక నుంచి రుద్రంపూర్ వరకు 42 కిలోమీటర్ల మేర ఫోర్ లేన్ జాతీయ రహదారి పనులు సాగుతున్నాయి. 2017 నాటికే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటికి 36 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్డు నిర్మించారు. ఇంకా 6 కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. మొర్రేడు, గోధుమ వాగులపై రెండు బ్రిడ్జీలు కూడా నిర్మించాల్సి ఉంది. ఇవి కాకుండా పెద్దమ్మగుడి సమీపంలో కల్వర్టు పనులు చేపట్టాలి. ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి సింగరేణి గెస్ట్ హౌస్ వరకు ఒకవైపు రహదారి పనులు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. రామవరం వద్ద గోధుమ వాగుపై బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదు. గోదావరి బ్రిడ్జిదీ ఇదే దుస్థితి.. భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. ఇక జాతీయ రహదారికి ఇరువైపులా డ్రైనేజీ పనులు కూడా అస్తవ్యస్తంగానే చేశారు. 54 కిలోమీటర్ల దూరం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 30 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. పెద్దమ్మగుడి ఎదుట ఇంకా నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఆరోగ్యమాత చర్చి నుంచి సీ కాలనీ గేటు, బస్టాండ్ సెంటర్ నుంచి దమ్మపేట సెంటర్ వరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మించలేదు. అయితే ఒకవైపు రోడ్డు ఎత్తుగా, మరోవైపు తక్కువ ఎత్తు ఉండటంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. పెద్దమ్మగుడి సమీపంలోని జగన్నాధపురంలో ఒకవైపు రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. పనులు చేసే మార్గంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ఇసుక బస్తాలను కొన్ని చోట్ల, డ్రమ్ములను మరికొన్ని చోట్ల పెట్టారు. దీంతో రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైవే పనులు నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017 జూలై నాటి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఒప్పందం ఉండగా, జాప్యం కావడంతో అ«ధికారులు గడువును ఏడాది పాటు పొడిగించారు. అది కూడా పూర్తయినా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇక రోడ్డు పనులు నిలిపిన చోట హెచ్చరిక బోర్డులుగా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయక పోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఫుట్‌పాత్ నిర్మాణం.. జాతీయ రహదారి నిర్మాణం పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తుండగా.. ఫుట్‌పాత్ పనులు మరీ దారుణంగా ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్‌ఫాత్ నిర్మాణం చేసిన తర్వాత క్యూరింగ్ చేయక పోవడం, పటిష్టంగా నిర్మించకపోవడంతో అక్కడక్కడ ఇటుకలు లేచి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్ఫాత్ నిర్మాణ పనులను పటిష్టంగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. త్వరగా పూర్తిచేయాలి భద్రాచలం నుంచి రుద్రంపూర్ వరకు నాలుగు సంవత్సరాల క్రితం చేపట్టిన హైవే రోడ్డు నేటికీ పూర్తి కాలేదు. చేస్తున్న పనుల్లోనూ నాణ్యత లేదనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు త్వరగా, నాణ్యంగా చేపట్టాలి. – షఫీ, రామవరం ఇంకెన్నాళ్లకు పూర్తి చేస్తారో జాతీయ రహదారి పనులు నత్తడకన సాగుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. ఫుట్ఫాత్ పనులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. వేసవిలో క్యూరింగ్ లేకుండా పనులు చేస్తున్నారు. – రాము, పాల్వంచ రెండు వాగులపై బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉంది జాతీయ రహదారి నిర్మాణ పనులు అపకుండా నిర్వహిస్తున్నాం. దాదాపుగా పూర్తి కావచ్చాయి. మొర్రేడు వాగు, గోధుమ వాగులపై రెండు బ్రిడ్జీలను నిర్మించాల్సి ఉంది. మూడు నెలల్లో ఈ పనులు పూర్తిచేస్తాం. గోదావరి నదిపై కూడా బ్రిడ్జి నిర్మాణం అక్టోబర్ నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది జనవరి నాటికి రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో కాంట్రాక్టర్‌కు పదిశాతం అపరాధ రుసుం విధించాం. – వెంకటేశ్వరరావు, హైవే ఈఈ -
గుండ్లకమ్మ.. గుండె చెమ్మ!
►గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులకు మోక్షమెప్పుడో? ►వైఎస్ పాలనలో రూ.543.43 కోట్ల నిధులు ►ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తి ►చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ.34.27 కోట్లు ►మూడేళ్లలో రూ.30 కోట్ల పనులు పూర్తి చేయలేని వైనం ►భూ సేకరణకు రైతులను ఒప్పించలేని అధికారులు ► 4 కి.మీ. మేర ఎడమ కాలువ పనులు పెండింగ్ ►నిలిచిపోయిన డిస్ట్రిబ్యూటరీ లింక్ పనులు ► ప్రాజెక్టును తానే పూర్తి చేశానంటూ బాబు ఆర్భాటం ఒంగోలు: మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద గుండ్లకమ్మ జలాశయంపై 3.859 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. జిల్లాలోని మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, జె.పంగులూరు, కొరిశపాడు, ఇంకొల్లు, చినగంజాం, ఒంగోలు మండలాల్లో ఖరీఫ్‌లో 62,368 ఎకరాలకు, రబీలో 80,060 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఒంగోలు నగరంతో పాటు 43 గ్రామాల పరిధిలో 2.56 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భూ సేకరణలో విఫలం.. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎడమ కాల్వ నిర్మాణం కోసం ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు రైతులను ఒప్పించి కేవలం 44 ఎకరాల భూమిని సేకరించలేక నేటి టీడీపీ ప్రభుత్వం చతికిలబడింది. నాలుగు కి.మీ. మేర తవ్వాల్సిన కాలువ నిర్మాణాన్ని గాలికొదిలేసింది. దీంతో పది వేల ఎకరాల ఆయకట్టుకు నీరు చేరే పరిస్థితి లేకుండాపోయింది. ఇంకొల్లు, నాగులుప్పలపాడు మండలాల్లో 10 వేల ఎకరాలకు నీరు చేరే పరిస్థితి లేకుండాపోయింది. పేరుకు ప్రాజెక్టు పరిధిలో భూములున్నా ప్రస్తుతం భూములన్నీ బీళ్లే. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం నేపథ్యంలో ప్రాజెక్టుకు నీరు చేరే పరిస్థితి లేకుండాపోయింది. సాగర్ నీటిని అరకొరగా వదిలినా ప్రాజెక్టు పరిధిలో గ్రామాలకు తాగునీరు కూడా సక్రమంగా అందటం లేదు. ఇక ఆరుతడి పంటలకు అరకొర నీరే దిక్కయింది. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దుద్దుకూరు గ్రామ రైతులను ఒప్పించి 2013 భూసేకరణ చట్టం మేరకు మార్కెట్ ధరకంటే నాలుగింతలు ఎక్కువ ఇచ్చి భూములు సేకరించే అవకాశం ఉంది. వందల కోట్లు వెచ్చించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. డిజైన్లు మార్చి తమ పొలాల్లో కాలువ ఎలా తవ్వుతారంటూ 2009లో రైతులు కోర్టుకెళ్లారు. అప్పటి నుంచి వ్యవహారం కోర్టు పరిధిలోనే ఉంది. అధికారులు గానీ, అటు ప్రభుత్వం గానీ వారిని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. నీరొదిలినా వృథానే.. మరోవైపు ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటరీస్ను కలిపే పనులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాలువ పూర్తయిన ప్రాంతాల్లో నీటిని వదిలినా పొలాలకు నీరు చేరే పరిస్థితి లేకుండాపోయింది. అరకొర నీరొచ్చినప్పుడు రైతులు మోటార్ల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న పని. పూర్తయిన మేర కాలువలకు లైనింగ్ పనులు కూడా చేయలేదు. దీంతో వచ్చిన నీరు సద్వినియోగం కావడం లేదు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి రెండేళ్లుగా నీరు చేరే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువలు కంపచెట్లు ఏపుగా పెరిగి పనికి రాకుండాపోయాయి. ఇప్పుడు నీరు విడుదల చేసినా ఆయకట్టుకు నీరు చేరే పరిస్థితి లేదు. కోర్టుకెళ్లిన రైతులను ఒప్పించగలిగితే మరో ’10 కోట్లతో ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేయవచ్చు. రూ.25 కోట్లతో ముంపు గ్రామాల పునరావాస పనులు పూర్తి చేయవచ్చు. రైతులను ఒప్పించి రూ.30 కోట్లు నిధులిస్తే గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో మిగిలి ఉన్న 10 శాతం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయినా చంద్రబాబు సర్కారు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. పైగా గతేడాది సెప్టెంబర్‌లో గుండ్లకమ్మ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామంటూ బాబు సిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి దుద్దుకూరు రైతులను ఒప్పించి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం డిమాండ్ చేస్తోంది. రోశయ్య, కిరణ్‌ల హయాంలో... వైఎస్ మరణానంతరం అధికారంలో ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూ.74.80 కోట్ల నిధులిచ్చారు. 2010–11 ఏడాదికిగాను రూ.10.76 కోట్లు, 2011–12కు రూ.51.84 కోట్లు, 2012–13కు రూ.8.76 కోట్లు, 2013–14కు రూ.3.44 కోట్లు చొప్పున కేటాయింపులు చేశారు. కంటితుడుపుగా నిధులిచ్చిన బాబు వాస్తవానికి 2003 నవంబర్ 19న చంద్రబాబు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ ఏడాది కేవలం రూ.6.66 లక్షల మొక్కుబడి నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. 2014లో అధికారంలోకి మళ్లీ వచ్చాక 2014–15కు కేవలం రూ.14.79 కోట్లు, 2015–16కు రూ.15.97 కోట్లు, 2016–17కు రూ.1.47 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి కోసం రూ.651.03 కోట్లు వెచ్చించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొర పనులు మిగిలి ఉన్నా... ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి పొందేందుకు జీవో నెం.22 తెరపైకి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు బొక్కేందుకు సిద్ధమయ్యారు. తాజాగా 2016 జూన్ నెలలో ప్రాజెక్టు అంచనాలను రూ.768.18 కోట్లకు పెంచారు. ఈ లెక్కన ఇంకా రూ.117.15 కోట్లు పనులు మిగిలి ఉన్నట్లు చూపిస్తున్నారు. చంద్రబాబు సర్కారు కనీసం ఈ మొత్తాన్ని కూడా కేటాయించలేదు. మిగిలి ఉన్న పెండింగ్ పనులు.. 44 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఒక్క దుద్దుకూరు గ్రామ పరిధిలో 36 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణ పునరావాస పనులు కొంత మేర పెండింగ్‌లో ఉన్నాయి. 12 గ్రామాల పరిధిలో పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది.