breaking news
peanut subsidy
-
రూటుమారిన సబ్సిడీ శనగలు
ఆటోతో సహా పట్టుబడిన వైనం కురిచేడు: కరువు కాలంలో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు విడుదల చేసిన సబ్సిడీ శనగ విత్తనాలు రంగుమారి, రూటుమార్చి నల్లబజారుకు తరలి వెళుతుండగా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పాత్రికేయుల కెమేరాకు దొరికిపోరుున సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రం కురిచేడులోని గ్రోమోర్ కేంద్రం సిబ్బంది అధికార పార్టీకి చెందిన ఒక అపరాల వ్యాపారితో కుమ్మకై ్క మంగళవారం సాయంత్రం సబ్సిడీ శనగల బస్తాలు మార్చి బయటకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 19నుంచి ప్రభుత్వం రైతులకు సరఫరా చేసే శనగల ఆన్లైన్ నిలుపుదల చేసింది. అంతకు ముందు రైతులు కొనుగోలు చేసిన సబ్సిడీ శనగలు వర్షాలు లేక విత్తకుండా ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. ఈ దశలో గ్రోమోర్లో మిగిలిన శనగలను స్థానిక అపరాల వ్యాపారితో కు మ్మక్కై గ్రోమోర్ సిబ్బంది పక్కదారి పట్టిం చేందుకు సిద్ధమయ్యారు. వ్యవసాయ శాఖాధికారు లు ఎకరాకు 25 కిలోల ప్రకారం గరిష్టంగా ఐదెకరాలకు 125 కిలోలకు మించకుండా ఆన్లైన్ పర్మిట్లు జారీ చేశారు. అరుుతే ఇటీవల నల్లబజారులో శనగల ధరలు అమాంతంగా పెరగడంతో వ్యాపారుల కళ్లు సబ్సిడీ శనగలపై పడ్డారుు. ఆ అపరాల వ్యాపారి తన హవా సాగించి గ్రోమోర్ ప్రతినిధులతో కుమ్మకై ్క ఈ ఉదంతానికి ఒడిగట్టారు. గ్రోమోర్ గోడౌన్లోనే సబ్సిడీ శనగల సంచులు తొలగించి సాధారణ గోతాల్లోకి మార్చివేశారు. అక్కడ నుంచి నేరుగా ఆటోల ద్వారా నల్లబజారుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. వ్యవసాయశాఖ సిబ్బంది సరుకుతో సహా ఆటోను స్వాధీన పరచుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపై తగిన కఠిన చర్యలు తీసుకుంటామని దర్శి ఇన్చార్జి ఏడీఏ సంగమేశ్వరెడ్డి, కురిచేడు ఏవో జ్యోత్సానాదేవి తెలిపారు -
సబ్సిడీ శనగకు.. అవినీతి చీడ!
► రైతులకు అందని సబ్సిడీ విత్తనాలు ► వ్యాపారులు,వ్యవసాయాధికారుల కుమ్మక్కు! ► భారీగా నల్లబజారుకు తరలుతున్న వైనం ► మార్కెట్లో భారీగా ధరలు పెంచేస్తూ విక్రయం ► చోద్యం చూస్తున్న వ్యవసాయశాఖ ► ఆందోళనలో రైతులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సబ్సిడీ శనగ విత్తనాల సరఫరా తీరు ఇది. విత్తనాలు సరిపడా ఉన్నాయని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పదేపదే చెబుతున్నారేగానీ.. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. సరఫరా చేస్తున్న సబ్సిడీ విత్తనాల్లో చాలా వరకు దళారుల చేతికి వెళుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయాధికారులు, వ్యాపారులు కుమ్మక్కై శనగ విత్తనాలను నల్లబజారుకు తరలిస్తున్నారు. అవే విత్తనాలను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తుండడం గమనార్హం. నీళ్లున్నా ఫలితమేది? కుండపోత వర్షాలతో రాష్ట్రంలో చాలా చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పైకి వచ్చాయి. కానీ వ్యవసాయశాఖ మాత్రం అందుకు తగ్గట్లుగా సన్నద్ధం కాలేకపోయింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో విత్తనాలను అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. రబీకి అన్ని రకాల విత్తనాలు కలిపి 4.88 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా... ఇప్పటివరకు విక్రయ కేంద్రాల్లో కేవలం 66,993 క్వింటాళ్లు మాత్రమే సిద్ధంగా ఉంచారు. మొత్తంగా 1.22 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు విక్రయ కేంద్రాలకు చేరింది 18,363 క్వింటాళ్లు మాత్రమే. దీంతో విత్తనాల కొరతతో రైతులు రోడ్లపైకి వస్తున్నారు. ‘సబ్సిడీ’ కాజేస్తున్న దళారులు రాష్ట్రంలో శనగ విత్తనాల కొరత చాలా ఎక్కువగా ఉంది. రబీలో వరి తర్వాత రైతులు ప్రధానంగా శనగ, వేరుశనగ పంటలనే సాగు చేస్తారు. ఇందులో సబ్సిడీ శనగ విత్తనాలు దొరక్క రైతులు నిరాశలో మునిగిపోయారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో శనగ విత్తనాల ధర రూ.11 వేల వరకు ఉంది. అదే ప్రభుత్వం సరఫరాదారుల నుంచి రూ.9,500 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి.. రైతులకు రూ.6,350 చొప్పున విక్రయిస్తోంది. అంటే ఒక్కో క్వింటాల్‌పై రూ.3,150 సబ్సిడీ అందిస్తోంది. అయితే బహిరంగ మార్కెట్లో ఉన్న రూ.11 వేల ధరతో పోల్చితే దాదాపు సగం ధరకే సబ్సిడీ విత్తనాలు అందజేస్తుండడంతో వ్యాపారులు వాటిపై కన్నేశారు. కొందరు వ్యవసాయాధికారులతో చేతులు కలిపి రైతుల పేరు మీద సబ్సిడీ విత్తనాలను తీసుకుని, నల్లబజారుకు తరలిస్తున్నారు. దీంతో అసలు రైతులకు సబ్సిడీ విత్తనాలు అందడం లేదు. వారు గత్యంతరం లేక నల్లబజారుకు తరలిన శనగ విత్తనాలను క్వింటాల్‌కు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఇలా నల్లబజారుకు తరలిన 31.5 క్వింటాళ్ల శనగ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ఇక మరోవైపు చాలాచోట్ల నాసిరకం శనగ విత్తనాలను కూడా రైతులకు అంటగడుతున్న పరిస్థితి నెలకొంది. ఇతను కుమ్మరి నర్సింహులు.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందినవారు. ఖరీఫ్‌లో ఎనిమిది ఎకరాల్లో పత్తి, సోయా వేస్తే.. భారీ వానల కారణంగా నీట మునిగి దెబ్బతిన్నాయి. వాటిని తీసేసి.. ఇప్పుడు శనగ పంట వేసేందుకు నర్సింహులు సిద్ధమయ్యాడు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6,350 చొప్పున ఇస్తున్న సబ్సిడీ శనగ విత్తనాలు దొరుకుతాయి కదాని ఆశించాడు. కానీ ఎన్నిసార్లు వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరిగినా స్టాక్ లేదనే సమాధానమే వచ్చింది. దాంతో బీదర్‌కు వెళ్లి క్వింటాల్‌కు రూ.9,200 చొప్పున ధరపెట్టి శనగ విత్తనాలు కొనుగోలు చేశాడు. ఇతని పేరు బాహురావు.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దామరగిద్దకు చెందిన రైతు. నారాయణఖేడ్‌లో ఒక రోజు మాత్రమే సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేయడంతో నియోజకవర్గంలోని రైతులందరూ పాస్‌బుక్‌లతో బారులు తీరారు. కొందరికి మాత్రమే విత్తనాలు అందాయి. బాహురావు సహా మిగతా రైతులు ఆందోళనతోనే వెనుదిరగాల్సి వచ్చింది. మరోవైపు విత్తనాలు వేసే సమయం మించిపోతుండడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. అధిక ధరకు కొనాల్సి వచ్చింది ‘‘నాకున్న రెండున్నర ఎకరాల్లో శనగ పంట సాగు చేయాలనుకొన్నాను. ఎన్నో పనులు వదులుకుని మరీ సబ్సిడీ శనగ విత్తనాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగా.. అయినా ఫలితం లేకుండా పోరుుంది. పంట సాగుకు అదును మించిపోతుండడంతో రేటు ఎక్కువైనా బయట మార్కెట్లో రూ.9 వేలకు క్వింటాల్ లెక్కన శనగ విత్తనాలను కొన్నాను.’’ - కొత్తకాపు లక్ష్మారెడ్డి, కోహిర్, సంగారెడ్డి జిల్లా సాధారణ విత్తనాలే కొన్నా.. ‘‘ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న వారికే సబ్సిడీ శనగ విత్తనాలు ఇస్తున్నారు. దాంతో అందుబాటులో ఉన్న సాధారణ విత్తనాలను విత్తుకొన్నాను..’’ - అవదు ఈశ్వరయ్య, కోహిర్, సంగారెడ్డి జిల్లా ఇచ్చినవి సరిపోలేదు ‘‘ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై అందించిన విత్తనాలు సరిపోలేదు. అధికారులు ఒక పాసు పుస్తకానికి రెండు ప్యాకెట్లు మాత్రమే ఇచ్చారు. దాంతో బయట మార్కెట్లో క్వింటాల్‌కు రూ.9 వేల చొప్పున కొనాల్సి వచ్చింది..’’ - బి.గాళప్ప, రైతు, ఝరాసంగం, సంగారెడ్డి జిల్లా -
కొంప ముంచిన సర్కార్ విత్తనాలు!
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం కరువుకు తట్టుకోని కే-6 రకం ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు ఈ రకాన్నే పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగేది కాదు పలమనేరు: ప్రభుత్వం ఈ దఫా రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు నట్టేట ముం చేశాయి. కరువుకు తట్టుకోలేని, నాణ్యత లేని కే-6 విత్తనాలను పంపిణీ చేసింది. వర్షాభావ పరిస్థితులను ఈ రకం తట్టుకోలేక పంట పూర్తిగా దెబ్బతింది. ఇదే సీజన్లో ఆత్మ వారి సౌజన్యంతో ధరణి అనే రకాన్ని కొందరు రైతులకు పంపిణీ చేశారు. కే-6 రకం ఎకరా కు ఓ బస్తా దిగుబడిని ఇవ్వగా, ధరణి రకం పది బస్తా ల దిగుబడినిచ్చింది. ఇదే విత్తనాలను రైతులకు పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశెనగ రైతులు నష్టాలపాలయ్యారు. పలమనేరు వ్యవసాయశాఖ సబ్ డివిజ న్కు సంబంధించి ఖరీఫ్ సీజన్లో 16 వేల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయగా 11,540 హెక్టార్లలో ప్రభుత్వం అందజేసిన విత్తనాలనే వేశారు. మిగిలిన విస్తీర్ణంలో రైతులు వారి సొంత విత్తనాలనే వేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోలేదు.. ఈ దఫా జిల్లాకు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి-6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాల నుంచి వీటిని తెప్పించింది. మామూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలిస్తే గింజలు 70 గ్రాముల బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. సీడ్ జర్మినేషన్ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. ఈ దఫా ఇది జరగలేదు. ఈ ప్రాంతానికి కే-6 పనికిరాదు.. వర్షాభావానికి తట్టుకోని కే-6 ఈ ప్రాంతానికి సరిపోదు. గతంలోనూ ఈ సమస్య కారణంగానే ఈ రకాన్ని పంపిణీ చేయలేదు. తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు సగం పంట కూడా చేతికందలేదు. ఫలితంగా ఈ దఫా ఎకరాకు బస్తా (40 కేజీలు) కూడా దిగుబడి రాలేదు. ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు.. కుప్పం ఆత్మ విభాగం తరఫున అక్కడి అధికారులు కొందరు రైతులకు ధరణి రకం వేరుశెనగ విత్తనాలను ప్రయోగాత్మకంగా పంపిణీ చేశారు. కుప్పం మండలంలోని పీబీ నత్తంలో శ్రీరాములు పొలంలో ప్రయోగాలను చేపట్టారు. కరువు పరిస్థితుల మధ్య ఎకరాకు పది బస్తాల దిగుబడి వచ్చింది. దీన్ని చూసి వ్యవసాయ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే రకాన్ని జిల్లాలోని అందరు రైతులకూ పంపిణీ చేసి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదని అధికారులే అభిప్రాయపడుతున్నారు.