breaking news
Pathological problems
-
Jyotsna Bose: కరోనా వారియర్.. సడలని పిడికిలి
కార్మిక సంఘాల పోరుబాటలో జీవిత చరమాంకం వరకు పిడికిలి బిగించి ముందు వరుసలో నడిచిన జ్యోత్స్న బోస్.. కరోనా పై పోరులో మరణానంతరం కూడా యోధురాలిగానే నిలిచిపోయారు. కరోనాతో మరణించిన జ్యోత్స్నపై ‘పేథలాజికల్ అటాప్సీ’ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగడంతో.. దేశంలోనే తొలిసారి కరోనా ప్రభావాల పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. జ్యోత్స్న కోల్‌కతాలోని బెలెఘటలో ఉంటారు. ఆమెకు కరోనా సోకినట్లు ఈ నెల 10న ఆమె కుటుంబం గుర్తించింది. ఆమె మనువరాలు తీస్తా బసు వైద్యురాలు. ప్రాథమిక చికిత్సతో నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో జ్యోత్స్నను ఆమె మే 14 న బెలెఘటలోనే ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 16న ఆమె మర ణించారు. తను చనిపోతే తన అవయవాలను దానం చేయాలని పదేళ్ల క్రితమే ఆమె అనుమతి పత్రంపై సంతకాలు పెట్టారు. అయితే ఇప్పుడామె చనిపోయింది కరోనాతో. అవయవదానం కుదరదు. అలాగని ఆమె అంతిమ కోరికను నెరవేర్చకుండా ఎలా... అనుకున్నారు తీస్తా బసు. జ్యోత్స్న ఆసుపత్రిలో చేరిన రోజు వేరొక ఆసుపత్రిలో కరోనాతో మరణించిన బ్రోజోరాయ్ అనే వ్యక్తికి కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో పేథలాజికల్ అటాప్సీ జరిగింది. అది స్ఫురించి, జోత్స్న మృతదేహాన్ని కూడా అక్కడికి పంపించారు తీస్తా బసు. మే 20 న అక్కడ ఆమెకు అటాప్సీ జరిగింది. దేశంలోనే తొలిసారి కరోనా పరిశోధనలకు తోడ్పడిన మహిళగా జోత్స్న చరిత్రలో నిలిచిపోయారు. ఆమె తర్వాత కోల్‌కతాలో ప్రముఖ నేత్ర వైద్యులు బిస్వజిత్ చక్రవర్తి (60) మృతదేహానికి అటాప్సీ జరిగింది. జోత్స్న కు ముందు అటాప్సీ జరిగిన బ్రోజోరాయ్.. కోల్‌కతాలోని ప్రసిద్ధ అవయవదాన స్వచ్ఛంద సంస్థ ‘గణదర్పణ్’ వ్యవస్థాపకులు. అవయవదానానికి అనుమతినిస్తూ పదేళ్ల క్రితం జ్యోత్స్న సంతకాలు పెట్టి ఇచ్చింది ఆ సంస్థకే. ఇప్పుడీ ముగ్గురి మృతదేహాలపై జరిగిన పరిశోధనల ఫలితాలు వస్తే కరోనాను నివారించేందుకు, నిరోధించేందుకు, నియంత్రించేందుకు దారేదైనా కనిపించవచ్చని ఈ పరీక్షలు నిర్వహించిన వైద్యుల కమిటీ ఆశిస్తోంది. కరోనాతో మరణించినవారిపై విదేశాల్లో అరకొరగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ మన దేశంలో ఇలా జరగడం ఇదే మొదటì సారి. పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళ జ్యోత్స్న.. మరణానంతరం కూడా కరోనా యోధురాలిగానే దేశానికి గుర్తుండిపోతారు. జ్యోత్స్న 1927లో చిట్టాగాంగ్ (నేడు బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాంతం) జన్మించారు. ఆనాటి సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కార్మిక సంఘాల పోరాటాలలో పాలు పంచుకున్నారు. రాయల్ ఇండియన్ నౌకాదళ తిరుగుబాటుకు మద్దతుగా 1946లో తంతీతపాల కార్మికుల సమ్మెకు ‘నేను సైతం’ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె తండ్రి అదృశ్యం అయిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడింది. జ్యోత్స్న చదువు కుంటుపడింది. బ్రిటిష్ టెలిఫోన్స్‌లో ఆపరేటర్‌గా చేరి బతుకుబండిని లాక్కొచ్చారు. -
బద్రీనాథ్‌లో యాత్రికులకు జ్వరాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చినజీయర్ ఆశ్రమంలోతెలుగు భక్తులకు ఆశ్రయం చలిగాలుల తీవ్రతకు ఆస్తమా రోగులకు అస్వస్థత నీటి ఉధృతికి కొట్టుకు పోయిన రోడ్లు విజయవాడ బ్యూరో: చార్ధామ్ యాత్రకు వెళ్లి భారీ వర్షాలతో బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన పలువురు తెలుగు యాత్రికులకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. బద్రీనాథ్‌లోని చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకుంటున్న యాత్రికుల్లో 10 మందికి పైగా జ్వరాలు సోకాయి. కొందరు జలుబు, దగ్గు సమస్యలతో బాధ పడుతుండగా నలుగురు ఆస్తమా రోగులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలుల తీవ్రత పెరిగి వాతావరణం బాగా చల్లబడటంతో శ్వాస పీల్చుకోవడం కష్టమవుతోందని ఆశ్రమంలోని యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఒక వైద్యుడు వీరికి చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఆరోగ్య సమస్యలు తీవ్రం కావడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి శనివారం సాయంత్రం ఫోన్ చేయగా పలువురు యాత్రికులు తమ దయనీయ పరిస్థితిని వివరించారు. ఉత్తరాఖండ్ సీఎం ఫోన్ చేసినా... ‘వర్షాలు మరింత పెరిగాయి. ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్ ఫోన్ చేసి ఎవరూ కంగారు పడొద్దని ధైర్యం చెప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే లైన్లోకి రావటంతో ప్రభుత్వం నుంచి తప్పకుండా సాయం అందుతుందని ఆశ పడ్డాం. కానీ శనివారం సాయంత్రం వరకూ ఎవరూ రాలేదు. ఒకరిద్దరు పోలీసు ఇన్స్పెక్టర్లు వచ్చి ఎలా ఉన్నారని పలకరించి వెళ్లారు’ యాత్రికులు పేర్కొన్నారు. ఆశ్రమంలో ఉన్న సాంబశివరావు, శివయ్య, సుమంత్(డ్రైవర్), సూర్యనారాయణ, రజని, సోమయాజులు జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారు. వృద్ధులైన యల్లప్ప, సాయమ్మ, సోమయాజులు ఆస్తమాతో ఊపిరి ఆడక అవస్థ పడుతున్నారు. హృద్రోగంతో బాధపడుతున్న సూర్యనారాయణకు జ్వరం రావడంతో ఆయన బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆశ్రమ నిర్వాహకులు ఇచ్చిన దుప్పట్లు కప్పుకుని మునగదీసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోవటంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్ ఎస్వీఎస్ రావు చెప్పారు. రుషికేశ్ మార్గంలో కొట్టుకు పోయిన రోడ్డు నదీ ప్రవాహ వేగానికి బద్రీనాథ్ నుంచి రుషికేశ్కు వెళ్లే మార్గంలో 35వ కి.మీ. దగ్గర రోడ్డు 100 గజాల మేర కొట్టుకు పోయింది. దీంతో బద్రీనాథ్ పోలీసులు అక్కడ ఉన్న భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ప్రయాణం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బద్రీనాథ్ నుంచి జోషిమఠం వెళ్లే రోడ్డు కూడా బాగా దెబ్బతినటంతో యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ సుమారు 7 సెంటీమీటర్ల వర్షం కురిసి ఉండవచ్చని చెబుతున్నారు. ఆకాశమంతా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో బద్రీనాథ్ వాతావరణం ప్రమాదకరంగా మారిందని యాత్రికులు ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికుల కుటుంబీకుల్లో ఆందోళన యాత్రికులు మూడు రోజులుగా బద్రీనాథ్‌లో చిక్కుకుపోవటంతో వారి బంధువుల్లో ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లా వేకనూరు గ్రామానికి చెందిన 11 మంది బద్రీనాథ్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చెన్నైలో ఉన్న తుంగల భాస్కరరావు కుమారుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులు, అక్కబావల క్షేమ సమాచారాలను ఫోన్ ద్వారా తెలుసుకుని ధైర్యం చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన సోమయాజులు, రజని బంధువులు, హరిబాబు కుటుంబీకులు ఆందోళనతో టీవీలో వార్తలు తెలుసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని వారిని తమ దగ్గరకు చేర్చాలని కోరుతున్నారు. చార్ధామ్ యాత్ర నాలుగో రోజూ బంద్ ప్రతికూల పరిస్థితులతో వరుసగా నాలుగో రోజు చార్ధామ్ యాత్రను రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో శనివారం కూడా యాత్ర రద్దయింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యాత్రను శనివారం నిలిపివేసినట్లు ఉత్తరకాశి కలెక్టర్ రవిశంకర్ తెలిపారు. యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభం కావచ్చని అయితే వాతావరణం, రహదారుల పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. చంపావట్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 150 వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి.