breaking news
Para motor glider
-
97 నుంచి 77 కట్ చేస్తే... ఆ కరేజ్ ఇలా ఉంటుంది!
97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్ అడ్వెంచర్’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో పారామోటరింగ్ సాహసం చేసి నెటిజనులు ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్ ఫోర్సు వెటరన్స్ ఆపరేట్ చేసే ఫ్లైయింగ్ రైనో పారామోటరింగ్ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్ వోల్డ్ కరేజ్ అండ్ 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్’ అనే కాప్షన్‌తో ‘ఎక్స్’లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది. ‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది. -
ఐదేళ్ల పాటు చీకట్లోనే జీవితం, వీల్ చెయిర్‌కే పరిమితం.. అయినా
‘‘ఏదో ఒక దశలో పరిస్థితులు మనల్ని పడిపోయేలా చేస్తాయి. అలాగే ఉండిపోకుండా గెలవడానికి ప్రయత్నం చేయి’’ అంటారు హైదరాబాద్ కాచిగూడలో ఉంటున్న స్వీటీ బగ్గా (బల్జిత్ కౌర్) ఇరవై ఏళ్ల వయసులో బస్సు ప్రమాదానికి గురై వెన్నుపూస దెబ్బతిని, నిలబడే శక్తి లేక వీల్ చెయిర్‌కే పరిమితమైంది స్వీటీ బగ్గా. అయినా, గెలవడానికి ప్రయత్నం చేసింది. వీల్ చెయిర్ స్పోర్ట్ మారథాన్ రన్నర్‌గా నిలిచింది. నేషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా రాణించింది. స్విమ్మింగ్ నేర్చుకొని, నీటి అడుగు వరకు వెళ్లొచ్చింది. పారామోటరింగ్ చేసి ఔరా అనిపించింది. తనలాంటి వారికి వీల్చెయిర్లు పంపిణీ చేస్తూ తన సహృదయతను చాటుకుంటుంది. అవగాహన కార్యక్రమాల ద్వారా దివ్యాంగులు జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తోంది. ‘‘ఇప్పుడు నా వయసు 60. యాభై నాలుగేళ్ల వయసులో సిమ్మింగ్ నేర్చుకున్నాను. పారామోటరింగ్ చేశాను. నేలమీద నడవలేను. కానీ, ఆకాశంలో ఎగిరాను, స్కూబా డైవింగ్‌తో నీళ్ల అడుగుకు వెళ్లొచ్చాను. అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్నాను. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతల్లోనూ ΄ాలు పంచుకున్నాను. ఐదేళ్లు చీకట్లోనే.. వీల్‌చెయిర్‌కి పరిమితమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మొత్తం జీవితమే కోల్పోయాను అనిపించింది. రేపు అనే దానిపైన ఏ మాత్రం ఆశ ఉండేది కాదు. ఆరు నెలల పాటు డిప్రెషన్ నన్ను చుట్టుముట్టింది. నలభై ఏళ్ల క్రితం ఓ రోజు నేనూ, మా బ్రదర్ స్కూటర్ మీద వెళుతుండగా బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతింది. చికిత్స తీసుకొని ఇంటికి వచ్చానే కానీ, మెడ నుంచి శరీరం కదల్చలేని పరిస్థితి. అప్పటికే పద్దెనిమిదేళ్లకే పెళ్లి, ఇరవై ఏళ్లకు ఇద్దరు పిల్లల తల్లిని. నన్ను నేనే చూసుకోలేను, ఇక పిల్లల్నేం చూడగలను? కూర్చోబెడితే కూర్చోవడం, పడుకోబెడితే పడుకోవడం... ఐదేళ్ల పాటు సూర్యకాంతి కూడా చూళ్లేదు. కొంత ప్రయత్నంతో చేతులు, తల మాత్రమే పనిచేసేవి. జీవితం ఎంత దుర్లభమో పదేళ్ల పాటు అనుభవించాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్, బెడ్‌సోర్స్.. ఒక సమస్య అని చెప్పలేను. కానీ, మా అమ్మనాన్నలు, మా వారు, అత్తింట్లో అందరూ నన్ను ఓపికగా చూసుకున్నారు. పదేళ్ల తర్వాత చెన్నైలో స్పైనల్‌కార్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ గురించి తెలిసి, అక్కడకు తీసుకెళ్లారు ఇంట్లోవాళ్లు. అప్పుడు వాళ్లిచ్చిన సలహాలతో నన్ను నేను మెరుగు పరుచుకోవడం మొదలుపెట్టాను. నన్ను నేను మెరుగుపరుచుకున్నా... ఉమ్మడి కుటుంబం కావడంతో మా ఇంట్లో పిల్లలు ఎక్కువ. ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను కాబట్టి, పిల్లలందరికీ చదువు చెప్పేదాన్ని. క్రొచెట్ అల్లికలు నేర్చుకున్నాను. బొమ్మలు, స్వెటర్లు తయారుచేస్తుంటాను. బంధుమిత్రుల పుట్టిన రోజున వాటిని కానుకగా ఇస్తుంటాను. గార్డెనింగ్ చేస్తాను. నాకు తెలుసు, జీవితంలో కాలినడక ఉండదని.అయినా, నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం తపించేదాన్ని. ఒకప్పటితో పోల్చితే నాలాంటి వారికి ఇప్పటి రోజులు కాస్త సులువు. వీల్‌చెయిర్ సాయంతో నా పనులు నేను చేసుకోవడం వరకు చాలా దశలు దాటాను. పదేళ్లుగా వాలీబాల్, స్విమ్మింగ్ చేస్తున్నాను. పారా అథ్లెటిక్ పోటీలలో పాల్గొంటున్నాను. పాండిచ్చేరి వెళ్లినప్పుడు అక్కడ స్కూబా డైవింగ్ కూడా చేశాను. హాట్ ఎయిర్ బెలూన్‌లో ఆకాశంలోకి ఎగిరాను. స్ట్రాంగ్ విల్‌పవర్ కావాలంటే నన్ను నేను నిరంతరం మార్చుకోవాలని ఇప్పటికీ తపిస్తూనే ఉన్నాను. వీల్‌చెయిర్.. పవర్ స్పైనల్ కార్డ్ దెబ్బతిని, బెడ్‌కు పరిమితమైన వారి గురించి అక్కడక్కడా వార్తలు తెలుస్తుండేవి. సోషల్‌మీడియా ద్వారా ఇంకొంతమంది పరిచయం అయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల క్రితం వీళ్లందరికీ వీల్చెయిర్స్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇదే విషయాన్ని మా ఇంట్లోవాళ్లతో చె΄్పాను. ‘ఐయామ్ పాజిబుల్’ పేరుతో ఫౌండేషన్‌ని రిజిస్టర్ చేయించాను. ఇంట్లోవాళ్లనే ఒక్కొక్కరూ ఒక్కో వీల్‌చెయిర్ కొనిమ్మని చెప్పాను. అలా, తొమ్మిది వీల్ చెయిర్లు వచ్చాయి. మరికొన్ని నా బంధువులు, మిత్రులతో కొనిపించాను. మొదటి ఏడాది 33 మందికి వీల్ చెయిర్లు ఇచ్చాను. కోవిడ్ టైమ్‌లో ఇవ్వలేకపోయాను. కిందటేడాది వీల్‌చెయిర్ ర్యాలీ చేశాం. సీనియర్ సిటిజన్స్, పోలియో వచ్చినవారికీ వీల్చెయిర్లు ఇస్తున్నాం. స్పైనల్‌కార్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏడాదికి ఒకసారి ఏర్పాటు చేస్తున్నాను. దీనిద్వారా తగినంత స్ఫూర్తి అంది, వారి జీవితాలను బాగు చేసుకుంటారనేది నా ఆశ. వీడియోల ద్వారా అవగాహన.. వెన్నుపూస దెబ్బతిన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోజూ ఎలా ఉండాలి.. అనే విషయాల మీద వీడియోలు చేసి సమస్య ఉన్నవారికి పోస్ట్ చేస్తుంటాను. యూట్యూబ్ ద్వారా దివ్యాంగుల కోసం నన్ను నేను ఉదాహరణగా చూపుతూ వీడియోలు చేస్తుంటాను. ఏ కారణంగానైనా వీల్‌చెయిర్‌కి పరిమితమైనవారు ఇంట్లోనే ఉండిపోకుండా తమకు తాముగా స్వయం ఉపాధి పొందమని చెబుతుంటాను. ఉదాహరణకు.. ఇంటి ముందు చిన్న టేబుల్ వేసుకొని చాయ్ బిస్కెట్ లేదా కూరగాయలు అమ్మమని చెబుతుంటాను. రోజుకు వందో, రెండు వందలో ఆదాయం వచ్చినా వారికెంతో ఆదరువు అవుతుందంటూ చిన్న చిన్న సూచనలు చేస్తుంటాను. చదువుకున్నవారైతే ట్యూషన్లు చెప్పమని, కుట్లు అల్లికల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని వివరిస్తుంటాను. ఇప్పటివరకు తెలంగాణలో 180, ఆంధ్రప్రదేశ్‌లో 200 మందిదాకా స్పైనల్ కార్డ్ సమస్య బాధితులు ఉన్నారని తెలిసింది. ఇంకా మన దృష్టికి రానివారు ఎందరున్నారో. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వీల్ చెయిర్ కావాలని అడిగిన వారున్నారు. సెప్టెంబర్ నెలలో స్పైనల్‌కార్డ్ ఇంజ్యూరీ సర్వీస్ డే ఉంది. దీనిని పురస్కరించుకొని ప్రతి ఏటా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాను. ఆ విధంగా ఈ ఏడాది డెబ్భైమూడు మందికి వీల్చెయిర్లు పంపిణీ చేస్తున్నాను. దీనికి ఎంతోమంది తమ సహకారాన్ని అందించారు. ఈ నలభై ఏళ్ల జీవితం నన్ను మానసికంగా ఎంతో బలవంతురాలిని చేసింది. యుద్ధంలో పోరాడాలంటే యోధుడిలాగే ఉండాలి. గాయాలు అయినా, పడిపోయినా.. నిరంతరం మనల్ని మనం కొత్తగా మలుచుకుంటూ, ఆవిష్కరించుకుంటూ ఉండాలి. ఇదే విషయాన్ని తరచూ చెబుతూ నాలాంటి వారిని మోటివేట్ చేస్తుంటాను’’ అని వివరించారు స్వీటీ బగ్గా. – నిర్మలారెడ్డి -
గాలిలో తేలి.. తేలి.. తేలిపొండి!
హైదరాబాద్: నగర యువతకు రాష్ట్ర టూరిజం అడ్వెంచర్ స్పోర్ట్స్ విభాగం పారా మోటర్ రైడింగ్‌ను ప్రారంభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బైసన్‌పోలో మైదానంలో ఆదివారం ప్రారంభమైన ఈ రైడింగ్ మరో 2 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ మహేందరెడ్డి, టూరి జం ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, తెలంగాణ, ఆంధ్ర సబ్‌ఏరియా కమాండింగ్ ఆఫీసర్, మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డీజీ పీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ రైడ్‌ను ప్రజలు ఎంజాయ్ చేయాలన్నారు. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెట రీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ కేవలం రూ.2,500 చెల్లిస్తే గాలిలో డ్రైవ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ రైడ్ ఉంటుందన్నారు. -
ఔరా! పారా మోటార్ గ్లైడర్ విన్యాసం
కడప నగరం చేరుకున్న మదన్‌మోహన్‌రెడ్డి సాహసయాత్ర వైవీయూ: వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన ఎల్.మదన్‌మోహన్‌రెడ్డి పారా మోటార్ గ్లైడర్ విన్యాసం ప్రజలను అబ్బురపరచింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్మన్గా చేరిన మదన్ ప్రస్తుతం జూనియర్ వారెంట్ ఆఫీసర్‌గా కోయంబత్తూరులో పని చేస్తున్నారు. ఈయన ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. 10 వేల కిలోమీటర్ల లక్ష్యంతో ఐదుగురు సభ్యుల స్కైరైడర్స్ బృందం ‘ప్రదక్షిణ’ పేరుతో 45 రోజులపాటు 12 రాష్ట్రాల మీదుగా సాహసయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 3న పశ్చిమబెంగాల్లోని కొలైకొండ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా మదన్ మంగళవారం కడపలోని ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో దిగారు. ఈయన వెంట టీం సభ్యులు సోలంకి, యాదవ్, విశాల్, కుల్దీప్, ధర్మవీర్సింగ్ ఉన్నారు.