breaking news
old bus
-
బెంగళూరు పాత బస్సు రూ. లక్ష మాత్రమే.. ఆ డొక్కు బస్సులు మాకొద్దు!
బెంగళూరు: బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) పాత బస్సులను అమ్ముతోంది. 7 లక్షల కిలోమీటర్లకు పైబడి సంచరించిన బస్సులను ఈ రకంగా వదిలించుకోనుంది. ఒక్కో బస్సు ధర కేవలం లక్ష రూపాయలే. అయితే మేం కొనేస్తాం అనుకుంటే తొందరపాటే. ఈ ధర వాయువ్య, ఈశాన్య ఆర్టీసీ విభాగాలకు మాత్రమే అన్వయిస్తుంది. ఈ మేరకు ఆర్టీసీకి బీఎంటీసీ ప్రతిపాదనలు పంపింది. తమ సోదర సంస్థలకు ఇవ్వడం కోసం బస్సుల ధరను తగ్గించారు. మిగిలిన రవాణా సంస్థలతో దీనిపై మాట్లాడలేదని ఓ బీఎంటీసీ అధికారి తెలిపారు. ఆ డొక్కు బస్సులు మాకు వద్దండి ఉత్తర కర్ణాటకలో దుస్థితికి చేరిన రోడ్లపై తిప్పడానికి బెంగళూరులో వాడి వదిలేసిన పాత బస్సుల కొనుగోలుకు వాయువ్య ఆర్టీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదెక్కడి సవతి తల్లి ధోరణి అని వాయువ్య పరిధిలోకి వచ్చే హుబ్లీ– ధార్వాడ, రూరల్, చిక్కోడి, బెళగావి, హావేరి, బాగలకోట, గదగ్, ఉత్తర కన్నడ ఇలా ఆరు జిల్లాల ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. వాయువ్యలో ప్రస్తుతం 4 వేల పైగా బస్సులు సంచరిస్తున్నాయి. అయినా ప్రజలకు తగిన రవాణా సేవలు లభించడం లేదు. దీంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్న డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ సమయంలో బీఎంటీసీకి చెందిన సుమారు 100 పాత బస్సులను కొనాలని వాయువ్య ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున సెకెండ్ హ్యాండ్ బస్సులు చాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. ఉత్తమ రవాణా సేవలకు కొత్త బస్సులను కొనలేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన సీఎం బసవరాజ్ బొమ్మై తక్షణమే న్యాయం చేయాలని కోరారు. -
డొక్కు బస్సు.. ప్రయాణికుల కస్సు బుస్సు
అనంతపురం న్యూసిటీ: ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లాంగ్ సర్వీసులకు డొక్కు బస్సులు వేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శుక్రవారం జడ్చర్ల టోల్గేట్ వద్ద జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. కదిరి డిపోకు చెందిన (ఏపీ29జడ్ 0649) బస్సు శుక్రవారం హైదరాబాదు నుంచి కదిరికి బయలు దేరింది. బస్సు కండీషన్లో లేకపోగా విపరీతమైన శబ్ధాలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. జడ్చర్ల టోల్గేట్ దాటాక బస్సును నిలిపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. బస్సులో విజేయుడు అనే వ్యక్తికి బైపాస్ సర్జరీ జరిగిందనీ, బస్సు శబ్దాలతో ఆయన ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ వారి కుటుంబీకులు, ప్రయాణికులు డ్రైవర్ రమణను నిలదీశారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ, లేకపోతే వేరే బస్సు పంపాలంటూ కోరారు. అయితే డ్రైవర్ రమణ ‘ ఇష్టముంటే రండి లేకుంటే దిగిపోండి డబ్బులు ఇచ్చేది లేదు’ అని చెప్పారు. దీంతో గంటపాటు డ్రైవర్, ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విజేయుడు కుటుంబీకులు ఆర్ఎం చిట్టిబాబుకు ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీనిపై శనివారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ప్రయాణికులు తెలిపారు.