విరిగిన ఎముకలకు త్రీడీ కట్లు!
మెక్సికో : యాక్సిడెంట్ జరిగి ఎముకలు విరిగితే.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో డాక్టర్ ఓ పెద్ద కట్టేస్తాడు.. ఇక ఆ కట్టుతో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. దీన్ని వేయాలన్నా తీయాలన్నా ఇబ్బందే. ఈ చిక్కులకు చెక్ పెట్టేందుకు మెక్సికోకు చెందిన నోవాక్యాస్ట్ కంపెనీ నయా ఆవిష్కరణ చేసింది. విరిగిన చోట ప్లాస్టిక్‌తో కట్టు కట్టేందుకు ఓ త్రీడీ యంత్రాన్ని రూపొందించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టులా చర్మానికి అంటుకోకుండా ఎముక విరిగిన చోటును మాత్రమే ఈ త్రీడీ కట్టు గట్టిగా అదిమిపడుతుంది. అంతేకాదు తేలిగ్గా, చూడటానికి స్టైలిష్‌గా కూడా ఉంటుంది.
సౌకర్యంగా అనిపించకపోతే తీసి పక్కన పెట్టేయొచ్చు కూడా. దీని ద్వారా మామూలు కట్ల కన్నా 40 శాతం తొందరగా విరిగిన ఎముకలు అతుక్కుంటాయట. త్రీడీ స్కానర్ కూడా అవసరం లేకుండా కేవలం కొన్ని వివరాలను పొందుపరిస్తే చాలు ఆకారానికి తగ్గట్టు పోత పోస్తుంది. ప్రస్తుతం ఒక్కో కట్టు కట్టేందుకు (త్రీడీ ప్రింటింగ్) మూడున్నర గంటల సమయం పడుతోందని, త్వరలో ఒక గంటలోనే ప్రింట్ చేసేలా ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది.