నో కిడ్నాప్.. ఆమె ఎందుకు అదృశ్యమైంది!
న్యూఢిల్లీ: నోయిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ షిప్రా మాలిక్ నాలుగు రోజుల కిందట అదృశ్యమై.. తిరిగి ప్రత్యక్షమైన వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం హఠాత్తుగా అదృశ్యమైన ఆమె శుక్రవారం ఉదయం గుర్గావ్ సమీపంలోని ఓ పల్లెలో దొరికింది. తను అదృశ్యంపై షిప్రా పోలీసుల విచారణలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
షిప్రా అదృశ్యమైన వ్యవహారంలో ఎలాంటి కిడ్నాప్ కాల్ గానీ, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ కాల్ గానీ రాలేదని, ఇది రేప్ వ్యవహారం కూడా కాదని పోలీసులు అంటున్నారు. ఆర్థిక సమస్యలే ఈ ఫ్యాషన్ డిజైనర్ అదృశ్యానికి కారణమై ఉండొచ్చునని ప్రాథమిక విచారణలో తెలుస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. గుర్గావ్కు 30 కిలో మీటర్ల దూరంలో హర్యానాలోని మారుమూల పల్లె సుల్తాన్పూర్లో ఆమె పోలీసులకు దొరికింది.
పోలీసులు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో ఆమె ఒంటరిగానే ఉందని తెలుస్తోంది. విచారణ కోసం ఆమెను పోలీసుల బృందం నోయిడాకు తీసుకెళ్లింది. గురువారం రాత్రి సుల్తాన్పూర్ గ్రామానికి వచ్చిన ఆమె ఒకరి ఇంట్లో ఆశ్రయం తీసుకుందని, తనను నలుగురు కిడ్నాప్ చేశారని, వారి నుంచి తప్పించుకొని ఈ ఊరికి వచ్చానని ఆమె స్థానికులు చెప్పిందని కథనాలు వస్తున్నాయి. అయితే పోలీసుల విచారణలో మాత్రం ఆమె పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండటంతో పోలీసులు ఈ కిడ్నాప్ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.