breaking news
new furniture
-
వెల్డన్ పీటీఓ.. పాత వస్తువులతో కొత్త ఫర్నీచర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగాన్ని ‘నడిపించే’ పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ (పీటీఓ) గురించి చాలా మందికి తెలియదు. డిపార్ట్మెంట్లో వినియోగించే వాహనాల నిర్వహణ, మరమ్మతులు దీని ప్రధాన బాధ్యత. హైదరాబాద్‌లోని పేట్లబుర్జు కేంద్రంగా పని చేసే ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది తమ సృజనాత్మకత చూపిస్తున్నారు. స్క్రాప్‌గా మారే వాహనాలు, వస్తువులకు కొత్త రూపు ఇస్తున్నారు. మంగళవారం ఈ విభాగాన్ని ఆకస్మికంగా పర్యటించిన రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ వీటిని చూసి మంత్రముగ్ధులయ్యారు. అక్కడి అధికారులు, సిబ్బందికి కితాబిచ్చారు. పువ్వుతో మొదలైన ప్రయోగం... తెలంగాణ పీటీఓ ప్రధాన కార్యాలయం సైతం చాన్నాళ్ల పాటు ఓ మెకానిక్ షెడ్ మాదిరిగానే ఉండేది. ఇక్కడ పని చేస్తున్న మెకానిక్స్, డ్రైవర్స్లోని సృజనాత్మకత బయటకు తీసుకురావాలని ఏ అధికారీ భావించలేదు. ఎ.రాజేష్ ఈ విభాగానికి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ ప్రయోగాలు మొదలయ్యాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది తొలుత నట్లు, స్క్రూలు, బోల్డులను వినియోగించి ఓ పువ్వు తయారు చేశారు. దీనికి ఆకర్షణీయమైన రంగులు వేశారు. ఎస్పీ కార్యాలయంలోని టీపాయ్ పైకి చేరిన ఈ పుష్పం అందరి దృష్టినీ ఆకర్షించింది. పీటీఓ సిబ్బంది ప్రయత్నం, ప్రయోగం అనేక మందికి ఆకట్టుకోవడంతో అధికారుల ఆలోచనలు ఆ కోణంలో సాగాయి. ఫలితంగానే జీపు ముందు భాగంతో సోఫా, డీసీఎం డీజిల్ ట్యాంక్‌తో సోఫా, కారు సీట్లతో రివాలి్వంగ్ చైర్.. ఇలా అనేకం రూపొందాయి. పొదుపు మార్గంలోనూ ముందుకు... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించే పోలీసు వాహనాలకు కొన్నిసార్లు భారీ మరమ్మతులు అవసరమవుతుంది. వీటిలో కొన్నింటి స్పేర్ పార్ట్స్ కోసం ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితంగా బడ్జెట్ నానాటికీ పెరిగిపోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తేవి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న పీటీఓ అధికారులు కొత్త ప్రయోగాలకు నాంది పలికారు. ప్లాస్టిక్ వెల్డింగ్ విధానంతో విరిగిన బంపర్లను కొత్తవాటిగా మారుస్తున్నారు. దీని కారణంగా భారీ మొత్తం ఆదా అవుతోంది. సాధారణంగా ఇన్నోవా వాహనం బంపర్ విరిగిపోతే కొత్తది వేయడానికి రూ.22 వేల వరకు ఖర్చవుతుంది. అయితే ప్లాస్టిక్ వెల్డింగ్ విధానంలో మరమ్మతు చేయడానికి కేవలం రూ.640 ఖర్చవుతోంది. ఇలానే మూతపడిన లేథ్ మిషన్‌ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా పీటీఓ ఒక్కో రిమ్పై రూ.6 వేల వరకు పొదుపు చేస్తోంది. ఈ విషయాలు, సంస్థ నిర్వహణ విషయం తెలుసుకున్న డీజీపీ అంజనీకుమార్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అంతర్గత ప్రతిభను గుర్తిస్తూ ముందుకు.. పీటీఓలో పని చేస్తున్న అధికారులు తమ వద్ద ఉన్న సిబ్బందిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభను గుర్తించి ఆ కోణంలో ప్రోత్సహిస్తున్నా రు. కేవలం సృజనాత్మక వస్తువుల తయారీ లో మాత్రమే కాదు.. వారికి జీవనోపాధి కల్పించడంలోనూ ఇది దోహదపడుతోంది. పీటీఓలో డ్రైవర్‌గా పని చేసే ఓ ఉద్యోగి అనారోగ్యానికి గురై వైద్యుల సలహాతో డ్రైవింగ్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆయనకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కుట్టు పని వచ్చిన ఆయనకు డీసీఎం టార్పాలిన్స్ కుట్టే బాధ్యతలు అప్పగించారు. దీన్ని సమర్థంగా చేసిన ఆయన ప్రస్తుతం ప్లాస్టిక్ వెల్డింగ్ విభాగాన్నీ నిర్వహిస్తున్నారు. రికార్డుల నిర్వహణ, మరమ్మతులు, పరిసరాలను ఆకర్షణీయంగా తయారు చేయడం తదితర అంశాల్లోనూ పీటీఓ తన మార్కు చూపిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. -
సాక్షరభారత్ కేంద్రాలకు కొత్త ఫర్నిచర్
నర్వ : మండల పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న సాక్షరభారత్ కేంద్రాలకు ప్రభుత్వం నుంచి నూతన ఫర్నిచర్ మంజూరైందని ఎంపీడీఓ రాఘవ తెలిపారు. సోమవారం మండల కేంద్రానికి చేరుకున్న ఫర్నీచర్‌ను మండల మహిళా సమాఖ్య భవనంలో భద్ర పరిచారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఒక్కో సాక్షరభారత్ కేంద్రానికి ఒక్క కుర్చీ, ఒక్క టేబుల్, బ్లాక్ బోర్డు, సాక్షరభారత్ కేంద్రానికి సంబంధించిన సూచికబోర్డులు వచ్చాయన్నారు. వీటితో పాటు టార్చిలైటును కూడా అందిస్తున్నామన్నారు. వయోజనులకు విద్యనందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాక్షరభారత్ కేంద్రాలకు నిధులు మంజూరుచేసి అవసరమైన ఫర్నిచర్‌ను ఇస్తున్నామన్నారు. ఫర్నిచర్ సాక్షరభారత్ కేంద్రాలలో లేదా గ్రామపంచాయతీ ఆధీనంలో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎంపీడీఓ వెంట సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ అనురాధ ఉన్నారు.