breaking news
New friendships
-
కొంపముంచుతున్న కొత్త స్నేహాలు
సాక్షి, పుట్టపర్తి: ప్రస్తుతం యువత బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటోంది. పలకరింపులు..పరామర్శలన్నీ వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ వేదికగానే సాగుతున్నాయి. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారానే కొత్త కొత్త స్నేహాలు పుట్టుకువస్తున్నాయి. హలో అంటే చాలు పొలోమంటూ ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చి వాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తెలిసీ తెలియని వయసులో ఒకరికొకరు ఆకర్షితులై.. తర్వాత లేని పోని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఒకరికొకరు దగ్గరై.. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చాలామంది మైనర్లు సోషల్ మీడియా వేదికగా చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి వ్యవహారాల వరకూ వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది మైనర్లే.. తెలిసీ తెలియని వయసులో నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ కొత్త పరిచయాలతో స్టేషన్ మెట్లు ఎక్కుతున్న మైనర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాల్య వివాహాలు, ప్రేమ పెళ్లిళ్లు, ఆన్లైన్ ప్రేమ తగాదాలు.. ఇలా వివిధ రకాల ఫిర్యాదులు నిత్యం పోలీసు స్టేషన్‌కు వస్తున్నాయి. అయితే ఎక్కువ మంది మైనర్లే ఉండటంతో వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులను పిలిపించి.. సర్దిజెప్పుతుండగా... సమస్య బయటికి రాకుండా సద్దుమణుగుతోంది. ఇక ఆన్లైన్ ద్వారా పరిచయాలతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా నెలల వ్యవధిలోనే విడాకుల వరకూ వచ్చేస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు.. సోషల్ మీడియా పరిచయాలతో దగ్గరవుతున్న వారు...కొన్నిరోజులకే న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్‌కు వస్తున్నారు. చాలా సందర్భాల్లో అమ్మాయి మైనర్ కావడం... అప్పటికే పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో పెద్దలే గుట్టు చప్పుడు కాకుండా వివాహాలు జరిపిస్తున్నారు. బాల్య విహహం తప్పని తెలిసినా చాలా మంది ఎదురుచెప్పలేకపోతున్నారు. అధికారులకు తెలిసినా అమ్మాయి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అవగాహన కల్పించడానికే పరిమితం అవుతున్నారు. నూతన జంటలను విడదీయలేక.. మానవీయ కోణంలో ఆలోచించి వదిలేస్తున్నారు.పుట్టపర్తికి చెందిన 17 ఏళ్ల యువతికి గోరంట్ల మండలానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయయ్యాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ వాట్సాప్ కాల్స్ వరకు వచ్చారు. ఆ తర్వాత వీడియో కాల్స్.. ఫొటోల మారి్పడి తదితర వ్యవహారాలన్నీ సాగాయి. పెళ్లి చేసుకుందామనేలోపు ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తనకు ఆ అమ్మాయిపై ఇష్టం పోయిందని యువకుడు అడ్డం తిరిగాడు.. మైనర్లు కావడంతో పోలీసులు ఇద్దరికీ సర్దిజెప్పి పంపించారు. హిందూపురానికి చెందిన 18 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన 27 ఏళ్ల పురుషుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరూ ఆర్నెల్ల పాటు చాటింగ్ చేసుకుంటూ ఫోన్ నంబర్లు, అడ్రస్ మార్చుకున్నారు. గంటల తరబడి వాట్సాప్ చాటింగ్ కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తికి అప్పటికే వివాహమైందన్న విషయం కనుక్కొన్న యువతి నానా రభస చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి గుట్టుగా వ్యవహారాన్ని చక్కబెట్టి పంపారు. అవగాహన కల్పిస్తున్నాం మొబైల్ ఫోన్ అతిగా వినియోగించే యువత వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం తదితర సోషల్ మీడియా సైట్లులోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఆయా మాధ్యమాల్లో కొత్తవ్యక్తుల పరిచయాలు వారి జీవితాలనే మార్చేస్తున్నాయి. అందువల్ల ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా కనిపెడుతూ ఉండాలి. స్మార్ట్ ఫోన్ వినియోగంలో లాభాలతో పాటు అనేక అనర్థాలూ ఉన్నాయి. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. – మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, పుట్టపర్తి -
కొత్త స్నేహితులు దొరికారోచ్ అంటున్న రియా.. ఇంతకీ ఎవరబ్బా? (ఫోటోలు)
-
సౌదీ అరేబియా X ఇరాన్ విద్వేష గీతం: వరుస మారింది
బద్ధ విరోధులైన సౌదీ అరేబియా, ఇరాన్ క్రమంగా దగ్గరవుతున్నాయి. దశాబ్దాల వైరానికి తెర దించే దిశగా సాగుతున్నాయి. దౌత్య బంధాలను పునరుద్ధరించుకోవడంతో పాటు ఆర్థిక సంబంధాలను కూడా బలోపేతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. మధ్య ప్రాచ్యంపై పట్టు పెంచుకునే యత్నాల్లో భాగంగా ఈ సయోధ్యకు చైనా మధ్యవర్తిత్వం వహిస్తోంది. అంతర్జాతీయంగా అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పరిణామాన్ని చైనాకు కీలక దౌత్య విజయంగా భావిస్తున్నారు. రెండు శత్రు దేశాల మధ్య సయోధ్య యత్నాల్లో డ్రాగన్ దేశం నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాపై అమెరికా పెత్తనానికి బీటలు వారుతున్నట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది... పశ్చిమాసియాలో చిరకాల ప్రత్యర్థులైన సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య మొగ్గతొడుగుతున్న కొత్త దోస్తీ ఒక రకంగా అనూహ్యమే. ఇది ప్రపంచ దేశాలను కాస్త ఆశ్చర్యపరిచింది కూడా. 2016లో షియా మత పెద్దను సౌదీ చంపేయడం, ప్రతిగా ఇరాన్‌లోని ఆ దేశ దౌత్య కార్యాలయాలపై దాడులతో దశాబ్దాల వైరం తారస్థాయికి చేరింది. దౌత్య తదితర సంబంధాలన్నీ తెగిపోయాయి. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలూ దగ్గరయ్యే ప్రయత్నాలు 2021 నుంచీ జరుగుతున్నాయి. చైనా చొరవతో అవి రెండు నెలలుగా ఊపందుకున్నాయి. నెల రోజులుగా బీజింగ్ వేదికగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న మంత్రుల స్థాయి భేటీలు సయోధ్యకు గట్టి పునాదులే వేశాయి. విదేశాంగ మంత్రులు హొస్సైన్ అమిరబ్దొల్లాహియాన్ (ఇరాన్), ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ (సౌదీ) బీజింగ్‌లో తాజాగా చర్చలు జరిపారు. ఇరు దేశాల్లో పరస్పరం దౌత్య కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు Vఅంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులతో పాటు వీసా జారీకి అవకాశాలను పరిశీలించనున్నట్టు హొస్సైన్ తెలిపారు. ఈ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతీయ, భౌగోళిక రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చంటున్నారు. ‘‘యెమెన్ నుంచి లెబనాన్ దాకా వేర్పాటువాద పోరాటాల్లో చెరో వైపుండి ఇరాన్–సౌదీ చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెర పడుతుంది. ఇది పశ్చిమాసియాలో రాజకీయ స్థిరత్వానికి దారి తీయవచ్చు’’అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా సౌదీ–ఇరాన్ బంధం ఏ మేరకు గట్టిపడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందన్నది వారి అభిప్రాయం. దశాబ్దాల వైరం సౌదీ అరేబియా, ఇరాన్ వైరం ఈనాటిది కాదు. 1979 విప్లవంతో ఇరాన్లో రాచరికానికి తెర పడి మతవాద శక్తుల ఆధిపత్యంతో కూడిన ప్రభుత్వం ఏర్పడటంతో అది మరింత ముదిరింది. ► ఇరాన్ ప్రధానంగా షియా ఆధిపత్య దేశం కాగా సౌదీ అరేబియా సున్నీ ప్రాబల్య దేశం. ► ప్రాంతీయంగా ఆధిపత్య కాంక్ష తదితరాలు వాటి శత్రుత్వానికి మరింత ఆజ్యం పోశాయి. ► 2016లో ప్రముఖ షియా నేత షేక్ నిమ్ర్ అల్ నిమ్ర్‌ను ఉగ్రవాద ఆరోపణలపై సౌదీ తల నరికి చంపడంతో ఇరాన్ భగ్గుమంది. భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. మధ్య ప్రాచ్యంలోని పలు దేశాల్లో సౌదీ వ్యతిరేక పోరాట గ్రూపులకు బాసటగా నిలవసాగింది. ► ఇరాక్, సిరియా, యెమన్, లెబనాన్ వంటి పలు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల్లో సౌదీ, ఇరాన్ చెరో వర్గం వైపు నిలిచి ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాయి. సిరియాలో రెబెల్ గ్రూపులకు సౌదీ మద్దతిస్తుండగా అధ్యక్షుడు అల్ బషర్‌కు ఇరాన్ దన్నుగా నిలిచింది. ► సరిహద్దు దేశమైన యెమన్‌లో తాము అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సాయుధ, ఆర్థిక సాయం చేస్తోందని సౌదీ గుర్రుగా ఉంది. ► 2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను గద్దె దించడంతో అక్కడ సున్నీల ఆధిపత్యానికి తెర పడింది. అప్పటినుంచీ ఇరాక్‌లోని షియా ప్రాబల్య ప్రభుత్వంపైనా ఇరాన్ పట్టు పెరిగింది. తాజా చర్చల అనంతరం యెమెన్‌లోని హౌతీలకు సాయాన్ని నిలిపేసేందుకు ఇరాన్ అంగీకరించిందని సమాచారం. ► పశ్చిమాసియాలో ఇటీవల మార్పు పవనాలు వీస్తున్నాయి. వైరి దేశాలు స్పర్ధలను పక్కన పెట్టి ఒక్కటవుతున్నాయి. అరబ్ దేశమైన యూఏఈ 2020లో ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ముందడుగు వేసింది. చైనా.. పశ్చిమాసియాలో పవర్ బ్రోకర్ అమెరికా స్థానంలో పశ్చిమాసియాలో పెద్దన్న పాత్రను పోషించేందుకు చైనా కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ► 2015లో ఇరాన్ అణు ఒప్పందం వంటి బహుపాక్షిక శాంతి చర్చల్లో చైనా చురుగ్గా పాల్గొంది. తొలుత అమెరికా కూడా భాగస్వామిగా ఉన్నా 2018లో ఉన్నట్టుండి వైదొలగింది. ► చైనా ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగుమతిదారు. అందుకే చమురు నిల్వలు బాగా ఉన్న పశ్చిమాసియాపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ► అటు ఇరాన్‌తో, ఇటు సౌదీ అరేబియాతో చైనాకు ముందునుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య ముందునుంచీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! సౌదీతో కూడా అమెరికా సంబంధాలు కొంతకాలంగా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా బైడెన్ హయాంలో అవి మరీ దిగజారాయి. ► పొరుగునున్న యెమెన్‌లోని హౌతీ మూకలతో చిరకాల పోరాటంతో అలసిన సౌదీ శాంతి మంత్రం జపిస్తోంది. అమెరికా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ కూడా ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే అవకాశాల కోసం చూస్తోంది. ఈ పరిస్థితులు చైనాకు కలసి వచ్చాయి. ► చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గత డిసెంబర్లో రియాద్ వెళ్లి సౌదీ–ఇరాన్ నాయకత్వంతో మంతనాలు జరిపారు. తర్వాత ఫిబ్రవరిలో ఇరాన్ అధ్యక్షునితో బీజింగ్‌లోనూ చర్చలు జరిపి ఇరు దేశాల చర్చలకు రంగం సిద్ధం చేశారు. ► మధ్య ప్రాచ్యంతో అమెరికా వర్తకమూ క్రమంగా క్షీణిస్తోంది. 2019లో 120 బిలియన్ డాలర్ల నుంచి 2021లో 80 బిలియన్ డాలర్లకు తగ్గింది. ► మరోవైపు మధ్య ప్రాచ్య దేశాలతో వాణిజ్య సంబంధాలను చైనా నానాటికీ పెంచుకుంటూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్, జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా అవతరించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలేజీలోకి అడుగుపెడుతున్నారా!
సెల్ఫ్ చెక్ స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం వచ్చేసింది. పదో తరగతి పూర్తిచేసుకుని కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులకు అంతా కొత్తగానే ఉంటుంది. అన్నీ వింతగానే తోస్తాయి. మగపిల్లల సంగతి ఎలా ఉన్నా... కొత్తగా కళాశాలలో అడుగుపెడుతున్న అమ్మాయిలు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ర్యాగింగ్ లాంటి విషయాలన్నమాట. కొత్త స్నేహాలు తెచ్చిపెట్టే సమస్యలకు కూడా దూరంగా ఉండాలి. మరి మీరెలా ఉండబోతున్నారు! 1. మీరు చేరబోతున్న కాలేజీ గురించి వివరాలు సేకరిస్తారు. అక్కడ విద్యార్థులు, అధ్యాపకుల పట్ల ఎలా మసలుకోవాలో తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. కాలేజీలో చేరాక అక్కడ ర్యాగింగ్ వంటివి ఎక్కువగా ఉంటే అలాంటి విషయాల్ని గోప్యంగా ఉంచుకొని మీలో మీరే ఇబ్బంది పడకుండా అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మీ సమస్యల గురించి తెలియజేస్తారు. ఎ. అవును బి. కాదు 3. స్నేహితుల వివరాలు, వారి ఇంటి అడ్రసుల గురించి మీ తల్లిదండ్రులకు చెబుతారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా స్నేహితులతో కొత్త ప్రదేశాలకు వెళ్లరు. ఎ. అవును బి. కాదు 4. ఇన్నాళ్లు స్కూలు పేరుతో బందిఖానా జీవితాన్ని గడిపారు. ఇప్పుడు కాలేజీలోకి అడుగుపెట్టారు కాబట్టి అన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చనుకుంటారు. అన్నింటిలో తల్లిదండ్రుల ప్రమేయాన్ని ఇష్టపడరు. ఎ. కాదు బి. అవును 5. మీరు చేరబోయేది కో-ఎడ్యుకేషన్ కాలేజీ అయితే అబ్బాయిలతో స్నేహాలకు హద్దులు పెట్టుకుంటారు. చదువుల వరకూ స్నేహం చేసినా వారి వివరాలు తప్పనిసరిగా తల్లిదండ్రులకు చెపుతారు. ఎ. అవును బి. కాదు మీ ఆలోచనావిధానంలో ‘ఎ’లు ఎక్కువగా ఉంటే కాలేజీ జీవితంలో మీరు సమస్యలకు చాలావరకూ దూరంగా ఉంటారని అర్థం. లేదంటే సమస్యల్ని కోరితెచ్చుకున్నవారవుతారు. కాలేజీ చదువు ఓ కీలకమైన దశ అని గుర్తించి, జాగ్రత్తగా ముందడుగు వేస్తే చదువులోనే కాదు...జీవితంలోనూ మీరే ఫస్ట్! ఆల్ ది బెస్ట్!