breaking news
National Technology
-
నైపుణ్యాలున్న యువతకు స్వర్గధామం భాగ్యనగరం
నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా హైదరాబాద్ నగరం మరోసారి తన సాంకేతిక ప్రావీణ్యాన్ని చాటుకుంటోంది. 1998లో భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈ రోజును గుర్తుంచుకుంటారు. ఈ పరీక్షల ఫలితంగా భారతదేశం అణు ఆయుధాలు కలిగిన ఆరో దేశంగా రూపాంతరం చెందింది. ఈ అణు పరీక్షల విజయాన్ని గుర్తిస్తూ ప్రతి ఏడాది మే 11న ఈ రోజును టెక్నాలజీ డే గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని ప్రముఖ శాస్త్ర, సాంకేతిక సంస్థలు, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు వివిధ కార్యక్రమాలు చేపట్టాయి. పని తగ్గించి ఉత్పత్తి పెంచే సాధనాలు.. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ వేదికపై టెక్నాలజీ పరిణామక్రమంపై అవగాహనను కలిగి ఉన్నారు. క్రిటికల్ రివర్‌లో ఈ విజ్ఞానం అంతర్జాతీయ స్థాయి క్లయింట్లు ఆశించే నాణ్యతను అందించడానికి సహాయపడుతుంది. హైదరాబాద్ భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా ఎదుగుతోంది. మా హైదరాబాద్ బృందం ఆటో–రీకన్సిలియేషన్స్, ఆటోమేటెడ్ చెక్, డేటా విజిబిలిటీని అందించే డాష్‌బోర్డ్‌లు వంటి ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించే వినూత్న ఏఐ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తుంది. మేన్యువల్ పనిని తగ్గిస్తూ, ఉత్పత్తిని వేగవంతం చేసే ఆటోమేషన్ డేటా సాధనాలను అభివృద్ధి చేస్తున్నాము. డేటా ఖచ్ఛితత్వంతో ఫైనాన్స్ బృందాలకు సహాయపడే ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడంలో మా బృందం కీలక పాత్ర పోషించింది. ఈ సాధనాలను ఇప్పటికే ఎంటర్ప్రైజ్ క్లయింట్లు ఉపయోగిస్తున్నారు. – అంజి మారం, క్రిటికల్ రివర్ సీఈఓ, వ్యవస్థాపకులు. ఆధునిక యుద్ధ విధానాల్లో సాంకేతికత ఎలా విప్లవాత్మకంగా మారిందో చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామంలో డ్రోన్ సాంకేతికత రక్షణ వ్యూహంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. భారత–పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఏర్పడిన ఇటీవలి ఉద్రిక్తతలు డ్రోన్ల అవసరాన్ని స్పష్టంగా వెల్లడించాయి. ఇవి ఇకపై ఐచ్ఛికం కాదు, అత్యవసరం. నేడు డ్రోన్లు గగనతల గమనిక, పక్కాగా సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది మన దళాలకు వేగవంతమైన, సమర్థవంతమైన స్పందనను అందించడమే కాక, మనుషుల ప్రాణాలను కాపాడటంలో సహాయపడుతోంది. భారత్‌లో స్థానిక డ్రోన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటం ‘ఆత్మనిర్భర్త’ అవసరాన్ని హైలైట్ చేస్తోంది. దేశాన్ని అధునాతన డ్రోన్ సాంకేతికత గ్లోబల్ హబ్‌గా దిశగా మలచడంలో ఇది కీలక అడుగు. –ప్రేం కుమార్ విశ్లావత్, మారుత్ డ్రోన్స్ సీఈఓ, సహ–వ్యవస్థాపకులు. (చదవండి: -
సాధికారత కోసమే సాంకేతికత
న్యూఢిల్లీ: సాంకేతికతను సాధికారత సాధించేందుకే సద్వినియోగం చేయాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ సాంకేతికత దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత్ పోఖ్రాన్ అణపరీక్షలు జరిపి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ దేశ చరిత్రలో ఉజ్వలమైన క్షణాల్లో 1998నాటి పోఖ్రాన్ అణుపరీక్షలు కూడా ఒకటి. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నకాలంలో చేసిన అణుపరీక్షలు దేశ శాస్త్రసాంకేతికత సత్తాను చాటడంతోపాటు ప్రపంచస్థాయిలో దేశ ఖ్యాతిని సమున్నత స్థాయిలో నిలిపాయి’ అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా త్వరలో నిర్మంచబోయే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ–ఇండియా(లిగో–ఇండియా)కు శంకుస్థాపన చేసిన దానిని జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అరుదైన ఖనిజాల నుంచి మ్యాగ్నెట్లను తయారుచేయనున్నారు. విశాఖపట్నంలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనాలయంసహా ముంబై, నవీ ముంబైలలోని పలు పరిశోధన, ఉత్పత్తి కేంద్రాలను జాతికి అంకితమిచ్చారు. ‘ జామ్(జేఏఎం) ట్రినిటీ, కోవిన్ పోర్టల్, రైతులకు డిజిటల్ మార్కెట్ ఇలా ప్రతి రంగంలో సాంకేతికతను భారత ప్రభుత్వం సాధికారత, సామాజిక న్యాయం కోసమే వినియోగిస్తోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు కాదు. శాస్త్ర,సాంకేతిక రంగ పురోభివృద్ధికి ఎంతగానో మా సర్కార్ కృషిచేస్తోంది. పదేళ్ల క్రితం ఏటా 4,000 పేటెంట్లు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 30వేలకు చేరుకుంది. గతంలో ఏటా 70వేల ట్రేడ్‌మార్క్‌లు నమోదయ్యేవి. ఇప్పుడవి 2.5లక్షలపైమాటే. ఇంక్యుబేషన్ కేంద్రాల సంఖ్య ఎనిమిదేళ్ల క్రితం 150 ఉంటే ఇప్పడవి 650కి చేరుకున్నాయి’ అని మోదీ అన్నారు. -
అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్
తగరపువలస (భీమిలి): నూతన విద్య, ఆర్థిక విధానాల కారణంగా అభివృద్ధిలో దేశం దూసుకుపోతోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. చెరకుపల్లిలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న గ్యాన్–2కే23 జాతీయ సాంకేతిక ఫెస్ట్‌ను శుక్రవారం ఆయన c. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అభివృద్ధిని నేటి తరం అనుభవిస్తుంటే తనకు అసూయగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా దేశం తన అవసరాలను తీర్చుకోవడంతోపాటు విదేశాలకు అవసరమైన ఎగుమతులు చేయగలుగుతోందన్నారు. ప్రపంచానికి అవసరమైన సాంకేతికపరమైన డేటా మనదేశంలో చౌకగా లభిస్తుందన్నారు. విద్యార్థులు తన చుట్టూ ఉన్నవారికి, దేశానికి అవసరమైన వాటిని గుర్తించి ఉత్పత్తి చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించాలని సూచించారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కులం, డబ్బు వంటివాటితో పనిలేదన్నారు. తెలివితేటలు, కష్టపడే తత్వం అలవరచుకోవాలన్నారు. జేఎన్టీయూ–కె ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్‌స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటూ నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఎం.సైదులు, అవంతి విద్యాసంస్థల డైరెక్టర్ ఆకుల చంద్రశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ ఐ.శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
సర్జికల్ నీడిల్ తయారీకి మూలం ఈ కందిరీగే!
సాక్షి సెంట్రల్ డెస్క్: ప్రకృతి నిండా ఎన్నో టెక్నాలజీలు. ప్రతి సమస్యకు, ప్రతి అవసరానికి ప్రకృతిలో ఓ పరిష్కారం రెడీగా ఉంటుంది. దాన్ని గుర్తించి, మన అవసరాలకు తగినట్టుగా మలచుకోగలిగితే చాలు. ఎప్పుడో ఆది మానవుల నుంచి ఇప్పుడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తల దాకా ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది ఆవిష్కరణలు చేసినవారే. ఈ మధ్య కూడా అలాంటివెన్నో కనిపెట్టారు. నేడు (మే 11న) నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా అలాంటి కొన్ని ఆవిష్కరణలేంటో చూద్దామా? ► కందిరీగ.. సర్జరీ నీడిల్ అవసరం: మెదడు వంటి అత్యంత సున్నిత అవయవాలకు సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు.. కణాలు దెబ్బతినకుండా వాడగలిగే నీడిల్ ప్రకృతి పరిష్కారం: ఓ రకం కందిరీగ వుడ్ వాస్ప్‌గా పిలిచే ఓ రకం కందిరీగ.. తన తొండం వంటి నిర్మాణంతో చెట్ల కాండానికి రంధ్రాలు చేసి గుడ్లు పెడుతుంది. శాస్త్రవేత్తలు దీని ఆధారంగా మెదడు శస్త్రచికిత్స కోసం ఉపయోగించే ప్రత్యేకమైన నీడిల్‌ను రూపొందించారు. ► తిమింగలాలు.. మోటార్ బ్లేడ్లు అవసరం: గాలి ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే విండ్ టర్బైన్లు మరింత సమర్థవంతంగా, తక్కువ ధ్వని చేస్తూ పనిచేయాలి. ఉత్పత్తి సులువు కావాలి. ప్రకృతిలో దొరికిన పరిష్కారం: హ్యాంప్బ్యాక్ తిమింగలం రెక్కలు ఈ రకం తిమింగలాల్లో రెక్కల అంచులు ఎగుడుదిగుడుగా ఓ ప్రత్యేక నిర్మాణం (ట్యూబర్కల్స్) తో ఉంటాయి. దీంతో వేగంగా ఈదగలుగుతాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న వేల్ పవర్ కార్పొరేషన్ సంస్థ విండ్ టర్బైన్ల రెక్కల అంచులకు ట్యూబర్కల్స్ డిజైన్‌ను చేర్చింది. దీనివల్ల టర్బైన్ల సామర్థ్యం పెరిగినట్టు గుర్తించింది. ఈ మోడల్‌ను టర్బైన్లకే గాకుండా ఫ్యాన్లు, కంప్రెసర్లు, మోటార్లలోనూ వాడొచ్చని చెబుతోంది. ► ఆల్చిప్పలు.. ఆక్సెటిక్ మెటీరియల్ అవసరం: గట్టిగా సాగదీసినా, తీవ్ర ఒత్తిడికి లోనైనా ఎదుర్కొని.. మరింత మందంగా, బలంగా మారే మెటీరియల్ (ఆక్సెటిక్) తయారీ. ప్రకృతిలో దొరికిన పరిష్కారం: ఆల్చిప్పలు ఆల్చిప్పల లోపలి పొర నిర్మాణం ‘ఆక్సెటిక్’తరహాలో ఉంటుంది. ఆల్చిప్పను తెరవడానికి ప్రయత్నించిన కొద్దీ ఆ పొర మరింత మందంగా, బలంగా మారి అడ్డుకుంటుంది. ఆ పొర నిర్మాణం తీరును గుర్తించిన శాస్త్రవేత్తలు.. వివిధ ఆక్సెటిక్ మెటీరియల్స్‌ను రూపొందించారు. క్రీడా పరికరాల్లో, ఔషధ రంగంలో, ప్యాకింగ్‌లో వాటిని వినియోగిస్తున్నారు. ► నత్తలు.. ఆపరేషన్ గ్లూ అవసరం: శరీరంలో ఏదైనా అవయవానికి శస్త్రచికిత్స చేసినప్పుడు కోతపెట్టిన భాగాలు తిరిగి అతుక్కునేందుకు వీలయ్యే గమ్. ప్రకృతిలో దొరికిన పరిష్కారం: నత్తలు నత్తలు ముందుకు కదలడానికి శరీరం దిగువన ఓ జారుడు పదార్థాన్ని వదులుతూ ఉంటాయి. దాన్ని స్లగ్ స్లైమ్ అంటారు. ఇటు జారుడుగా ఉండటంతోపాటు కాస్త ఒత్తిడిపెడితే అత్యంత గట్టిగా అతుక్కునే జిగురుగానూ ఈ పదార్థం పనిచేస్తుంది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రవేత్తలు.. శస్త్రచికిత్సల్లో కోత పెట్టిన అవయవాలను అతికించే సూపర్ గ్లూను రూపొందించారు. ముఖ్యంగా గుండె ఆపరేషన్లు జరిగినప్పుడు ఈ సూపర్ గ్లూతోనే అతికించి ప్రాణాలు కాపాడుతున్నారు. ► షార్క్ చర్మం.. ఫాస్ట్ స్విమ్మింగ్ అవసరం: చాలా వేగంగా ఈత కొట్టడానికి వీలయ్యే దుస్తులు ప్రకృతి పరిష్కారం: షార్క్ చేపల చర్మం ఈత కొడుతున్నప్పుడు నీళ్ల నుంచి ఎదురయ్యే ఘర్షణ వల్ల వేగం మందగిస్తుంది. అయితే షార్క్ చేపలు నీళ్లలో అత్యంత వేగంగా ఈదగలుగుతాయి. వాటికి ఉన్న ప్రత్యేకమైన చర్మం నీటి ఘర్షణను అధిగమించేందుకు తోడ్పడుతుంది. దాని నుంచి స్ఫూర్తి పొందిన స్పీడో అనే కంపెనీ.. ఫాస్ట్ స్కిన్ పేరిట ప్రత్యేక దుస్తులను తయారుచేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో మెడల్స్ పొందిన 98 శాతం క్రీడాకారులు ఈ దుస్తులను ధరించినట్టు ఆ కంపెనీ తెలిపింది. ఆ తర్వాతి నుంచి ఈత పోటీల్లో ఆ దుస్తుల వాడకాన్ని నిషేధించారు. ► చెదలు.. చల్లటి ఇండ్లు అవసరం: ఏసీల వంటివి అవసరం లేకుండా సహజ సిద్ధంగా చల్లగా ఉండే ఇండ్లు. ప్రకృతి పరిష్కారం: చెదల పుట్టలు చెదలు పెట్టే పుట్టల నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. ఆ పుట్టల డిజైన్ గాలి ధారాళంగా ప్రసరిస్తూ, చల్లగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే తరహాలో అపార్ట్మెంట్లు, ఇండ్ల నిర్మాణానికి డిజైన్లు రూపొందించారు. ఇలాంటి డిజైన్‌తోనే జింబాబ్వేలోని హరారేలో ప్రఖ్యాత ఈస్ట్‌గేట్ సెంటర్‌ను నిర్మించారు. ► మంతా రేస్.. సూపర్ స్పీడ్ విమానాలు అవసరం: తేలికగా, తక్కువ ఇంధన వినియోగంతో వేగంగా, ఎక్కువ దూరం వెళ్లే విమానాలు ప్రకృతి పరిష్కారం: మంతా రేస్ మంతా రేస్ అనేవి బల్లపరుపుగా ఉండే ఓ రకం సముద్ర జీవులు. సముద్రంలో చప్పుడు రాకుం డా, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం. ఈ మంతా రేస్ శరీర నిర్మాణాన్ని అనుసరించి బోయింగ్, నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేక విమానాలను రూపొందిస్తున్నారు. బోయింగ్ కంపెనీ ఇప్పటికే ఎక్స్–48సీ మానవ రహిత విమానాన్ని తయారు చేసింది. ఇవి తక్కువ ఇంధనంతో వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణించగలవు. -
ప్రపంచానికే మార్గదర్శకంగా.. టెక్ ఇండియా
పారిశ్రామిక విప్లవం తర్వాత పాశ్చాత్య దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించిన మాట నిజమే. అలాగని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాక్ ప్రపంచం వెనుకబడి ఏమీ లేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన భారత దేశం పురాతనకాలం నుంచే ఎన్నో ఘన విజయాలను సాధించింది. నేటి అధునాతన యుగంలోనూ మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది. కొన్ని అంశాలలోనైతే ప్రపంచానికే మార్గదర్శకంగా కూడా నిలుస్తోంది. మే 11 నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా భారతదేశం సాధించిన కొన్ని అపురూప సాంకేతిక విజయాల గురించి ఒక విహంగ వీక్షణం... సింధూలోయ నాగరికత కాలం నుంచే భారత భూభాగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లింది. గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని గిర్నార్ ప్రాంతంలో సింధూలోయ నాగరికత నాటి రిజర్వాయర్ల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇవి క్రీస్తుపూర్వం 3000 ఏళ్ల నాటివి. తొలినాటి నీటిపారుదల కాలువల అవశేషాలు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. నీటిపారుదల పరిజ్ఞానంతో పత్తి, చెరకు పంటలను ప్రపంచంలోనే తొలిసారిగా సాగుచేసిన ఘనత సింధూలోయ నాగరికత ప్రజలకే దక్కుతుంది. తూనికలు, కొలతల ప్రామాణికీకరణ, ఓడ రేవుల నిర్మాణం వంటి అంశాలలో కూడా సింధూలోయ నాగరికత ప్రజలకు విశేషమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండేది. గుజరాత్‌లోని లోథల్‌లో సింధూలోయ నాగరికత ప్రజలు నిర్మించుకున్న ఓడరేపు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ఇది క్రీస్తుపూర్వం 2400 ఏళ్ల నాటిది. సింధూలోయ నాగరికత అంతరించిన తర్వాత కూడా భారత భూభాగంలో ఏర్పడిన వివిధ రాజ్యాలలోని ప్రజలు అప్పటి కాలానికి అసాధారణ సాంకేతిక పాటవాన్ని కలిగి ఉండేవారు. క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికి ఇనుప గజాలు, వెదురు బొంగులు ఉపయోగించి వంతెనలను నిర్మించుకునేవారు. భారీ రాతి స్థూపాలను, ఇనుప స్తంభాలను నిర్మించుకునేవారు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఢిల్లీలో క్రీస్తుశకం నాలుగో శతాబ్దిలో నిర్మించిన ఇనుప స్తంభం ఇప్పటికీ శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తూనే ఉంది. అప్పటి కమ్మరులు తుప్పుపట్టని ఇనుముతో ఇంతటి భారీ స్తంభాన్ని నిర్మించడం అపురూపమైన విశేషమే! క్రీస్తుశకం రెండో శతాబ్ది నుంచి నాలుగో శతాబ్ది మధ్య కాలంలో మెట్ల బావులను నిర్మించుకున్న సాంకేతిక నైపుణ్యం భారతీయుల సొంతం. ప్రపంచానికి వజ్రాలను పరిచయం చేసిన ఘనత కూడా భారతీయులకే దక్కుతుంది. గోదావరి, కృష్ణా, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఐదువేల ఏళ్ల కిందటే వజ్రాలను వెలికి తీసేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. వేద వాంగ్మయంలోను, పురాణాలలోను, కౌటిల్యుడి అర్థశాస్త్రంలోను వజ్రాల ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుశకం పదహారో శతాబ్ది నాటికి గోల్కొండ ప్రాంతం వజ్రాల గనులకు ప్రధాన కేంద్రంగా ఉండేది. నూలు వడికే రాట్నం, పొలం దున్నే నాగలి వంటి పరికరాలను తొలిసారిగా రూపొందించిన వారు ప్రాచీన భారతీయులే. ‘సున్నా’ను (0) కనుగొన్న ఘనత కూడా భారతీయులదే. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటికి సున్నాతో కూడిన భారతీయుల అంకెల విధానం ప్రపంచమంతటికీ విస్తరించింది. ప్రాచీన భారతీయులు సాధించిన సాంకేతిక విజయాలు ఇలా చాలానే ఉన్నాయి. మంగోలులు భారత భూభాగంపై దాడులు చేసిన కాలంలో వారి ద్వారా ఇక్కడి సైన్యానికి గన్పౌడర్తోను, గన్‌పౌడర్‌ను ఉపయోగించే ఆయుధాలతోను పరిచయం ఏర్పడింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మంగోల్‌లను ఓడించిన తర్వాత మంగోల్ సైనికుల్లో కొందరు ఇక్కడే ఉండిపోయారు. మంగోల్ పాలకుడు హులగు ఖాన్ పంపిన రాయబారి 1258లో ఢిల్లీకి వచ్చినప్పుడు, అతడు అప్పటి ఢిల్లీ పాలకుడు నసీరుద్దీన్ మహమ్మద్ సమక్షంలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి ప్రదర్శన నిర్వహించాడు. ఆ తర్వాత ఖిల్జీ కాలంలో ఇక్కడే ఉండిపోయిన మంగోల్ సైనికుల సాయంతో భారతీయ సైనికులు కూడా మందుగుండు సామగ్రి తయారీ, తుపాకులు, ఫిరంగుల వంటి ఆయుధాల ప్రయోగం నేర్చుకున్నారు. అనతికాలంలోనే ఇవి దక్షిణాదికి కూడా వ్యాపించాయి. విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల సైన్యం కూడా తుపాకులు, ఫిరంగులు ఉపయోగించేది. బ్రిటిష్‌వారు దేశంలో ఒక్కొక్క ప్రాంతాన్నే ఆక్రమించుకుంటూ విస్తరిస్తున్న కాలంలో దక్షిణాదిలో మైసూరు పాలకుల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మైసూరు పాలకుడు హైదర్ అలీ లోహపు సిలిండర్లతో రూపొందించిన రాకెట్లను తొలిసారిగా యుద్ధంలో వినియోగించాడు. హైదర్ అలీ హయాంలో రాకెట్ల కోసం రూపొందించిన సిలిండెర్ల తయారీకి వాడిన ఇనుము నాణ్యత కొంత తక్కువగా ఉండేది. వీటి నుంచి ఉపయోగించిన క్షిపణులు దాదాపు కిలోమీటరు వరకు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగేవి. హైదర్ అలీ వారసుడు టిప్పు సుల్తాన్ రాకెట్ల తయారీని మరింతగా అభివృద్ధి చేశాడు. నాణ్యమైన లోహంతో తయారు చేసిన సిలిండర్ల నుంచి ప్రయోగించిన రాకెట్లు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగేవి. టిప్పు సుల్తాన్ సైన్యం ప్రయోగించిన రాకెట్లకు నాటి బ్రిటిష్ సైన్యం ముప్పుతిప్పలు పడింది. టిప్పు సుల్తాన్‌ను జయించిన తర్వాత బ్రిటిష్ సైనికాధికారులు మైసూరు రాకెట్ల తయారీ విధానాన్ని తెలుసుకుని, దానికి మరింత మెరుగులు దిద్దుకోగలిగారు. బ్రిటిష్ హయాంలో ఆధునిక విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఎందరో భారతీయులు విదేశాలకు వెళ్లి ఉన్నతస్థాయి చదువులు చదువుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ పరిశోధనలు సాగించారు. సి.వి.రామన్, హరగోవింద ఖురానా, జగదీశ్చంద్ర బోస్ వంటి ఎందరో శాస్త్రవేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేశారు. భారతదేశంలో ఆధునిక శాస్త్ర పరిశోధనలకు ఇలాంటి శాస్త్రవేత్తలు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. మధ్యయుగంలో మన సాంకేతిక విజయాలు మధ్యయుగంలో కూడా భారతీయులు అనేక అపురూపమైన సాంకేతిక విజయాలను సాధించారు. కశ్మీర్ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్త అలీ కశ్మీరీ ఇబ్న్ లుక్మాన్ క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో తొలిసారిగా అతుకులు లేని భూగోళపు లోహపు నమూనాను (గ్లోబ్) రూపొందించాడు. మొఘల్ సామ్రాజ్యంలో ఇలాంటి ఇరవై గ్లోబ్‌లను తయారు చేశారు. వీటిని కశ్మీర్‌లోను, లాహోర్‌లోను 1980లో ఆధునిక శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఎంతటి ఆధునిక పరిజ్ఞానంతోనైనా అతుకులు లేకుండా లోహపు గ్లోబ్‌ను రూపొందించడం సాధ్యం కాదని వారు తేల్చారు. అప్పటికాలంలో అతుకులు లేని లోహపు గ్లోబ్‌లను తయారు చేయడం అపురూపమని అభిప్రాయపడ్డారు. మన ఆధునిక సాంకేతిక విజయాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక విద్యపై దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్‌లో 1951 ఆగస్టు 18న తొలి ఐఐటీని ఏర్పాటు చేసింది. అనతికాలంలోనే బాంబే, మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్లలో కూడా ఐఐటీలను ఏర్పాటు చేసింది. అప్పట్లో సోవియట్ యూనియన్‌తో ఉన్న సత్సంబంధాలు అంతరిక్ష పరిశోధనలకు ఊతమిచ్చాయి. స్వయంగా అంతరిక్ష పరిశోధనలను సాగించాలనే లక్ష్యంతో 1969లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటైంది. ‘ఇస్రో’ నిర్మించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను సోవియట్ యూనియన్ 1975 ఏప్రిల్ 19న విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. అనతికాలంలోనే ‘ఇస్రో’ రోహిణి సిరీస్‌లో మూడు ఉపగ్రహాలను రూపొందించి, తాను స్వయంగా నిర్మించిన అంతరిక్ష ప్రయోగ వాహనాల ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. తర్వాతి కాలంలో ‘ఇస్రో’ అనేక ఘన విజయాలను సాధించింది. ‘చంద్రయాన్–1’, ‘చంద్రయాన్–2’, ‘మంగళ్యాన్’ప్రయోగాలు ‘ఇస్రో’ను ప్రపంచస్థాయి అంతరిక్ష పరిశోధన సంస్థలకు దీటుగా నిలిపాయి. ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు ప్రపంచమంతటా ఇప్పుడు ఇంటర్నెట్ విస్తరించింది. ఇంటర్నెట్ విస్తరణతో ప్రపంచమే కుగ్రామంగా మారింది. ఇంటర్నెట్ పనిచేయడానికి అత్యంత కీలకమైన ఫైబర్ ఆప్టిక్స్‌ను రూపొందించిన వ్యక్తి మన భారతీయుడే. అమెరికాలో స్థిరపడిన భారత శాస్త్రవేత్త నరీందర్సింగ్ కపానీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను రూపొందించారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో పరిశోధనలు సాగించే కాలంలో ఆయన తన సహ శాస్త్రవేత్త హెరాల్డ్ హాప్కిన్స్తో కలసి 1953లో ఆప్టికల్ ఫైబర్ తీగల ద్వారా తొలిసారిగా ఒక ఫొటోను విజయవంతంగా ట్రాన్స్మిట్ చేయగలిగారు. ఈ ప్రయోగంతో ఆయన ‘ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు’గా శాస్త్ర సాంకేతిక రంగంలో ఘనకీర్తిని దక్కించుకున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ను ఎడాపెడా వాడుతున్న యువతరానికి కపానీ పేరు పెద్దగా తెలియదు. ‘ఫార్చూన్’ పత్రిక 1999లో విడుదల చేసిన ‘ఈ శతాబ్ది వాణిజ్యవేత్తలు’ ప్రత్యేక సంచికలో కపానీని ‘అన్సంగ్ హీరో’గా గుర్తించింది. కమ్యూనికేషన్ల రంగాన్ని కీలకమైన మలుపు తిప్పిన కపానీకి దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని ‘ఫార్చూన్’ పత్రిక అభిప్రాయపడింది. యూఎస్బీ ఆవిష్కర్త డెస్క్‌టాప్ కంప్యూటర్లు, లాప్టాప్ కంప్యూటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు వంటివి విరివిగా వాడుతున్న ఇప్పటి తరానికి యూఎస్బీ అంటే తెలియనిది కాదు. కీబోర్డులు, మౌస్‌లు, పెన్‌డ్రైవ్‌లు వంటివేవి వాడాలన్నా ఎలక్ట్రానిక్ పరికరాలకు యూఎస్బీ పోర్టు తప్పనిసరి. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించేవారికి రోజువారీ జీవితంలో భాగంగా మారిన ‘యూనివర్సల్ సీరియల్ బస్’ (యూఎస్బీ) రూపకర్త మన భారతీయుడే! అమెరికాలో స్థిరపడిన భారత శాస్త్రవేత్త అజయ్ వీ భట్ తొలిసారిగా 1996లో యూఎస్‌బీని రూపొందించారు. తర్వాతి కాలంలో దీనికి మెరుగులు దిద్దారు. ఇదొక్కటే కాదు, కంప్యూటర్లలో బొమ్మల నాణ్యతకు చాలా కీలకమైన ‘యాక్సిలరేటెడ్ గ్రాఫిక్ పోర్ట్’ (ఏజీపీ), ‘పెరిఫరల్ కనెక్ట్ ఇంటర్‌కనెక్ట్ ఎక్స్‌ప్రెస్’ (పీసీఐ–ఈ) వంటి వాటిని కూడా భట్ రూపొందించారు. భట్ ఆవిష్కరణలకు గుర్తింపుగా ఆయనకు 2013లో ‘యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు’ లభించడం విశేషం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఎప్పటికప్పుడు తన ముద్రను చాటుకుంటూనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో తన సాంకేతిక పాటవాన్ని నిరూపించుకుంటూనే ఉంది. సాంకేతిక రంగంలో భారతీయులు అడుగుపెట్టని విభాగమంటూ దాదాపు ఏదీ లేదు. భవిష్యత్తులో కూడా భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మరిన్ని ఘనవిజయాలను సాధించగలరని ఆశించవచ్చు. హాట్‌మెయిల్ రూపకర్త కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగిన ఇప్పటి కాలంలో కంప్యూటర్లు వాడేవారంతా ఈ–మెయిల్ సేవలను వాడుకుంటున్నారు. తొలినాళ్లలో ఈ–మెయిల్ కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ–మెయిల్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొత్తలో 1960వ దశకంలో ఈ–మెయిల్ పంపే వ్యక్తి, దానిని స్వీకరించే వ్యక్తి ఇద్దరూ ఆన్లైన్లో ఉంటేనే ఈ–మెయిల్ కమ్యూనికేషన్ సాధ్యమయ్యేది. చాలాకాలం వరకు ఒకే రకమైన కంప్యూటర్లు వినియోగించే వారి మధ్య మాత్రమే ఈ–మెయిల్ కమ్యూనికేషన్ సాధ్యమయ్యేది. ఇన్ని లోపాల కారణంగా చాలాకాలం పాటు ఈ–మెయిల్ సామాన్యులకు అందుబాటులో లేని వ్యవహారంగానే కొనసాగింది. అమెరికాలో స్థిరపడిన భారత వాణిజ్యవేత్త, శాస్త్రవేత్త సబీర్ భాటియా తొలిసారిగా 1996లో ఉచిత ఈ–మెయిల్ సర్వీస్ ‘హాట్‌మెయిల్’ను అందుబాటులోకి తెచ్చాడు. తన సహచరుడు జాక్ స్మిత్‌తో కలిసి ‘హాట్‌మెయిల్ డాట్ కామ్’ సంస్థను ఏర్పాటు చేశాడు. తర్వాతికాలంలో ‘హాట్‌మెయిల్’ను ‘మైక్రోసాఫ్ట్’కు అమ్మేశాడు. ‘మైక్రోసాఫ్ట్’ చేజిక్కించుకున్నాక హాట్‌మెయిల్ మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ‘హాట్‌మెయిల్’ అంతరించినా, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఉచిత ఈ–మెయిల్ సేవలన్నింటికీ ఇదే స్ఫూర్తిప్రదాత. – పన్యాల జగన్నాథదాసు -
భారత్ బయోటెక్‌కు నేషనల్ టెక్నాలజీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న బయోఫార్మస్యూటికల్స్ సంస్థ భారత బయోటెక్ వ్యాక్సిస్ రోటావాక్కు నేషనల్ టెక్నాలజీ అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సంస్థ చైర్మన్ కృష్ణా ఎల్లా ఈ అవార్డును అందుకున్నారు. అతిసారి వ్యాధి నియంత్రణ లక్ష్యంగా ఈ రోటావాక్ వ్యాక్సిన్‌ను బయోటెక్ తయారుచేసింది. భారత్ నుంచి దీన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా.. వాణిజ్య పరంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ఎగుమతులు చేస్తున్నందుకు గాను భారత్ బయోటెక్ ఈ అవార్డు దక్కించుకుంది. శాస్త్రీయ ఆవిష్కరణ పరంగా ప్రతిభ చూపిస్తూనే అంతర్జాతీయ మార్కెట్లో పరిశోధన రంగాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను ఈ అవార్డును అందిస్తున్నట్టు టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు తెలిపింది. కేవలం అతిసార వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్లకు మాత్రమే కాకుండా.. పోలియో నివారణలోనూ భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్లకు అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభిస్తోందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. -
ఇంటర్ బోర్డుకు జాతీయ స్థాయి అవార్డు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్ బోర్డుల నిర్వహణలో సంస్కరణలు, వినూత్న ప్రయోగాలు, కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, అందిస్తున్న సేవల్లో మెరుగైన పనితీరు కనబరిచినందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు ‘టాప్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ అవార్డు లభించింది. రీ థింక్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని 35 ఇంటర్, ప్లస్ టు బోర్డులను పరిశీలించి పై అంశాలతో పాటుగా విద్యలో నాణ్యతా ప్రమాణాలను పాటించినందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) సందర్భంగా ఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సాంకేతికతను ఉపయోగించుకోవడంలో.. ఆన్లైన్ సర్వీసెస్ వంటి వాటిని ప్రవేశపెట్టడంలో ముందంజలో ఉందని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి తెలిపారు.