పెళ్లిలో ఘర్షణ..
సుల్తానాబాద్ : మండలంలోని నారాయణరావుపల్లిలో ఆదివారం పెళ్లిలో జరిగిన ఘర్షణలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఎలవేని రాజయ్య కూతురు వివాహం మానకొండూరు మండలం కొండపల్కలకు చెందిన యువకుడితో జరిగింది. వివాహం అనంతరం బ్రహ్మణులకు పెళ్లి కట్నం ఇచ్చేందుకు అబ్బాయి తల్లిదండ్రులు పెద్దమనిషిని పిలిచి అడిగారు. తాను ఇవ్వడం ఎందుకని ఆడపిల్ల వాళ్లే ఇవ్వాలని అనడంతో ఇరుగ్రామాల పెద్ద మనుషుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో మండలంలోని గొల్లపల్లికి చెందిన కొత్తూరు కొమురయ్య ఆయన కుమారుడు వెంకటేష్‌ను కొందరు పక్కకు నెడుతూ కొట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రీకొడుకులు కొండపల్కలకు చెందిన పిట్టల చంద్రయ్య, సతీష్, రాజేశ్వరి, రేగుల పోచయ్యలపై కర్రలతో దాడిచేశారు. ఇద్దరికి తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. హెడ్‌కానిస్టేబుల్ వీరస్వామి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అంతటితో ఆగకుండా కొమురయ్య, వెంకటేష్ ట్రాక్టర్ టైర్ల గాలిని తీశారు. మళ్లీ గొడవ జరగకుండా పెళ్లి అప్పగింతలు పూర్తయ్యేవరకు పోలీసులు అక్కడే ఉన్నారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.