breaking news
My Choice
-
అలాంటి మగవాళ్ల కోసమే మై చాయిస్
‘‘మహిళలను హీనంగా చూసే పురుషులు ఇంకా ఉన్నారు. సంకుచిత స్వభావంతో ఉన్నవారు కోకొల్లలు. అలాంటి మగవాళ్ల కోసమే ‘మై చాయిస్’. స్త్రీ, పురుష సమానత్వం అనే అంశం మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’’ అంటున్నారు దీపికా పదుకొనే. ‘‘ప్రేమలో పడితే అది నా చాయిస్, బ్రేకప్ అయితే అది నా చాయిస్, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అది నా చాయిస్. నా జీవితం నా చాయిస్’’ అంటూ దీపికా నటించిన డాక్యుమెంటరీ ‘మై చాయిస్’ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ ప్రశంసలతో పాటు విమర్శలను కూడా దక్కించుకుంది. కొంతమంది యువకులైతే ఏకంగా ‘మై చాయిస్’ వీడియోకి కౌంటర్‌గా ‘మై చాయిస్ - మేల్ వెర్షన్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. ఇన్నాళ్లూ తన డాక్యుమెంటరీ గురించి మౌనం వహించిన దీపికా ఇప్పుడు నోరు విప్పారు. ‘‘మా ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందించినవారికి థ్యాంక్స్. విమర్శించినవాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తున్నా. కానీ ఈ చిత్రం ద్వారా ఇచ్చిన సందేశం అస్పష్టంగా వెళ్లిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే చాలా మందికి నా ఉద్దేశం సరిగ్గా అర్థం కాలేదు. ఇలాగే చేయమని ఎవరికీ చెప్పడం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలో ప్రతి మహిళా తెలుసుకోవాలనీ, ఎవరి ఇష్టం మేరకు వాళ్లు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాలన్నదే నా ఉద్దేశం’’ అన్నారు. -
చిన్న చూపు చూడొద్దు!
‘‘మగవాళ్లతో పోల్చితే ఆడవాళ్లు శారీరకంగా బలహీనులు కావచ్చు.. కానీ వాళ్లకి బుద్ధిబలం ఎక్కువ. అలాగని, నేను మగవాళ్లను తక్కువ చేసి మాట్లాడటంలేదు. కానీ, స్త్రీని చిన్న చూపు చూడొద్దంటున్నాను’’ అని సోనమ్ కపూర్ అంటున్నారు. ఇటీవల ‘మై చాయిస్’ పేరుతో దీపికా పదుకొనె ఆడవాళ్ల హక్కుల గురించి ప్రస్తావిస్తూ నటించిన వీడియో బయటికొచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియోకు విమర్శలూ, ప్రశంసలూ రెండూ లభిస్తున్నాయి. స్త్రీ హక్కుల గురించి మాట్లాడుతున్నారు కదా.. మీక్కూడా అలాంటి వీడియో ఏదైనా చేసే ఉద్దేశం ఉందా? అనే ప్రశ్న సోనమ్ కపూర్ ముందుంచితే - ‘‘నాకా ఆలోచన లేదు. ఎందుకంటే, మనోభావాలు చెప్పడానికి వీడియో అవసరంలేదు. ఎప్పుడనిపిస్తే అప్పుడు... ఎక్కడ అనిపిస్తే అక్కడ నిర్భయంగా నేను చెప్పేస్తా.. మా ఇంట్లో ‘నువ్వు ఆడపిల్లవు...’ అని అడుగడుగునా గుర్తు చేస్తూ, పెంచలేదు. అందుకని, మగవాళ్లకన్నా ఆడవాళ్లను తక్కువగా చూస్తారనే విషయం కూడా తెలియదు. కానీ, సినిమాల్లోకొచ్చాక తెలిసింది. హీరోలను ఒకలా.. హీరోయిన్లను వేరేలా చూస్తుంటారు. హీరోలకు బోల్డంత మర్యాద.. హీరోయిన్లకు అందులో కొంత. విచిత్రంగా అనిపించింది. అప్పట్నుంచే ఆడవాళ్ల హక్కుల విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ప్రపంచం ఎంత ఎదిగినా ఆడవాళ్ల హక్కుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేదని తెలుసుకున్నా. ఇది విచారించదగ్గ విషయం. కానీ, విచారిస్తే లాభం లేదు. ప్రతి స్త్రీ తన హక్కుల కోసం పోరాడాలి. అప్పుడే మార్పు వస్తుంది’’ అని చెప్పారు.