breaking news
the municipalities
-
75 రోజులు...‘పుర’ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు
- మున్సిపాలిటీలు ఇక ‘చెత్త’ రహితం - గడపగడపకూ వెళ్లి చెత్త సేకరించాలని సీఎం ఆదేశాలు - జీహెచ్ఎంసీ డిజైన్‌తో మార్కెట్లు, రైతుబజార్లు - జిల్లా కేంద్రంలో వైకుంఠధామం పేరుతో శ్మశానవాటిక - ఎల్ఈడీ లైటింగ్లు, పార్కులుగా డంపింగ్ యార్డులు - ప్రణాళిక అమలుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి మెప్మా బాధ్యతలు - రేపు మున్సిపల్ చైర్మన్లతో జిల్లా అధికారుల సమావేశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ‘పుర’ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు 75 రోజుల కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తున్నారు. ఈ 75 రోజుల్లో జిల్లాలోని పట్టణ ప్రాంతాలను చెత్త రహిత ప్రాంతాలుగా మార్చాలని, పట్టణాల్లో అనేక మార్పులు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. మున్సిపల్ పరిపాలన శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ నేతృత్వంలో ఈ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రణాళికలను అమలు చేసేందుకు గాను ఎస్పీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్‌ను మెప్మా పీడీగా నియమించారు. ఈ ప్రణాళికల అమలుపై చర్చించడంతోపాటు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ చైర్మన్లతో జిల్లా కేంద్రంలో కలెక్టర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. ‘చెత్త’పైనే దృష్టి తెలంగాణలోని పట్టణాలను చెత్త రహిత నగరాలుగా మార్చాలని సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సూచించిన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా ఇందుకు తగిన ప్రణాళికలు తయారుచేస్తున్నారు. ప్రతి పట్టణంలో చెత్త సేకరణను ఒక ఉద్యమంగా చేపట్టనున్నారు. గడపగడపకూ వెళ్లి చెత్తను సేకరించే విధానం ఇప్పటికే అమలవుతున్నా, దాన్ని మరింత పక డ్బందీగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన అదనపు సిబ్బంది, ఇతర సౌకర్యాలు ఏమిటన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక జిల్లాలోని అన్ని డంపింగ్ యార్డులను పార్కులుగా మార్చనున్నారు. మిర్యాలగూడ, భువనగిరి యార్డులను ఇప్పటికే ఆ దిశలో తయారుచేసే పనిలో ఉండగా, మిగిలిన మున్సిపాలిటీల్లోని యార్డులను కూడా పార్కులుగా తయారుచేయనున్నారు. ఇందుకోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే చెట్లను డంపింగ్ యార్డుల్లో కూడా పెట్టనున్నారు. ఏరోమాటిక్ (సువాసన వెదజల్లే), మెడిసినల్ (ఔషధ)మొక్కలను యార్డుల్లో నాటుతామని అధికారులు చెపుతున్నారు. ఏ డంప్ విస్తీర్ణం ఎంత ఉంది? ఎన్ని మొక్కలు అవసరం అవుతాయనే దానిపై కూడా జిల్లా యంత్రాంగం లెక్కలు కడుతోంది. ప్రతి మూడో శనివారం ‘అర్బన్ డే’ చెత్తతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లు, చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ల ఏర్పాటు, పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. ప్రతి మార్కెట్లో రెండున్నర అడుగుల ప్లాట్‌ఫారాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అయితే, ఈ మార్కెట్లకు సంబంధించి ఎలాంటి మార్పులు చేపట్టాలన్న దానిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు డిజైన్లు తయారుచేస్తున్నారని, ఆ డిజైన్ల మేరకు మన జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మార్కెట్లను అభివృద్ధి పరుస్తామని జిల్లా ముఖ్య అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. మరోవైపు అన్ని పట్టణాలలో ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు కోసం కూడా ఈ ప్రణాళికలో ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే పట్టణ ప్రాంతాల అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అయితే, జిల్లాలోని పట్టణ ప్రాంతాల సమస్యలపై చర్చించేందుకు, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రతి నెలా మూడో శనివారాన్ని ‘అర్బన్ డే’గా ప్రకటించనున్నట్టు తెలిసింది. -
‘గాలి’ నాటకం!
సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు గాలి ముద్దుకృష్ణమ ఎత్తుగడ డ్వాక్రా మహిళలను ప్రసన్నం చేసుకునే యత్నం మభ్య పెడుతున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు పుత్తూరులో మహిళా సమాఖ్య సమావేశాలు పుత్తూరు : డ్వాక్రా రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న పొంతనలేని ప్రకటనలపై వ్యతిరేకత వస్తుందనే ముందస్తు ఆలోచనతో అధికార తెలుగుదేశం పార్టీ పక్షాలు కొత్త నాటకానికి తెరలేపాయి. అధికార పక్షం ఉన్న మున్సిపాలిటీలు, మండలాల్లో ఉన్నఫలంగా డ్వాక్రాగ్రూపు సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరినీ ఒకే వేదికపైకి రప్పిస్తే విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించి సమాఖ్యల వారీగా ఆయా ప్రాంతాల్లోనే సమావేశపరుస్తున్నారు. పెపైచ్చు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు అతి తెలివిని ప్రదర్శిస్తూ మాయ మాటలతో రుణ మాఫీ విషయాన్ని మభ్య పెట్టే పనిని కార్యక్రమంగా చేపట్టారు. సమావేశాలకు హాజరుకాకపోతే మున్ముందు సమాఖ్య ప్రతినిధులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని గ్రహించి వెళ్లాల్సి వస్తోందని పలువురు మహిళల వాదన. నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచనలతో పుత్తూరు మున్సిపల్ పరిధిలో డ్వాక్రా గ్రూపుల సమావేశాలను ముమ్మరం చేస్తున్నారు. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధిపై పార్టీ అధిష్టానం అసంతృప్తిలో ఉందనే వాదన వినిపిస్తోంది. దీనిని అధిగమించి సీఎం దృష్టిని ఆకర్షించే యత్నంలో ఆయన వేసిన ఎత్తుగడలో భాగమే డ్వాక్రా గ్రూపు మహిళల సమావేశాల నిర్వహణ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుత్తూరు మున్సిపల్ పరిధిలో 862 డ్వాక్రా గ్రూపుల్లో 8620 మంది సభ్యులు ఉన్నారు. 24 వార్డులకు 42 సమాఖ్యలు కాగా ఒక్కొక్క సమాఖ్య నేతృత్వంలో 15 నుంచి 20 గ్రూపులు ఉన్నాయి. వీరికి 2013-14 ఆర్థిక సంవత్సానికి బ్యాంకు లింకేజి కింద రూ.11 కోట్ల రుణాలు అందించారు. ఒక్కొక్క గ్రూపునకు 1 నుంచి 5 లక్షల మేరకు రుణ మంజూరు చేశారు. అయితే ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని హామీతో బ్యాంకులకు నెలసరి కంతులు కట్టడం మానేశారు. ప్రస్తుతం రుణమాఫీపై సమగ్ర సమాచారం లేకపోవడంతో మహిళల్లో వ్యతిరేకత రాకుండా చేసేందుకు నేరుగా మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, టీడీపీ కౌన్సిలర్లు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే శుక్రవారం పుత్తూరు మున్సిపల్ పరిధిలోని 13, 14, 24 వార్డుల్లో మహిళా సమాఖ్య సమావేశాలు నిర్వహించారు. కాగా 14 వార్డులో నిర్వహించిన సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధి తనయుడు హాజరయ్యారు. రుణమాఫీ త్వరలో చేస్తారని ముందుగా రైతురుణ మాఫీకి ప్రాధాన్యత ఇస్తున్నారని తరువాత డ్వాక్రా మహిళలకు అంటున్న దశలో ఓ మహిళ ప్రశ్నిస్తూ ‘ఎప్పుడనేది తేదీ చెప్పకుండా తరువాతంటూ ఎప్పటికయ్యా..? ఇప్పటికే చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది’ అని నిలదీయడంతో ఆమెకు సర్దిచెప్పారు. నిబంధనల మేరకు సమాఖ్య సమావేశాలకు ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరు కావాలి. అయితే మాజీ ప్రజా ప్రతినిధి తనయుడిని ఏ హోదాలో ఆహ్వానించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.