breaking news
Moose meat
-
మట్టికుండ బంగారమైతదని.. రూ.2లక్షల50వేలు కాజేసిన ఘనుడు
సాక్షి, దస్తురాబాద్: మట్టికుండ బంగారమైతదని నమ్మబలికి డబ్బులు కాజేశాడు ఓ ఘనుడు. మోసపోయిన బాధితుడు తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో తప్పించుకునేందుకు దుప్పిని హతమార్చి దాని మాంసాన్ని అతడి చేనులో ఉంచి కేసు నమోదు చేయించాలని ప్లాన్ చేశాడు. చివరికి గ్రామ పెద్దల ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. మండలంలోని ఆకొండపేట గ్రామానికి చెందిన జాడి బుచ్చన్న అదే గ్రామానికి చెందిన మావుకారి రాజేశ్ ఇంటికి ఏప్రిల్ 29 రాత్రి ఒక మూటలో మట్టి కుండను తీసుకెళ్లాడు. దానిని ఓ మూలన పాతిపెట్టాడు. నెల రోజుల వరకు దానిని ఎవరూ ముట్టవద్దని, నెల తరువాత తానే స్వయంగా తీస్తానని నమ్మబలికాడు. మట్టికుండ బంగారు కుండగా మారాలంటే రూ.2లక్షల 50వేలు ఖర్చు అవుతాయని చెప్పాడు. ఈ విషయం నమ్మిన రాజేశ్ అట్టి డబ్బులను ముట్టజెప్పాడు. నెల రోజులు దాటిన తరువాత బుచ్చన్న ఇంటికి వెళ్లి కుండను బయటకుతీయాలని కోరాడు. రేపుమాపు అంటూ ఆరు నెలలు గడిపాడు. తను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాజేశ్ ఒత్తిడి చేశాడు. అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామ పెద్దలకు విషయం చెప్పాడు. బుచ్చన్నను గ్రామపంచాయతీకి పిలిచి విషయం అడిగారు. ఈ నెల 11న చర్చించుకుందామని చెప్పి బుచ్చన్న వెళ్లిపోయాడు. గ్రామ పెద్దలు ఎలాగైనా డబ్బులు కట్టిస్తారని ఆలోచన చేసి ఈ నెల 10వ తేదీన గ్రామ సమీపంలోని అడవిలో అదే గ్రామానికి చెందిన ముష్కం శ్రీనివాస్‌తో కలిసి దుప్పిని హతమార్చాడు. ఆ దుప్పి మాంసాన్ని కోసేందుకు గోండుగుడా గ్రామానికి చెందిన సిడాం సోముకు అప్పజెప్పాడు. అదేరోజు రాత్రి ఆ మాంసాన్ని మావుకారి రాజేష్ పంట చేనులో ఉంచి మరుసటి రోజు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి రాజేష్ పంటచేనులో వేట మాంసం ఉందని, అతడిపై ఎలాగైనా అటవీశాఖ అధికారులతో కేసు నమోదు చేయించాలని కోరాడు. అందుకు రూ.10 వేలు ఇస్తానని తెలిపాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ అటవీశాఖ అధికారి అలీమ్కు సమాచారం ఇచ్చాడు. అతడు సంఘటనా స్థలానికి చేరుకుని మాంసాన్ని స్వాధీనం చేసుకుని పంటచేను యజమాని రాజేష్, కౌలుదారుడు కుక్కరికారి లక్ష్మయ్యను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆకొండపేట గ్రామపెద్దలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గ్రామంలో గుప్త నిధుల పేరుతో జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బుచ్చన్న, దుప్పిని వేటాడేందుకు సహకరించిన శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అలాగే హెడ్‌కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐ అజయ్‌బాబు, ఎస్సై జ్యోతిమణి ఉన్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులను ఫోన్లో వివరణ కోరగా పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. (చదవండి: హైదరాబాద్: కంచే చేను మేసింది.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబ్బంది సహా పదిమందికి కఠిన శిక్షలు) -
దుప్పి మాంసం స్వాధీనం
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): మండలంలోని ఎర్రగుంట పంచాయతీ శాంతినగర్ గ్రామంలో శుక్రవారం చుక్కల దుప్పి మాంసాన్ని అటవీ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. చండ్రుగొండ రేంజర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో రేంజర్ రాముడు తెలిపిన వివరాలు.. శాంతినగర్ గ్రామానికి చెందిన మొడియం తిరుపతయ్య ఇంట్లో చుక్కల దుప్పి మాంసం ఉందన్న సమాచారంతో అటవీ అధికారులు తనిఖీ చేశారు. దుప్పి మాంసం దొరికింది. దానిని స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో ఎఫ్ఎస్ఓ లక్ష్మీనారాయణ, బీట్ ఆఫీసర్ లింగేశ్వర్, బేస్ క్యాంప్ సిబ్బంది దుగ్గిరాల శ్రీను, టి.శివ, మురళి తదితరులు పాల్గొన్నారు. -
దుప్పి మాంసం స్వాధీనం
లింగాల : మండలంలోని రాయవరంలో శుక్రవారం రెండు కిలోల దుప్పి మాంసాన్ని అటవీశాఖ అధికారి చంద్రమౌళి స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు దుప్పి మాంసం వండిన ఈ గ్రామానికి చెందిన శంకర్, వెంకటయ్యలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడం చట్ట విరుద్ధమని పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.