breaking news
modern slavery
-
ఆధునిక బానిసత్వంలో ‘ఆమె’
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల మంది మహిళలు, బాలికలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని, వెట్టి కార్మికులుగా, బలవంతపు వివాహాలు, ఎల్లకాలం ఇంటిపనిలో మగ్గిపోవడం లాంటి దోపిడీలకు గురవుతున్నారని ఒక నూతన అధ్యయనం అంచనా వేసింది. నేడు ప్రతి 130 మంది మహిళలు, బాలికల్లో ఒకరు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని, ఇది ఆస్ట్రేలియా జనాభాకంటే ఎక్కువని వాక్ ఫ్రీ యాంటీ స్లేవరీ ఆర్గనైజేషన్ కో ఫౌండర్ గ్రేస్ ఫారెస్ట్ తెలిపారు. మానవ జాతి చరిత్రలో ఇంత వరకు ఎప్పుడూ లేనంత మంది మహిళలు బానిసత్వంలో మగ్గుతున్నారని ఆమె యూ ఎన్ న్యూస్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్లు వాక్ఫ్రీ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం బలవంతపు లైంగిక దోపిడీకి గురయ్యేవారిలో 99 శాతం, బలవంతపు వివాహాల బాధితుల్లో 84 శాతం మంది, బలవంతపు శ్రమదోపిడీ బాధితుల్లో 58 శాతం మహిళలే. -
60 శాతం దేశాల్లో బానిస కార్మిక వ్యవస్థ
లండన్: ఆధునిక బానిస కార్మిక వ్యవస్థ నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుంటోంది. 60 శాతం దేశాల్లో ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ఈ బానిస కార్మిక వ్యవస్థపై ప్రపంచంలోని 198 దేశాల్లో అధ్యయనం జరపగా 115 దేశాల్లో బానిస కార్మికులు ఎక్కువగా ఉన్నారని బ్రిటన్కు చెందిన ‘వియ్రిస్క్ మాప్లెక్రాఫ్ట్’ కన్సల్టెంట్ సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 4.60 కోట్ల మంది కార్మికులు బానిస వ్యవస్థలో మగ్గిపోతున్నారని ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ 2016 గ్లోబల్ నివేదికలో వెల్లడించింది. బెదిరించి పనిచేయించుకోవడం, మానవుల అక్రమ రవాణా, అప్పులిచ్చి పనిచేయించుకోవడం, దౌర్జన్యంగా పెళ్లి చేసుకోవడం తదితర పద్ధతుల ద్వారా ఈ బానిస కార్మిక వ్యవస్థ నడుస్తోందని, ఈ వ్యవస్థలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారని వియ్రిస్క్ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోకెల్లా ఉత్తర కొరియాలో బానిస కార్మిక వ్యవస్థ మరీ దారుణంగా ఉందని, ఆ తర్వాత సౌత్ సూడాన్, సూడాన్, డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలు ఉన్నాయని తెలిపింది. బ్రిటన్, జర్మనీ, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల్లో బానిస వ్యవస్థ రిస్క్ ప్రపంచంలోకెల్లా తక్కువగా ఉంది. తమ సప్లై ఛానళ్లలో బానిస వ్యవస్థను నిర్మూలించేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయో 4,70 కోట్ల డాలర్లు దాటిన ప్రతి కంపెనీ స్వచ్ఛందంగా ప్రభుత్వాలకు వెల్లడించాలనే నిబంధనలను బ్రిటన్లో కచ్చితంగా పాటిస్తున్నారు. పెద్ద మార్కెటింగ్ సప్లై చెయిన్లు కలిగిన చైనా, భారత్ లాంటి దేశాల్లో కూడా ఓ మోస్తరుగా బానిస కార్మిక వ్యవస్థ కొనసాగుతోందని వియ్రిస్క్ వెల్లడించింది. బానిస కార్మిక వ్యవస్థను నిరోధించేందుకు పలు దేశాల్లో కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా అమలుకు నోచుకోక పోవడం వల్ల బానిస కార్మిక వ్యవస్థ విస్తరిస్తోంది.