breaking news
moblie app
-
ఫోన్ పే వాడుతున్నారా .. అయితే ఈ శుభవార్త మీకే
-
సైబర్ ముప్పుపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు ఇంటర్నెట్ ఆటస్థలంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు. గురువారమిక్కడ జరిగిన ‘సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సు’నుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంటర్నెట్ రోజువారీ అవసరంగా మారినా.. స్వేచ్ఛాయుత వినియోగం తరచూ సైబర్ దాడులకు దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు. సైబర్ ముప్పును ఎదుర్కొ నేందుకు యువతను సైబర్ నిపుణు లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ ముప్పు అత్యంత తీవ్రమైందని, హ్యాకింగ్, వెబ్సైట్లపై దాడులు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి కానీ అంతకుమించి తీవ్రతను కలిగి ఉందని మోదీ హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్య ప్రపంచానికి సైబర్ దాడులు ప్రధాన ముప్పని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. సమాజంలో సులువుగా ప్రభావితమయ్యే వర్గాలు.. సైబర్ నేరగాళ్ల దుష్ట పన్నాగంలో చిక్కుకోకుండా మనం జాగ్రత్త వహించాలి. సైబర్ భద్రతపై అప్రమత్తత నిత్య జీవితంలో భాగం కావాలి’ అని మోదీ చెప్పారు. యువతకు ఆకర్షణీయమైన, ఉపయోగకర మైన రంగంగా సైబర్ భద్రతను తీర్చిదిద్దేలా యత్నించాలని చెప్పారు. గత మే–జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయి. అనేక బ్యాంకులు, బహుళజాతి కంపెనీలు ఈ దాడులతో ప్రభావితం కాగా.. పోర్టుల్లో కార్యకలాపాలు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. గోప్యత, జాతీయ భద్రతల మధ్య... గోప్యత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ వాడకం.. జాతీయ భద్రతల మధ్య సరైన సమన్వయంతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ సూచించారు. ‘ప్రస్తుతం వస్తున్న కొత్త డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు భవిష్యత్తుపై ప్రభావం చూపగలవు. ఈ నేపథ్యంలో పారదర్శకత, గోప్యత, నమ్మకం, భద్రత వంటి కీలక ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. ప్రస్తుత యుగంలో డిజిటల్ సాంకేతికత ఎన్నో విధాలుగా సాయపడుతుందని అన్నారు. ‘సబ్సిడీలు సద్వినియోగమయ్యేలా బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఆధార్ సేవల్ని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. సబ్సిడీల వ్యయంలో ఇంతవరకూ రూ.65 వేల కోట్ల వృథాను అరికట్టాం. రైతులకు నిపుణుల సలహాలతో పాటు పంటకు మంచి ధర పొందేందుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి సరకులు సరఫరా చేసేందుకు డిజిటల్ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ప్రధాని తెలిపారు. సాంకేతికత అన్ని అడ్డంకుల్ని ఛేదించిందని, ప్రభుత్వ సేవలు, పాలన ప్రజలకు చేరేందుకు, విద్య నుంచి ఆరోగ్యం వరకూ సులువుగా అందుబాటులో ఉండేందుకు మార్గం సుగమం చేసిందన్నారు. భారతీయ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ పెట్టుబడుదారుల్ని మోదీ కోరారు. కార్యక్రమంలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే పాల్గొన్నారు. ఉమంగ్ యాప్‌ను ప్రారంభించిన ప్రధాని ఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పా రు. ఈ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్ బిల్ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.ఈ యాప్ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా మాత్ర మే పనిచేసే ఈ యాప్‌ను ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది. -
ఏడాది చివరిలో కొత్త పార్కింగ్ విధానం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల అవసరాల దృష్ట్యా ఈ ఏడాది చివరిలోగా కొత్త పార్కింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి తారకరామారావు చెప్పారు. నగరంలో ఎక్కువ సాంద్రత గల ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ పాలసీ అమలు చేస్తామని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో పార్కింగ్ విధానంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు, దేశాల్లోని పార్కింగ్ విధానాలు అధ్యయనం చేసి ఈ విధానాన్ని రూపొందించామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల అవసరాలకు అనుగుణంగా పార్కింగ్ విధానం ఉంటుందని.. అన్ని పట్టణాల్లో దశల వారీగా అమలు చేస్తామని వివరించారు. పార్కింగ్ విధానం అమలుకు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ విధానం అమలయ్యేనాటికి ఎక్కడ పార్కింగ్ అందుబాటులో ఉందో తెలుసుకునేలా ప్రత్యేక మొబైల్ యాప్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 700 కొత్త వాహనాలు హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయని, కొత్త వాహనాలతో ఎదురయ్యే పార్కింగ్ సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రత్యేక విధానం రూపొందించామని చెప్పారు. -
ఏపీలో మహిళల రక్షణకు ‘అభయ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళల రక్షణకు ఉద్దేశించి ‘అభయ’ పేరుతో ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ తరహా కేసులు రాష్ట్రంలో ఎక్కడా చోటు చేసుకోకుండా.. ఏ సమయంలోనైనా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం తొలివిడతగా ఏపీకి కేంద్రం రూ.56 కోట్లు కేటాయించింది. ఇదీ ప్రాజెక్టు..: క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేలా ‘అభయ’ ప్రాజెక్టును రూపొందించారు. ఇందుకోసం ‘అభయ’ మొబైల్ యాప్‌కు రూపకల్పన చేశారు. ‘అభయ’ ప్రాజెక్టు అమల్లోకి వస్తే క్యాబ్‌లు, ఆటోలకు జీపీఎస్ పరికరాలు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇవేగాక ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలన్నింటిలో జీపీఎస్ పరికరాలు అమర్చాలి. రవాణా, పోలీసుశాఖ సిబ్బంది కాల్‌సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. మహిళలకు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులెదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. తొలుత ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని విశాఖ, విజయవాడల్లో ‘అభయ’ ప్రాజెక్టును అమలు చేస్తారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.