breaking news
M.N.Ray
-
ఎం.ఎన్. రాయ్‌కి ఐన్‌స్టీన్ మద్దతు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, సాపేక్షతా సిద్ధాంత కర్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879–1955)కు భారతీయ ప్రముఖుల్లో రవీం ద్రనాథ ఠాగోర్ బాగా తెలుసు. ఆ తరువాత మహాత్మాగాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరి పారు. మరో ఇద్దరు ముగ్గురు సైంటిస్టులతో పరిచయం వున్నది. అయితే సైంటిస్టు కాని మానవవాద సిద్ధాంతకర్త ఎమ్.ఎన్.రాయ్ (1887–1954)తో పరిచయం వుండటం ఆశ్చర్యకరమైన విషయం. 1930లో ఎమ్.ఎన్. రాయ్ 17 సంవత్సరాల తర్వాత బొంబాయిలో మహమ్మూద్ అనే మారుపేరుతో అడుగు పెట్టాడు. ఆయన 1920 నుంచి 1930 వరకు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, రష్యాలలో ఉన్నాడు. అప్పట్లో భారత స్వాతంత్య్ర పోరాటాన్ని విదేశాల నుండే వివిధ రీతులలో జరిపించారు. కానీ, 1931 జూలై 31న బొంబాయిలో బ్రిటిష్ పోలీసులు ఎమ్.ఎన్.రాయ్‌ను అరెస్టు చేశారు. ఆ వార్త తెలిసి ఐన్‌స్టీన్ వెంటనే భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి పూర్వక లేఖ రాశారు. అది జర్మన్ భాషలో ఉన్నది. జెరూసలేంలోని ఐన్‌స్టీన్ పురావస్తు పుస్తక పరిశోధనాలయంలో ఉంది. ఎమ్.ఎన్.రాయ్‌ను హింసిం చకుండా మానవ దృక్పథంతో చూడాలని కోరారు. మేథావులపై క్రూరంగా పగతీర్చుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. అప్పటికే ఐన్‌స్టీన్ జర్మనీలో హిట్లర్ భయానికి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎమ్.ఎన్.రాయ్‌తో పరి చయం అయిందో తెలియదు. కానీ ఒక అసాధారణ సైంటిస్టు అలా రాయటం ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా ఐన్‌స్టీన్ ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోడు. దీనిని బట్టి వారిరువురికీ సన్నిహిత పరిచయం ఉండి ఉండాలి. ఎమ్.ఎన్.రాయ్ సైన్సు పట్ల తీవ్రస్థాయిలో ఆసక్తి కనబరిచినట్లు సైంటిస్టులతో పరిచయం ఉన్నట్లు జైలు నుంచి ఆయన రాసిన లేఖలను బట్టి తెలుస్తున్నది. జైలులో ఆధునిక విజ్ఞాన శాస్త్రాల తాత్విక ఫలితాలు అనే అంశాన్ని ఐదువేల పేజీలలో రాశారు. అందులో ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని చర్చించారు. తనకున్న సందేహాలను రాసి పారిస్‌లో ఉన్న ఎలెన్‌కు పంపి ఆయా సైంటిస్టులకు అందజేసి సమాధానాలు తెప్పించమన్నారు. దానినిబట్టి కూడా సైన్స్ లోతుపాతులు గ్రహించిన వ్యక్తిగా స్పష్టపడింది. కొందరు సైంటిస్టులు సమాధానాలిచ్చారు కూడా. జైలులో రాసిన రచనల సారాంశాన్ని ‘సైన్స్ అండ్ ఫిలాసఫీ’ పేరిట 1948లో చిన్న పుస్తకంగా వెలువరించారు. మిగిలిన రచన ఎడిట్ చేసి ప్రచురించవలసి ఉంటుందని ఆయన అనుచరుడు సైన్సు రచయిత అమృతలాల్ బిక్కుషా అభిప్రాయపడ్డారు. ఐన్‌స్టీన్‌తో ఎమ్.ఎన్.రాయ్ మొదటి భార్య ఎవిలిన్ (1892–1970)కు పరిచయం ఉంది. అణ్వాయుధ నిషేధ ఉద్యమం చేపట్టిన ఐన్‌స్టీన్ విరాళాల కోసం ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆమె కొంత వరకు సహాయపడింది. ఎమ్.ఎన్.రాయ్‌తోపాటు ఎవిలిన్ కూడా 1926 వరకు యూరోప్‌లో ఉంది. అప్పుడు ఐన్‌స్టీన్‌తో పరిచయం ఉండే అవకాశం ఉన్నది. ఆ పరిచయం వల్లనే 1950లో ఐన్‌స్టీన్ విరాళాలకై అమెరికాలో ఉంటున్న ఎవిలి న్కు విజ్ఞప్తి చేశాడు. వీటన్నిటి బట్టి చూస్తే ఎమ్.ఎన్.రాయ్ యూరోప్‌లో ఐన్‌స్టీన్‌ను కలిసి ఉండవచ్చునని భావిస్తున్నారు. రీజన్–రొమాంటిసిజమ్, రివల్యూషన్ అనే శీర్షికతో రెండు సంపుటాలు ఎమ్.ఎన్.రాయ్ ప్రచురించినప్పుడు సుప్రసిద్ధ సైకాలజిస్టు ఎరిక్ ఫ్రాం తన పుస్తకం సేన్ సొసైటీలో–ఎవరైనా యూరోప్ పునర్వికాసాన్ని గురించి అవగాహనకు రావాలి అంటే ఎమ్.ఎన్.రాయ్ గ్రంథం చదవమనటం పెద్ద విశేషం. ఈ విధంగా ఒక వైపున రాజకీయాలలో నిమగ్నుడై సతమతమైనా, మరొకవైపు సైన్సు పట్ల సైంటిస్టుల పట్ల ఆసక్తి చూపటమే కాక ప్రజోపయోగకరమైన రచనలు వెలువరించటం గమనార్హం. ఐన్‌స్టీన్ – రాయ్ పరిచయాలపై లోతైన పరిశీలన జరగవలసి ఉన్నది. (మానవవాద సిద్ధాంతకర్త ఎమ్.ఎన్.రాయ్‌ని 1931 జూలై 31న ముంబైలో అరెస్టు చేసిన ఘటనపై తక్షణ స్పందనగా భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు ఐన్‌స్టీన్ లేఖ రాసిన సందర్భంగా) -నరిసెట్టి ఇన్నయ్య సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : innaiah@gmail.com -
వీలునామా బాకీపడిన సమర్థుడు
సత్వం: ‘ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు? ఆగవలసిందేరా తండ్రుల్లారా’ అని సీతారామారావు వ్యాఖ్యానించినట్టుగా... ‘ఎందుకు? అన్న ప్రశ్న నేర్పిన’ నాన్న నుంచి పూర్తిగా ‘విముక్తుడయ్యాడు’. ప్రశ్న మాత్రమే మన జీవితాంతం తోడు రాగలుగుతుందా? ఎక్కడో ఒకచోట సమాధానపడవలసిన స్థితి తప్పక వస్తుందా? అలా వచ్చే స్థితి సహేతుకమా, నిర్హేతుకమా? ‘అసమర్థుని జీవయాత్ర’, ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’, ‘పోస్టు చేయని ఉత్తరాలు’, ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’, ‘తత్వవేత్తలు’ ‘మెరుపులు మరకలు’ వంటి విశిష్ట రచనలు చేసిన గోపీచంద్ ప్రయాణం- నాస్తికత్వంతో మొదలై, మార్క్సిజం, నవ్య మానవతావాదాల్ని దాటుకుని, ఆధ్యాత్మిక చింతన దగ్గర నిలిచిపోయింది. ‘సూతాశ్రమం’ స్థాపకుడు త్రిపురనేని రామస్వామి చౌదరి ఇంట జన్మించిన గోపీచంద్- తండ్రి అడుగుజాడల్లో హేతువాదిగా మసలుకున్నాడు. ‘ఎందుకు?’ అన్న ప్రశ్న వెంట నడిచాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, ‘శాస్త్రీయ ధోరణి’తో రచనలుగావించాడు. మానసిక విశ్లేషణ చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. సిద్ధాంతాల్ని తేలికభాషలో చెప్పే రాజకీయ కథల్ని రాశాడు. మార్క్సిజం ఏమిటో వివరించే ప్రయత్నం చేశాడు. తర్వాత, ఎం.ఎన్.రాయ్ బాటలో నడిచి రాడికల్ హ్యూమనిస్టుగా ఖ్యాతిగాంచాడు. సంఘంలోని హెచ్చుతగ్గులకు భగవంతుణ్ని కారణంగా చెప్పటాన్ని మోసంగా జమకట్టాడు. నీతినియమాలు ప్రకృతిలో నియమనిబద్ధతకు సంబంధించినవన్నాడు. ఏ దృక్పథమైనా మానవుడి పరిణామానికి దోహదం ఇచ్చేదిగా ఉండాలి; అతని మీద పెత్తనం చలాయించేదిగా ఉండకూడదన్నాడు. లేని గౌరవాలకు పోయి, ఉన్నదంతా ఊడగొట్టుకుని, లౌకిక ప్రపంచపు విలువల్ని తిరిగి అందుకోవడంలో విఫలమై, అందరిలాంటివాడే అనిపించుకోవడం ఇష్టంలేక తనకుతానే ఒక ద్వీపకల్పంగా తయారై, చేసినపనిలో ఇమడలేక, ఏ పనిచేయాలో ఎందుకు చేయాలో అర్థంకాక, జీవితానికి ఏ సార్థకతా, పరమార్థమూ కనబడక, తలెక్కడో తోకెక్కడో తెలియని సంఘంతో ఘర్షణ పడి, బతికినన్నాళ్లూ ఏదో ఒకరకంగా జీవితంలో పాల్గొనవలసిందేనన్నది మరిచిపోయి, పిచ్చివాడిగా ముద్రపడి, బలవన్మరణానికి గురైన ‘అసమర్థుడు’ సీతారామారావు పాత్రను సృష్టించాడు. ధనికులు మనిషిగానే జమకట్టని రిక్షావోడి అంతరంగాన్నీ, శరీరం సహకరించని దశలో ఆదరణ కరువైన ముసలి ఎద్దు వేదననీ తన రాతల్లో చిత్రికపట్టాడు. ప్రత్యేకించి తత్వశాస్త్రాన్ని అభ్యసించకపోయినా, స్వీయ అధ్యయనం ద్వారా ఎందరో తాత్వికుల ఆలోచనాధారను పరిచయం చేశాడు. వృత్తిరీత్యా గోపీచంద్ న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడుగానీ, అందులో నెగ్గలేకపోయాడు. సినిమాల్లోకి ప్రవేశించి ‘రైతుబిడ్డ’, ‘గృహప్రవేశం’ వంటి చిత్రాలకు రచన చేశాడు. ‘లక్ష్మమ్మ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎంతో ప్రతిభ ఉన్నవాడైనప్పటికీ మద్రాసులో నిలదొక్కుకోలేక, ఆర్థికంగా చితికిపోయిన దశలో పాండిచ్చేరి అరవిందాశ్రమం ఒడిలో వాలిపోయాడు. అరవిందుని దర్శనాన్ని విశ్వసించాడు. కొడుకు సాయిచంద్ ఆరోగ్యం బాగాలేనప్పుడు, సాయిబాబాను కూడా నమ్ముకున్నాడు. సామాన్యమానవులు అందుకోలేని కొన్ని స్థాయుల్ని మహర్షులు అందుకోగలిగారనీ, అందువల్ల వారిని ప్రశ్నించకుండా అంగీకరించాలనీ రాశాడు. ‘ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు? ఆగవలసిందేరా తండ్రుల్లారా’ అని సీతారామారావు వ్యాఖ్యానించినట్టుగా... ‘ఎందుకు? అన్న ప్రశ్న నేర్పిన’ నాన్న నుంచి పూర్తిగా ‘విముక్తుడయ్యాడు’. గోపీచంద్ జీవితం, ఆ లెక్కన ఏ సాధారణ మానవుడి జీవితం కూడా ఈ ‘భ్రమణానికి’ మినహాయింపు కాదేమో! పిల్లాడిగా తండ్రినీ, ఇంకా ఆ వయసులో బలమైన ముద్రవేయగలిగేవారినీ అనుకరించి, అనుసరించి... యౌవనంలో ప్రశ్నను ఆయుధంగా మలుచుకుని, నిర్లక్ష్యం చేస్తున్న ప్రపంచాన్ని తమ మాటలతో ఆకర్షించి... చిట్టచివరకు, అంతకుముందు భిన్నంగా నడిచిన పిల్లపాయ నుంచి తప్పుకుని ప్రధాన స్రవంతిలో ఏకమైపోవడంతో జీవితం పూర్తవుతుంది! కాకపోతే, అప్పటికి ‘ప్రగతిశీలం’గా కనబడే విలువల్లోంచే ఎవరినైనా అంచనా కడతాం కాబట్టి, గోపీచంద్ మీద ‘తాత్విక గందరగోళం’గా ముద్రవేయడానికి వీలుపడుతోంది. థియరీని ప్రాక్టికల్‌గానూ అన్వయించుకోవడంలో విఫలమైతే ఏ వాదానికైనా అర్థంలేదు. అందుకే తను రాసిన వాటిని తనే ధిక్కరించుకునే అవసరం గోపీచంద్‌కు వచ్చిందేమో! మానవ స్వభావపు పరిధిలోనే ఆయన రచనాక్రమం సాగిందేమో! చిట్టచివరికి ఆయన తన అసలు స్వభావానికి చేరుకున్నాడేమో! కాకపోతే ఒక కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏమైనా పాఠకులకు బాకీ ఉండిందేమో! 1962లో 52 ఏళ్లకే ఆయన అర్ధాంతరంగా మరణించివుండకపోతే ఆ బాకీ కూడా చెల్లిపోవునేమో! లేదా, ఆయన తిరిగిన ప్రతిమలుపూ అలా చేసిన ప్రకటనేనేమో!