‘జనగామ’ పోరు ఉద్రిక్తం
ఎమ్మెల్యే దిష్టిబొమ్మతో న్యాయవాదుల నిరసన
పోలీసులకు-ఉద్యమకారులకు మధ్య తోపులాట
రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపిన ఆందోళనకారులు
జనగామ : జనగామ జిల్లా కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దిష్టిబొమ్మతో న్యాయవాదులు బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లాయర్లు, జేఏసీ నాయకులకు- పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దిష్టిబొమ్మలను లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్యమకారులు ప్రతిఘటించారు. దిష్టిబొమ్మలకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. కాగా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సీఐలు చెన్నూరి శ్రీనివాస్, కరుణాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు సంతోషం రవీందర్, శ్రీనివాస్ బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఆందోళనకు జేఏసీ మద్దతు..
జనగామ కోర్టు ఆవరణ నుంచి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు దిష్టిబొమ్మతో శవయాత్రగా ఆరీస్టీ చౌరస్తాకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ చెర్మైన్ ఆరుట్ల దశమంతరెడ్డి వారికి మద్దతు పలికారు. ఆర్టీసీ చౌరస్తా సర్కిల్లో జేఏసీ నాయకులు, న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించ గా, పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యమకారులు ప్రతిఘటించడంతో పోలీసులు దిష్టిబొమ్మను ఎక్కడికక్కడ చించివేశారు. దీంతో ఆందోళనకారులు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎం పీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చిత్రపటాలకు చీపుర్లను చూపి, రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉండడంతో ఉద్యమకారులను అరెస్టు చేశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పోలీసుల తీరును తప్పుబట్టడంతో ఆయనను సైతం లాక్కెళ్లి జీపులో ఎక్కించారు. ఆయనతో పాటు డాక్టర్ లక్ష్మినారాయణనాయక్,మేడ శ్రీనివాస్, పిట్టల స త్యం, మంగళ్లపల్లి రాజు, వీరస్వామి, బక్క శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు.