breaking news
Missing Case Investigation
-
23 ఏళ్ల తరువాత ఇంటికి..
సాక్షి, రాజేంద్రనగర్: ఇంటి నుంచి వెళ్లిన 23 సంవత్సరాల అనంతరం ఓ మహిళ కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. ఈ సంఘటన హైదర్షాకోట్ కస్తూర్బా ట్రస్టులో చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళలకు పదేళ్ల చికిత్స తరువాత ఒక్కొక్కటిగా చిన్ననాటి విషయాలు గుర్తుకురావడంతో కస్తూర్బా ట్రస్ట్ నిర్వాహకురాలు పద్మావతి పోలీసుల సహాయంతో కుటుంబసభ్యులను వెతికి షీటీమ్ డీసీపీ అనురాధ సమక్షంలో సోమవారం వారికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ గిరినగర్ ప్రాంతానికి చెందిన యాదమ్మ, సత్తయ్య భార్యభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్తయ్య హెచ్ఏఎల్లో విధులు నిర్వహించగా యాదమ్మ ఇంటి వద్దే దస్తులు ఇస్త్రీ చేసేది. పెద్ద కూతురైన మసినూరి రేణుక(40) తల్లికి చేదోడు వాదోడుగా ఉండేది. వీరి ఇంటి పక్కనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం నివసించేంది. 1995లో రాత్రికి రాత్రే తమిళనాడు కుటుంబం రేణుకను తీసుకొని వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు రేణుక కోసం సంవత్సరాల తరబడి వెతికారు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో రేణుక వయస్సు 17 సంవత్సరాలు 18 ఏళ్లుగా ఆశ్రమాల్లోనే.. 2001లో చెన్నై రైల్వే స్టేషన్లో మతిస్థిమితం లేని రేణుకను అక్కడి పోలీసులు గుర్తించి బనియన్ ఆర్గనైజేషన్ సొసైటీకి అప్పగించారు. అప్పటి నుంచి అక్కడే ఆశ్రమం పొందుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చాను అనే మాట తప్ప మరే ఇతర వివరాలు తెలుపలేదు. దీంతో నిర్వాహకులు 2011లో హైదరాబాద్‌కు వచ్చి వాకబు చేశారు. అనంతరం 2012 జూలై 20న బనియన్ ఆర్గనైజేషన్ వారు హైదర్షాకోట్లోని కస్తూర్బా ట్రస్టు నిర్వాహకులకు రేణుకను అప్పగించారు. ట్రస్టు నిర్వాహకులు చికిత్స అందిస్తూ ఆశ్రయం కల్పించారు. 10 రోజుల క్రితం కోలుకున్న రేణుక తాను ఉండే ప్రాంతం పేరుతో పాటు తండ్రి హెచ్ఏఎల్లో పని చేసేవాడని తనకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని, తల్లి బట్టలు ఇస్త్రీ చేసేదని తెలిపింది. పోలీసుల సాయంతో ఆచూకీ లభ్యం చిన్ననాటి విషయాలన్ని ఒక్కోటీగా చెబుతుండడంతో ట్రస్టు నిర్వహకురాలు పద్మావతి బాలానగర్ పోలీసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లను సంప్రదించారు. స్థానికంగా ఇస్త్రీ బట్టలు చేసే వారి వివరాలు సేకరించింది. గిరినగర్ ప్రాంతంలో 23 ఏళ్ల క్రితం రేణుక తప్పిపోయిందని సమాచారం అందడంతో ట్రస్టు నిర్వహకులు ఆమె సోదరుడు వెంకటేష్‌ను సంప్రదించారు. వెంకటేష్ తన సోదరి పూర్తి వివరాలను ట్రస్టు నిర్వాహకులకు అందించాడు. సోమవారం మధ్యాహ్నం షీటీమ్ ఇన్చార్జి డీసీపీ అనురాధ సమక్షంలో రేణుక తల్లి యాదమ్మ, సోదరుడు వెంకటేష్‌లకు ఆమెను అప్పగించారు. రెండు దశాబ్దాల కన్నీరు పర్యంతమయ్యారు. ట్రస్తు నిర్వాహకులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రేణుక తాను తల్లితో ఇంటికి వెళ్తానని, ట్రస్ట్‌లోని సభ్యులంతా గుర్తుకు వస్తే వచ్చి చూసి వెళ్తానని చెప్పడంతో పోలీసులు ఫార్మాల్టీస్ పూర్తి చేసి రేణుకను తల్లి, సోదరుడితో ఘనంగా సాగనంపారు. -
సిమ్ కార్డే ‘క్లూ’ !
పోస్ట్‌మార్టం * మిస్సింగ్ కేసు విచారణలో వెలుగు చూసిన మర్డర్... * అదృశ్యం అయ్యాడనుకున్న యువకుడు హత్యకు గురయ్యాడు * మృతుని సిమ్‌కార్డు వాడుతూ చిక్కిన హంతకులు * కూతురిని ప్రేమించడం ఇష్టంలేక హత్య చేయించిన తల్లి * పదిరోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు * కటకటాలపాలైన హంతకులు కామారెడ్డి : అశోక్ అనే యువకుడు కామారెడ్డిలో అదృశ్యం అయ్యాడని ఆయన బావ ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అశోక్ హత్యకు గురైనట్టు కనుగొని, నిందితులను అరెస్టు చేశారు. అశోక్ ప్రేమించిన అమ్మాయి తల్లే అశోక్‌ను హత్య చేయించినట్టు తేల్చారు. ఈ కేసును తేల్చడంలో మృతుడి సిమ్‌కార్డే పోలీసులకు ‘క్లూ’గా ఉపయోగపడింది. ఈ కేసులో అసలేం జరిగిందన్న అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. కేసు నమోదు చేసిన పది రోజుల్లో నిందితులందరూ అరెస్టయ్యారు. కామారెడ్డి పట్టణ సీఐ కృష్ణ, ఎస్సై మధుతో పాటు పోలీసు సిబ్బంది ఈ కేసు తేల్చడంలో కృషి చేశారు. అశోక్ అదృశ్యంపై కామారెడ్డి ఠానాలో మిస్సింగ్ కేసు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడుకు చెందిన అశోక్(25) కొన్నేళ్లుగా తల్లితో కలిసి ఆర్మూర్ పట్టణంలో నివసించేవారు. కొంతకాలంగా మేడ్చల్ సమీపంలోని సుగుణ పౌల్ట్రీస్‌లో లైన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత నెల 29న అశోక్ సుగుణ పౌల్ట్రీస్‌లో పనిచేసే మార్కెటింగ్ సూపర్వైజర్ టి.శ్యాంసుందర్‌తో కలిసి ఆయన బైకుపై బయలుదేరి ఉదయం 10.30 గంటలకు కామారెడ్డికి చేరుకున్నాడు. అక్కడ అశోక్ బస్టాండ్ వద్ద దిగి తన ఊరికి బస్సులో వెళ్లాడు. అయితే ఇంటికి వస్తున్నానని చెప్పి ఆరోజు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అశోక్ గురించి ఆరాతీశారు. అశోక్ స్నేహితుడు శ్యాంసుందర్‌ను సంప్రదించగా కామారెడ్డి వరకు తనతోనే వచ్చాడని తెలిపారు. ఈ నెల ఒకటిన అశోక్ బావ గాండ్ల రాజేందర్, అశోక్ కామారెడ్డిలో అదృశ్యం అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ నంబరు ఆధారంగా విచారణ అశోక్‌కు సంబంధించిన 9502136620 నంబరు ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సిమ్‌కార్డును నందిపేట సెల్‌టవర్ పరిధిలో వాడకంలో ఉన్నట్టు ఈ నెల 11న పోలీసులు గుర్తించారు. ఆ సిమ్‌ను నందిపేటకు చెందిన కండెల్లి రాజేందర్ అనే యువకుడు వాడుతున్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించారు. విచారణ అశోక్‌ను హతమార్చినట్టు రాజేందర్ వెల్లడించాడు. దీంతో పట్టణ సీఐ కృష్ణ ఈ కేసుకు సంబంధించి మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి రాజేందర్‌ను విచారించారు. తనతో పాటు ఆకుల గంగాధర్ కలిసి అశోక్‌ను హతమార్చినట్లు వెల్లడించాడు. పథకం ప్రకారం హత్య.... కండెల రాజేందర్ వద్ద అశోక్ చీటి వేశాడు. చీటి డబ్బులు ఇస్తామని రాజేందర్ అశోక్‌ను రమ్మన్నాడు. దీంతో గత నెల 29న అశోక్ నందిపేటకు బయలుదేరాడు. అయితే అప్పటికే పథకం వేసుకున్న కండెల రాజేందర్, ఆకుల గంగాధర్‌లు నందిపేట సమీపంలోని పలుగుగుట్ట వద్ద ఉన్న రాజేందర్ పొలం వద్ద ఉన్నారు. అశోక్ అక్కడికి రాగానే రాజేందర్ మందు తాగమన్నాడు. తాను మద్యం తాగనని అశోక్ చెప్పడంతో కూల్‌డ్రింక్ తెప్పించుకుని తాగారు. అప్పుడే ఆకుల గంగాధర్ అక్కడ దాచి ఉంచిన కట్టెను తీసుకుని అశోక్ తలపై కొట్టగా, రాజేందర్ పారతో బాదాడు. తీవ్రంగా కొట్టిన తరువాత గోనెసంచిలో కుక్కి అంతకుముందు రోజే రాజేందర్ పంట చేనులో తవ్వి ఉంచిన గోతిలో తలకిందులుగా పడేశారు. చనిపోయాడో లేదోనని బండరాయిని పైన వేశారు. తరువాత మట్టికప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అశోక్‌కు సంబంధించిన సిమ్‌కార్డును రాజేందర్ తన ఫోన్లో వేసుకుని వాడసాగాడు. సిమ్‌కార్డు ద్వారా రాజేందర్‌ను పట్టుకున్న పోలీసులు మిస్సింగ్ అయినట్టు భావించి, అశోక్ హత్యకు గురైనట్టు తేల్చారు. అశోక్ ప్రేమించే అమ్మాయి తల్లే హత్య చేయించింది.... ఈ కేసును విచారించిన పోలీసులు హత్యకు కారణాన్ని కనుగొన్నారు. ఆర్మూర్‌లో నివసించే బొడ్డు విజయకు ఒక కూతురు ఉంది. పక్క ఇంట్లో అశోక్ తల్లి నివసించేది. అశోక్‌తల్లి, బొడ్డు విజయలు స్నేహితులయ్యారు. అయితే కొంతకాలంగా అశోక్ బొడ్డు విజయ కూతురిని ప్రేమించసాగాడు. పెళ్లి చేసుకుంటామని కూతురు విజయకు చెప్పింది. కులాంతర వివాహం ఇష్టంలేని విజయ అడ్డు చెప్పింది. అయితే విజయ కూతురితో అశోక్ ప్రేమ వ్యవహారం ముదరడంతో ఎలాగైనా అశోక్‌ను తప్పించాలనుకున్న విజయ తన బంధువైన కండెల రాజేందర్‌తో మాట్లాడింది. అశోక్‌ను హతమారిస్తే రూ. లక్ష ఇస్తానని చెప్పింది. డబ్బుల ఆశతో రాజేందర్ తన స్నేహితుడు ఆకుల గంగాధర్‌తో కలిసి అశోక్‌ను పథకం ప్రకారం హతమార్చారు. గత నెల 11న కండెల రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేయగా, 14న ఆకుల గంగాధర్, బొడ్డు విజయలను అరెస్టు చేసి రిమాండుకు పంపారు.