డబ్బులు ఖాళీ.. జాలి చూపని జబ్బు
ఆర్థికంగా తట్టుకోలేకపోతున్న తల్లిదండ్రులు
చేయూతకోసం పసి హృదయం ఎదురు చూపు
సాక్షి,హైదరాబాద్: ఇది ఓ పేదింటి బాలిక వేదన. సాయమందించే చేతులకోసం బేలగా చూస్తున్న దైన్యం.పెదవిపై కనిపిస్తున్న ఆ నవ్వుల వెనుక కష్టాన్ని దాచుకున్న దీనత. ఆటపాటలతో కన్నవారిని మురిపించాల్సిన ఆ చిట్టితల్లి అమ్మా,నాన్నల భుజాలపై పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతోంది. పాపను దక్కించుకునేందుకు తల్లిదండ్రులు శక్తికి మించి తపిస్తున్నారు. ఆదుకునే నేస్తాలకోసం ఆశగా చూస్తున్నారు. పేదరికంలో ఉన్న తమకు ఈ పరీక్షలేమిటీ స్వామీ అని కనిపించిన దేవుళ్లందరికీ కన్నీటితో వారు ప్రశ్నిస్తున్నారు. ఆసిఫ్ నగర్‌కు చెందిన రవితేజ, సరిత దంపతులకు రిష్వితేజ్(5) అనే బాబు, రితీష తేజ్(3)అనే పాప ఉన్నారు. రవితేజ ఓ ప్రయివేట్ కంపెనీలో చిరుద్యోగి. ఆ దంపతులకు కుమార్తె పుట్టిందన్న ఆనందం ఏడాది పాటే నిలచింది.
ఆ తర్వాత రితీష ఆరోగ్యంలో మార్పులు గమనించి రోహన్ ఆస్పత్రిలో చూపించారు.అక్కడి వైద్యుల సూచన మేరకు వివిధ రకాల వైద్య పరీక్షల కోసం రెయిన్బో, అపోలో, బసవ తారకం, కిమ్స్, ఓమెగాతో పాటు సిటీలోని ప్రధాన ఆస్పత్రుల్లో చూపించారు. దీనికోసం తమ వద్ద దాచుకొన్న రూ.లక్షలాది ఖర్చులు చేశారు. చివరికి వైద్యులు బెంగళూరు నారాయణ హృదయాలయకు తీసుకెళ్లమన్నారు. అక్కడి పరీక్షలు చేసిన వైద్యులు రితీష తేజ్(3)కి జువెనైల్ మైలోమోనోసెటిక్ లుకేమియ( అదో రకమైన బ్లడ్ క్యాన్సర్) అని నిర్థారించారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని సూచించారు. అందుకు రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందనీ డాక్టర్లు చెప్పారు. ఈ మాటలు విన్న రవితేజ దంపతులకు నోటమాట రావడం లేదు.
ఏడాదికి పైగా పాప వైద్యం కోసం ఖర్చులు చేయడంతో వారు రిక్త హస్తాలతో మిగిలారు. మరో వైపు ఇటీవలే రవితేజ తండ్రి మరణం వారిని మరింత బాధల్లోకి నెట్టింది. దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆదుకునే దాతలు తమ పాపకు ప్రాణం పోయాలని అర్థిస్తున్నారు.తమ చిట్టితల్లిని బతికించుకోవాలని తాపత్రయపడుతున్నారు. సాయం చేయాలనుకొన్నవారు తన సెల్ నెంబర్ 9912220567 కు ఫోన్ చేయాలని కోరారు. తన బ్యాంక్ అకౌంట్ నె ంబర్ 30143989654, ఎస్బీఐ, న్యూమల్లే పల్లి బ్రాంచి, విజయనగర్ కాలనీ అని, ఐసీఐసీఐ బ్యాంక్, మెహిదీపట్నం బ్రాంచ్ అకౌంట్ నెంబర్ 024501004709 అని చెప్పారు.