breaking news
Mid-Day Meal Scheme
-
మధ్యాహ్నం.. అధ్వానం!
మధ్యాహ్న భోజనం ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తున్నాయి. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచారు. కానీ, ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ 1 నుంచి ఐదో తరగతి (ప్రైమరీ) వరకు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.97 చొప్పున.. 6 నుంచి 8 తరగతులవారికి రూ.7.45 చొప్పున, 9, 10 తరగతులవారికి రూ.9.45 చొప్పున ఇస్తున్నారు. ఈ కేటాయింపులు పెంచాలి. 1–5 తరగతులకు 55 శాతం, 6–8 తరగతులకు 58 శాతం, 9–10 తరగతుల వారికి 60 శాతం చొప్పున నిధులు పెంచాలి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా ఉందని విద్యా కమిషన్ అభిప్రాయపడింది. చాలీచాలని నిధులతో ఈ పథకాన్ని సక్రమంగా నిర్వహించడం అసాధ్యమని పేర్కొంది. విద్యార్థులకు పోషకాహారం అందేది ఎలాగని ఆందోళన వ్యక్తం చేసింది. వంట ఖర్చులనూ సక్రమంగా చెల్లించని పరిస్థితిని ఎత్తిచూపింది. అప్పులు చేసి వండి పెడుతున్నా, ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తేల్చి చెప్పింది. వీటన్నింటినీ పరిశీలిస్తే మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత ఆశించడం కష్టమనేనని పేర్కొంది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థత పాలవ్వడం, పలుచోట్ల తీవ్ర అనారోగ్యానికి గురవడం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్ర విద్యా కమి షన్ పరిశీలన జరిపింది. మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై కొన్ని సిఫార్సులతో ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. వందలాది స్కూళ్లను పరిశీలించి... రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్ వాడీ కేంద్రాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జోత్స్న శివారెడ్డి సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యానికి సంబంధించిన లోటుపాట్లను క్షుణ్నంగా పరిశీలించింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ‘మధ్యాహ్న భోజన పథకం–ప్రభుత్వ విద్య సంస్థల్లో ఆహార నాణ్యత, భద్రత’ పేరుతో నివేదిక అందజేసింది. అందులో అనేక అంశాలను ప్రస్తావించింది. ఇలాగైతే పౌష్టికాహారం అందడం కష్టం రాష్ట్రంలో 26,519 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 20.36 లక్షల మందికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం వారికి వారానికి 3 కోడిగుడ్లు ఇవ్వాలి. ఒక్కో గుడ్డు కోసం ప్రభుత్వం ఇస్తున్నది రూ.5 మాత్రమే. మార్కెట్లో గుడ్డు ధర రూ.7 వరకు ఉంది. దీనితో స్కూళ్లలో చాలా చోట్ల వారానికి ఒకటి, రెండు గుడ్లనే అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందడం కష్టమని కమిషన్ అభిప్రాయపడింది. భోజనం వండి, వడ్డించే మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇప్పటికీ రూ.116 కోట్లు బకాయి ఉంది. తాము అప్పుచేసి వండి పెడుతుంటే బిల్లులు ఆలస్యంగా వస్తున్నాయని.. తాము వడ్డీ భారం మోయాల్సి వస్తోందని అనేక చోట్ల స్వయం సంఘాల మహిళలు వాపోతున్నారు. ఇక చాలీచాలని నిధులతో నాణ్యమైన కూరగాయలు తీసుకురాలేక పోవడం, నిల్వ చేసేందుకు తగిన మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోందని విద్యా కమిషన్ పేర్కొంది. దీనితో ఆహారం కల్తీ అవడం, నాణ్యత లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని స్పష్టం చేసింది. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి.. మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. వీటిని తక్షణమే అమలు చేయాలని కోరింది. అలా చేస్తేనే భోజనం నాణ్యత పెరుగుతుందని, విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి దూరమవుతుందని తెలిపింది. – మహిళా సంఘాలకు ఎప్పుడు బిల్లులు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. విధి లేని పరిస్థితుల్లో అప్పులు తెచ్చి వండి పెడుతున్నామనేది మహిళా సంఘాల ఆందోళన. ఈ పరిస్థితిని మార్చాలి. గ్రీన్ చానల్ ద్వారా వారం వారం బిల్లులు చెల్లించాలి. – గురుకులాల్లో అన్నిరకాల పోషకాలు అందిస్తున్నారు. అక్కడ నిధులు పెంచారు. కానీ ప్రభుత్వ స్కూళ్లలో ఇస్తున్న మెనూ విద్యార్థులు తినేలా లేదని అనేక మంది ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఒకే తరహా మెనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అందించాలి. – మధ్యాహ్న భోజనం అమలుకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉండాలి. నిత్యావసరాలు, కూరగాయలు సేకరించడం, వాటిని నిల్వ చేయడం, శుభ్రం చేయడం, వండటం, వృధాను పారేసేందుకు ప్రత్యేక నిబంధనలు ఉండాలి. దీని అమలుకు యంత్రాంగం చర్యలు చేపట్టాలి. – రాష్ట్రంలో నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర సామగ్రి సేకరించడంలో ఐదు సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. దీనికి అనేక రకాల నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. టెండర్లు వేయడం, వాటిని ఖరారు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతుల వల్ల ఆలస్యమవుతోంది. ఈ బాధ్యతను ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించాలి. దీనివల్ల ఒకే సంస్థ ఈ బాధ్యతను తీసుకుని, నాణ్యత పెంచుతుంది. ప్రభుత్వం దృష్టిపెడుతుందని ఆశిస్తున్నాం.. రాష్ట్రంలోని వందల స్కూళ్లలో మధ్యాహ్న భోజన పరిస్థితిని పరిశీలించాం. అన్ని వర్గాలవారితో మాట్లాడాం. అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. నాణ్యమైన భోజనం అందించే దిశగా ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి నివేదిక అందజేశాం. ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాం. – ఆకునూరు మురళి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ -
ఆకలేస్తోంది..
ఆత్మకూరు : తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చినందున తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణ తమకప్పగించాలంటూ తోపుదుర్తి గ్రామంలో తెలుగుతమ్ముళ్లు దౌర్జన్యానికి దిగారు. మెనూ ప్రకారం వంట చేస్తూ వస్తున్న తాము ఎందుకు తప్పుకోవాలని నిర్వాహకురాలు ప్రశ్నించినందుకు వంటగది, సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్‌కు తాళాలు వేసుకుని వెళ్లారు. టీడీపీ నేతల నిర్వాకం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. లక్ష్మినరసింహ ఏజెన్సీ పేరిట అనురాధ అనే మహిళ ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితురాలైన ఈమె ఇప్పటి వరకూ మెనూ ప్రకారం వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మధ్యాహ్న భోజనం ఏజెన్సీపై కన్నేశారు. ఈ మేరకు ఈ నెల మూడో తేదీన ఉన్నతపాఠశాలకు వెళ్లి ‘ఇకపై మీరు వంట చేయక్కర్లేదు. మేమే మధ్యాహ్న భోజనం నిర్వహిస్తాం. ఇందుకు సమ్మతం తెలపండి’ అని ఏజెన్సీ నిర్వాహకురాలు అనురాధకు హుకుం జారీ చేశారు. తహశీల్దార్ నుంచి అనుమతి పొంది ఉంటే మీరే వంట చేయండని ఆమె తెలపగా... టీడీపీ కార్యకర్తలు వినకుండా వంట చేస్తున్న సమయంలోనే పొయ్యిలోకి నీరు పోసి ఆర్పేశారు. అంతటితో ఆగక వంటగది, బియ్యం, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచిన స్టోర్ రూమ్‌కు తాళాలు వేసి వెంట తీసుకెళ్లారు. జరిగిన సంఘటనపై అనురాధ తహశీల్దార్‌కు ఫోన్లో సమాచారమందించారు. నాలుగో తేదీన తాళం పగులగొట్టి..వంట చేస్తామని అనురాధ బంధువులు ప్రధానోపాధ్యాయుడిని కోరగా.. తనకు ఆ అధికారాలు లేవన్నారు. దీంతో అదేరోజు సాయంత్రం వారు తహశీల్దార్‌కు, పోలీస్‌స్టేషన్‌కు అర్జీలు సమర్పించారు. ఐదో తేదీన ఉదయం టీడీపీ కార్యకర్తలు తాము వంట చేస్తామని రాగా... తహశీల్దార్ నుంచి ఉత్తర్వులు తీసుకొస్తే వంట చేయడానికి తమకెటువంటి అభ్యంతరమూ లేదని హెచ్ఎం స్పష్టం చేశారు. ఏజెన్సీ నిర్వహణ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక.. ఆకలితో పస్తులు ఉండలేక విద్యార్థులు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ఐదు రోజులుగా తాళం తీయకపోవడంతో కూరగాయలు పాడైపోయాయి. అధికారులే సమస్య పరిష్కరించాలి మధ్యాహ్న భోజనం లేక విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై తహశీల్దార్‌కి అర్జీ ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్మానిటరింగ్ కమిటీ చైర్మన్, సభ్యులతో సమావేశమై తహశీల్దార్, మండల అభివృద్ది అధికారి, పోలీసు అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు కలిసి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణ సమస్యను పరిష్కరించాలి. - రమేష్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, తోపుదుర్తి