breaking news
merged mandals
-
ఏపీ ఓటర్లే.. అప్పుడు తెలంగాణలో ఓటేశారు
ఏపీలో విలీనమైన కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఎటపాక, వేలేరుపాడు, కుకునూరు, భద్రాచలం పట్టణం మినహాయించి.. మండలంలోని అన్ని గ్రామాల ఓటర్లు 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఓటేశారు. వేలేరుపాడు, కుకునూరు మండలాల ఓటర్లు అశ్వారావుపేట, మిగిలిన మండలాల వారు భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించారు. 2014 ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరిగింది. అయితే, ఆ మండలాలను ఎన్నికల అనంతరం ఏపీలో విలీనం చేశారు. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఎటపాక మండలాలను తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం (ఎస్టీ) నియోజకవర్గంలో కలపగా.. వేలేరుపాడు, కుకునూరు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం (ఎస్టీ) నియోజకవర్గంలో కలిపారు. ఆ మేరకు 2014 జూలైలో ఉత్తర్వులు వెలువడినప్పటికీ.. రాష్ట్రపతి ఆమోద ముద్రతో 2015 ఏప్రిల్ 23న కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ఆయా మండలాలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగంగానే గుర్తిస్తూ వచ్చింది. చివరకు, తెలంగాణ ఎన్నికలకు ముందు అంటే.. 2018 సెప్టెంబర్ 22న ఆయా మండలాలు రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో కలుపుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఈవో జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఆ వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచనలతో ఆయా మండలాలను ఏపీలోని రెండు నియోజకవర్గాల్లో కలుపుతూ 2008 నాటి నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్‌కు సవరణ చేపడుతూ సీఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే సమయంలో ఆయా గ్రామాలకు చెందిన ఓటర్ల ఓటు హక్కుపై తలెత్తిన సాంకేతిక సమస్యలు తొలగిపోయాయి. విలీన గ్రామాల ఓటర్లు తమ హక్కును ఇకనుంచి ఏపీలోనే వినియోగించుకుంటారు. – ఎలక్షన్ డెస్క్ -
1,2 తేదీల్లో గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 1, 2 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన విలీన మండలాల్లో పర్యటించనున్నారని పార్టీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సోమవారమిక్కడ తెలిపారు. ముందుగా వైఎస్ జనగ్ జూలై 1న పశ్చిమగోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటిస్తారు. పోలవరం ముంపు ప్రాంతాల్లోని ప్రజలతో సమావేశమై ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వైఎస్ జగన్ రాత్రికి భద్రాచలం చేరుకొంటారు. జూలై 2న వైఎస్ జగన్ ఎటపాక మండలం మీదుగా కూనవరం చేరుకొని అక్కడి నుంచి రేఖపల్లిలో నిర్వాసిత రైతులతో మాట్లాడతారు. అనంతరం రేఖపల్లి చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల మీద ఎమ్మెల్యే రాజేశ్వరి వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రేఖపల్లిలో సమావేశం నిర్వహించారు.