breaking news
Matching Dress
-
ఇట్టే కలిసిపోయారు!!
బుధవారం ఎవరి పనిమీద వాళ్లు బైటికొచ్చారు మేఘన్ మార్కెల్, కేట్ మిడిల్టన్. మేఘన్.. ప్రిన్స్ హ్యారీ భార్య. కేట్.. ప్రిన్స్ విలియమ్స్ భార్య. ఇద్దరూ తోడికోడళ్లు. అయితే ఒకరికొకరు తోడుగా ఏమీ వాళ్లు బయటికి రాలేదు. ఎవరికి వారుగా వెళ్లిపోయారు. మేఘన్ వెళ్లింది ఒక వంటల ప్రోగ్రామ్‌కి చీఫ్ గెస్ట్‌గా. కేట్ Ðð ళ్లింది.. లండన్ యూనివర్సిటీ కాలేజ్‌లోని న్యూరోసైన్స్ యూనిట్‌కి. లండన్‌లో ‘హబ్’ అనే ముస్లిం కమ్యూనిటీ ఉంది. వాళ్లు చేసే వంటలకు పబ్లిసిటీ ఇచ్చేందుకు వెళ్లారు మేఘన్. న్యూరోసైన్స్ యూనిట్లో.. పిల్లల బ్రెయిన్ వికసించే పరిణామక్రమంలో లెక్చర్ వినేందుకు వెళ్లారు కేట్. ఇక్కడి వరకు విశేషం ఏమీ లేదు. అనుకోకుండా ఇద్దరూ ఒకే డ్రెస్‌లో లండన్ వీధుల్లోకి వచ్చారు. అదీ విశేషం. మేఘన్ మెరూన్ డ్రెస్‌తో వచ్చారు. సేమ్ అలాంటిదే వేస్కుని, బ్లాక్ కాంబినేషన్‌తో కేట్ ప్రత్యక్షం అయ్యారు. డ్రెస్ మాత్రమే ‘సేమ్ పించ్’ కాదు. ‘లో పోనీ టైల్’ కూడా సేమ్. ప్లాన్ చేసుకునే వచ్చారా ఏంటి? పెద్ద నవ్వు. ఇద్దరిదీ! దానర్థం ‘నో ప్లానింగ్’ అని. కేట్ డ్రెస్ ‘పాల్కా’ బ్రాండ్. ప్యారిస్ నుంచి ఇంపోర్ట్ అయింది. 2012 నుంచి సేమ్ డ్రెస్‌ను రిపీట్ చేస్తున్నారు కేట్. మేఘన్ వేసుకున్న బ్రాండ్ ‘క్లబ్ మొనాకో’. యు.ఎస్. కంపెనీ. కొంచెం ఖరీదైంది. చిరునవ్వు ఇద్దరు అపరిచితులను కలుపుతుంది. సేమ్ పించ్ రెండు చిరునవ్వులను వెలిగిస్తుంది. ఒకే విధమైన డ్రెస్ వేసుకొచ్చిన ఇద్దరు నార్మల్ పర్సన్స్ ఆ పూటకి సెలబ్రిటీలు! ఒకే డ్రెస్‌లో కనిపించిన ఇద్దరు సెలబ్రిటీలు.. ఆ పూటకు సామాన్యులు. ఆ సామాన్యతే ఈ ఇద్దరు కోడళ్లకు ఎప్పటికప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఇస్తోంది. సేమ్ పించ్ -
సమయం కంటే స్త్రీ విలువైనది..!
ఒక సినిమా చూడాలంటే మగాడికి మూడు గంటలు పడుతుంది. ఒక స్త్రీ సినిమా చూడాలనుకుంటే ఐదు గంటలు కావాలి. ఇదేం లెక్క ?... మగాడి లెక్క! ఆమె సినిమాకు రావాలంటే మొదట సినిమా మూడ్‌లోకి రావాలి. (నిజానికి సినిమా అన్నాం, కానీ అన్ని విషయాల్లోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది). ఆ తర్వాత తయారవడానికి మానసికంగా సిద్ధపడాలి. మ్యాచింగ్ డ్రెస్ తీయాలి. ఇక ఈ మ్యాచింగ్ జాబితా... గాజులు, బొట్టు, క్లిప్స్, చెప్పులు... ఇలా సుదీర్ఘంగా ఉంటుంది. ఏది వేసుకోవాలో నిర్ణయించుకోవడానికి ఒక సెషన్ నడుస్తుంది. మంచం మీద ఓ నాలుగైదు డ్రెస్సులు పరిచి... ఉదయం దువ్విన తలను చెరపాలి... దువ్వుతూ ఉండగా మధ్యలో ఏదో నల్లగా కొంచెం కనిపిస్తే అది ‘పేను’ కాకపోయినా అవునేమో అనే భ్రమతో, ఆందోళనతో అపుడే పేలు తీసుకోవాలి. జడ వేసి, డ్రెస్ చేసి అద్దానికి పరీక్షలు పెట్టాలి. మళ్లీ మొగుడికి పరీక్షలు పెట్టాలి. బాగుందంటే ఒప్పుకోరు/ఊరుకోరు. ఏదో ఒక చిన్న మార్పు చెబుదామా అంటే ఫస్ట్ షో సినిమాకు తీసుకున్న టిక్కెట్లు సెకండ్ షోకు పనికిరావంటాడు థియేటర్ వాడు. అది గుర్తొచ్చి బాగుందని చెప్పాలని నిర్ణయిస్తే... ‘ఊరికే లేటవుతుందని అలా చెబుతున్నారు కదా! నిజం చెప్పండ’ని ఆమె పదే పదే ప్రశ్నిస్తే... ‘నిజంగా బాగుంది’ అంటాం. ఆమెలో ఇంకా ఎక్కడో మిగిలి ఉన్న శంకను పోగొట్టేందుకు ‘సాధారణంగా మ్యాచింగ్ వేస్తేనే నీకు బాగుంటుందనుకున్నా, కానీ మ్యాచింగ్ లేకపోయినా కాంట్రాస్ట్ కూడా నీకు బాగా నప్పింది తెలుసా’ అని మనసును కష్టపెట్టి, క్రియేటివిటీని ప్రదర్శించాల్సి వస్తుంది. డ్రెస్సింగ్ తంతు పూర్తయ్యాక అప్పుడు మళ్లీ ఓ సారి లోనికెళ్లి మేడమ్ మేకప్ మొదలుపెడితే అది పూర్తవడానికి ఇంకొంచెం సమయం... అరగంటే లెండి! జీవితంలో పనిచేయడమే కాదు, టైంపాస్ చేయడం కూడా కష్టమే అనే విషయం కేవలం ఆడవారి వల్లే అర్థమవుతుంది. ఒక థియరీ ఏంటంటే... మగాళ్ల కంటే స్త్రీలు విజ్ఞులు. సమయం చాలా విలువైనది అని మనం అనుకుంటే సమయం కంటే మా విలువే ఎక్కువన్నది వారి ఆత్మవిశ్వాసం. అందుకే తమ కోసం సమయాన్ని అలా నీళ్లలా ఖర్చు చేస్తారు. ‘ప్రతి ఒక్క మగాడూ ఆడోళ్లు గంటలు గంటలు రెడీ అవుతారని ఊరికే ఆడిపోసుకుంటారు... కానీ వారికి కావాల్సింది రెడీ కావడమే. పురుషుల్లో అత్యధికులు స్త్రీలు సింగారించుకుంటే చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు’ అని స్త్రీ జాతి ఆక్షేపిస్తోంది. ‘మగాడిలా లాగు, చొక్కా వేసుకుని రెడీ అవడానికి మాకూ పది నిమిషాలు చాలు బాబూ... కానీ ఏదో మిమ్మల్ని మెప్పిద్దాం అంటే మళ్లీ మాపైనే విసుర్లా’ అని స్త్రీ జాతి ఫీలవుతోంది.