breaking news
match banned
-
కెప్టెన్లు జర భద్రం...లేదంటే భారీ మూల్యం
ముంబై: ఐపీఎల్... ఆటగాళ్లపై కోట్లు కురిపిస్తుంది. స్టేడియంలో మెరుపులు మెరిపిస్తుంది. అభిమానుల్ని మురిపిస్తుంది. ప్రేక్షకుల్ని యేటికేడు అలరిస్తూనే ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ సీజన్లో కెప్టెన్లకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఇక ముందులా తీరిగ్గా బౌలింగ్ చేస్తే కుదరదు. నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లను కచ్చితంగా పూర్తిచేయాలి. లేదంటే భారీ మూల్యమే కాదు... డగౌట్‌కు (నిషేధం) పరిమితమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టత ఇచ్చింది. ఐపీఎల్ నియమావళిని అనుసరించి మందకొడిగా (స్లో ఓవర్ రేట్) బౌలింగ్ చేస్తే మొదటిసారి ఆ జట్టు కెప్టెన్‌పై రూ. 12 లక్షలు జరిమానా వేస్తారు. రెండోమారు పునరావృతమైతే రూ. 24 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే తుదిజట్టులోని ప్రతి ఆటగాడిపై కూడా రూ. 6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా పడుతుంది. ఒకే సీజన్లో మూడో సారి కూడా స్లో ఓవర్‌రేట్ నమోదు చేస్తే రూ. 30 లక్షలు జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్ నిషేధం కూడా విధిస్తారు. అలాగే తుది జట్టు ఆటగాళ్లపై రూ. 12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా విధిస్తారు. -
అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని..
ఔట్‌డోర్ గేమ్స్‌లో అమ్మాయిల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు.. ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత ఉపద్రవం తలెత్తుతుందేమోనని భయపడి ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఉపద్రవమంటే తుఫానో, సునామీనో కాదు.. ఆ మ్యాచ్‌లో మహిళా క్రీడాకారిణుల కోసం సిద్ధం చేసిన దుస్తులు బిగుతుగా ఉండటం! తాలిబన్ పాలనను, ఐఎస్ దుశ్యర్యల్ని తలపించేలా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మల్దా జిల్లాలోని చండీపూర్‌లో స్థానిక క్లబ్ గోల్డెన్ జూబ్లీ(50 ఏళ్ల) వేడుకల్లో భాగంగా కోల్‌కతా, ఉత్తర బెంగాల్ మహిళా ఫుట్‌బాల్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు. తీరా మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు అమ్మాయిల దుస్తులు బిగుతుగా ఉన్నాయని, వాటిని ధరించి ఆడితే పురుషుల్ని రెచ్చగొట్టినట్టవుతుందని నిర్వాహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. 'నిర్వాహకుల తీరు ఆక్షేపణీయం. వాళ్లని అలాగే వదిలేస్తే సానియా మీర్జా కాళ్ల నిండుగా ప్యాంటు ధరించి టెన్నిస్ ఆడాలని డిమాండ్ చేసేలా ఉన్నారు' అని భారత ఫుట్‌బాల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రీడాకారుడొకరు వ్యాఖ్యానించారు. కొన్ని రాజకీయ పక్షాలు సైతం దీనిపై నిరసనను తెలపగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సావిత్రి మిశ్రా మాత్రం దుస్తుల కారణంగా మ్యాచ్ రద్దును సమర్థించారు. మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందునే మ్యాచ్ నిలిచిపోయిందని బ్లాక్ డెవలప్మెట్ అధికారులు చెప్పారు. మతపరంగా తనపై చర్యలు తీసుకుంటామని కొందరు వ్యక్తులు హెచ్చరించడంవల్లే మ్యాచ్‌ను రద్దుచేసినట్లు ప్రధాన నిర్వాహకుడు రేజా రజీర్ పేర్కొన్నారు.