ధర్నాల జోరు.. నినాదాల హోరు
నిరసనలు.. దీక్షలు.. ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వరుస ధర్నాలు..నినాదాలతో హోరెత్తింది. వేతనాలను పాతపద్ధతిలో ఇప్పించి నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని వీఆర్ఏలు... సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని అర్బన్ హెల్త్‌సెంటర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు... భూఆక్రమణ నుంచి రక్షించాలని ఆదివాసీ సంఘం.. తమ కులాన్ని గుర్తించాలని ఓడ్ కులస్తులు ఆందోళనలు చేపట్టి కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు వినతిపత్రం సమర్పించారు.
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించండి
తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీఆర్ఏలు సర్కస్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రెండుగంటల పాటు ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు మార్క రామన్న, చెలిమల రాజయ్య మాట్లాడుతూ వేతన బడ్జెట్ కంట్రోల్ ఎత్తివేసి 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసవేతనం రూ.15 వేలు, పర్సంటేజీ డీఏ ఇవ్వాలన్నారు. వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, తెలంగాణలోని వాటాబందీ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.
ఓడ్ కులానికి గుర్తింపునివ్వాలి
ఓడ్ కులానికి గుర్తింపునివ్వాలని కోరుతూ తెలంగాణ ఓడ్ కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 300 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. వృత్తిపరంగా గాడుదులపై మొరం, మట్టి, ఇసుక పనులను చేస్తూ శ్రమజీవులుగా ఉన్నారని పేర్కొన్నారు. చదువుల నిమిత్తం కులధ్రువీకరణ పత్రం తప్పనిసరికావడంతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తెలంగాణ మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఆయా ప్రభుత్వాలు గుర్తించాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఓడ్ కులాన్ని సంచార తెగలుగా గుర్తించాలని కోరారు. ధర్నాలో మోతె విఠల్, పవర్ ప్రకాశ్, గణేశ్, ధరావతి విజయ, సరిత, సావిత్రి, సాలూకే శారద పాల్గొన్నారు.
ఆదివాసీలపై చిన్నచూపు
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ , దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదివాసీలకు అందని ద్రాక్షలా మారాయని పేర్కొన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్నారు. ధర్మపురి మండలం నక్కలపేట, ధర్మారం మండల కేంద్రం, సారంగాపూర్ మండలం చీర్పూర్ గ్రామాలకు సంబంధించిన భూములు, అక్రమకేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని, సమగ్ర విచారణజరిపి న్యాయం చేయాలని కోరారు.