breaking news
Marshall Islands
-
ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: ఏడెన్ సింధుశాఖ సమీపంలో మార్షల్ ఐల్యాండ్‌కు చెందిన వాణిజ్య నౌకపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటుచేసుకుంది. బాధిత నౌక ఎంవీ గెంకో పికార్డీ నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరమే స్పందించింది. హిందూ మహా సముద్రంలోని ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని నౌకలో మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంవీ గెంకో పికార్డీ నుంచి బుధవారం అర్ధరాత్రి 11.11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందంతో బయలుదేరింది. 12.30 గంటలకల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవీ గెంకో పికార్డీలో క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించిందని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవీ లిలా నార్ఫోక్ అనే లైబీరియా నౌకను నేవీ సిబ్బంది హైజాకర్ల నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవీ చెక్ ప్లుటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. -
మహా సముద్రంలో 438 రోజులు..!
‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా చూసినవారికి సముద్రంలో తప్పిపోయినవారి కష్టాలు అర్థమవుతాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, కప్పుకోవడానికి ఒంటినిండా గుడ్డలు లేక.. చావుకు రోజులు లెక్కబెట్టుకుంటూ బతుకుతారు వీరు. చివరకు ఏదో ఒకరోజు వీరికి మోక్షం లభిస్తుంది. మరణించినవారు సముద్రగర్భంలో కలిసిపోతారు. బతికిబట్టకట్టినవారు చరిత్రలో నిలిచిపోతారు. అలా నిలిచి గెలిచినవాడే జోస్ సాల్వడార్ అల్వరెంజా..! 2012 నవంబర్ 17.. తను ఎంతగానో నమ్ముకున్న బోటును ప్రేమగా ముద్దాడి సముద్రంలోకి బయలుదేరాడు అల్వరెంజా. సాల్వడార్‌కు చెందిన ఈ జాలరి.. అప్పటికి 20 ఏళ్ల క్రితమే మెక్సికోకు వలసవచ్చాడు. అక్కడే చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే చియాపాస్ తీరం నుంచి చేపల వేటకు సాగరంపైకి దూకాడు. అయితే, తోడుగా అలవాటైన మిత్రుడు ‘రే పెరేజ్’ వెంట రాలేదు. వేరే ఏదో పనిమీద అతడు బయటకు వెళ్లడంతో ఆరోజు అల్వరెంజా బోటెక్కాడు 23 ఏళ్ల కార్దోబా. చాలా చురుకైన అథ్లెట్, ఆ ఊరి ఫుట్‌బాల్ జట్టులో మొనగాడు. కానీ, చేపల వేట మాత్రం కార్దోబాకు పూర్తిగా కొత్త. అంతకు ముందెప్పుడూ ఈ కుర్రాడితో కలిసి పనిచేసిన అనుభవం లేకపోవడంతో మొదట్లో అల్వరెంజా పెద్దగా మాట్లాడేవాడు కాదు. తర్వాత కూడా వీరిద్దరి మధ్యా పెద్దగా మాటలు సాగలేదు. బోట్లోని జీపీఎస్, సగం ఛార్జింగ్ ఉన్న మొబైల్ ఫోన్, పాతకాలం రేడియో, వైర్లెస్.. వీటితో పాటు కొద్దిపాటి చేపలవేటకు అవసరమైన పరికరాలతో కొద్ది గంటలు బాగానే వేటాడసాగారు. దాదాపు వేట పూర్తి కావస్తోందన్న సమయంలో అతి భయంకరమైన తుపాను వారిని అతలాకుతలం చేసింది. ఉవ్వెత్తున లేచిపడుతోన్న కెరటాల ధాటికి జీపీఎస్ పరికరం పాడైంది. మొబైల్, వైర్‌లెస్‌లు కూడా దాదాపుగా పనిచేయడం ఆగిపోయాయి. ఉన్నట్టుండి బోటు మోటారు చెడిపోయింది. ఈ క్రమంలో చివరగా తమను కాపాడాలంటూ తీరంలోని తమ యజమానికి అల్వరెంజో చేసిన విన్నపాలు వినిపించకుండాపోయాయి. ఇక, విధిలేని పరిస్థితుల్లో ఇద్దరూ బోటులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఐదురోజుల పాటు తుపాను వారిని భయపెట్టింది. తర్వాత చూసుకునేసరికి.. వారు మెక్సికో తీరానికి ఏమాత్రమూ దగ్గరగా లేరు. ఎక్కడో నడిసంద్రంలో కొట్టుకుపోతున్నారు. గమ్యం తెలీని ప్రయాణమే అయింది వారి పరిస్థితి. సముద్రపు వేట మీద అనుభవం లేని కార్దోబాకు తాము తిరిగి తీరానికి చేరుతామనే నమ్మకం పోయింది. ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. దీనికి తోడు వాంతులు చేసుకుంటూ నీరసంగా తయారయ్యాడు. అతడి పరిస్థితి చూసిన అల్వరెంజా చేపలు పట్టి అతడికి ఆహారంగా ఇవ్వాలనుకున్నాడు. కానీ, దురదృష్టమేంటంటే.. చేపల వేటకు అవసరమైన పరికరాలన్నీ తుపానులో కొట్టుకుపోయాయి. దీంతో సాధారణ చేతులతోనే వేటాడటం మొదలుపెట్టాడు అల్వరెంజా. చేపలు, తాబేళ్లు పట్టుకుని వాటి మాంసాన్ని కార్దోబాకు తినిపించాడు. అయితే, ఈ మాంసం అతడి శరీరానికి అంతగా నప్పలేదు. రోజురోజుకీ నీరసంగా తయారయ్యాడు. సముద్ర ప్రయాణంలో బతికిబట్టకట్టాలంటే ఉత్సాహంగా ఉండాలని అల్వరెంజా ఎంత చెప్పినా కార్దోబా తేరుకోలేకపోయాడు. ఎప్పుడూ ఇంటిపైనే ధ్యాసతో మరింత నీరసించాడు. అలా రెండు నెలలు గడిచాయి. ఈ కాలంలో చేపలు, సముద్రపు పక్షులు, తాబేళ్లను తింటూ కాలం గడిపేవారు వీరిద్దరూ. మంచినీరు దొరక్కపోవడంతో డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు మూత్రాన్ని తాగి బతికేవారు. కానీ, ఒకరోజు ఉదయాన లేచి చూసేసరికి కార్దోబా మరణించాడు. అతడి శవాన్ని పక్కనే పెట్టుకుని ఆరు రోజుల పాటు పిచ్చివాడిలా మాట్లాడుకునేవాడు అల్వరెంజా. చివరకు ఓ రోజు సముద్రంలో కార్దొబాను పడేయ్యక తప్పలేదు. అలా పద్నాలుగు నెలలు సముద్రంలోనే గడిపిన తర్వాత చిక్కి శల్యమయ్యాడు అల్వరెంజా. చివరకు అదృష్టం బాగుండి.. 2014 జనవరి 30న మార్షల్ ఐల్యాండ్స్ అనే చిన్న దీవిలో నగ్నంగా తేలాడు. వెంటనే స్థానికులు చికిత్స అందించడంతో బతికి బట్టకట్టాడు. 438 రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా గడిపిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. -
ఐరాస అత్యున్నత కోర్టులో భారత్‌కు ఊరట!
-
ఐరాస అత్యున్నత కోర్టులో భారత్‌కు ఊరట!
ప్రపంచంలో ఏ మూలకు ఉంటుందో కూడా ఎవరికీ సరిగ్గా తెలియని చిన్న దేశం మార్షల్ ఐలాండ్స్. అణ్వాయుధాల పోటీని పెంచిపోషిస్తున్నదని ఆరోపిస్తూ ఆ చిన్న దేశం ఏకంగా భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి అత్యున్నత కోర్టులో పిటిషన్ వేసింది. 16మంది న్యాయమూర్తులతో కూడిన అంతర్జాతీయ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఇక, అణ్వాయుధాల విషయంలో బ్రిటన్, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మార్షల్ ఐలాండ్స్ వేసిన పిటిషన్లపై తర్వాత ఉత్తర్వులు వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్లు విచారించాలా? లేదా? అన్నది నిర్ణయిస్తామని తెలిపింది. ప్రపంచానికి అణ్వాయుధాలతో పొంచి ఉన్న ముప్పును అంతర్జాతీయంగా ఈ పిటిషన్లు వెలుగులోకి తెచ్చినట్టు అయింది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణకు భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశాల మధ్య తలెత్తే వివాదాలను మాత్రమే విచారించే అధికార పరిధి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉందని, కానీ మార్షల్ ఐలాండ్స్‌తో భారత్‌కు ఎప్పుడు అణ్వాయుధాల విషయం వివాదం తలెత్తలేదని, కాబట్టి ఈ అంశం న్యాయస్థాన విచారణ పరిధిలోకి రాదని భారత్ పేర్కొంది. భారత వాదనతో ధర్మాసనంలోని 9మంది న్యాయమూర్తులు ఏకీభవించడంతో ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది. 1968నాటి అణ్వాయుధ వ్యాప్తి నిరోధ ఒప్పందాన్ని ప్రపంచదేశాలు ఉల్లంఘిస్తున్నాయని, ముఖ్యంగా బ్రిటన్‌తోపాటు ఈ ఒప్పందంపై సంతకం చేయని భారత్, పాకిస్థాన్‌లు అణ్వాయుధ వ్యాప్తి నిరోధం విఫలం అయ్యాయని మార్షల్ ఐలాండ్ ఆరోపించింది. ఇక, అణ్వాయుధాల విషయంలో చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, రష్యా, అమెరికాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు కేసులు వచ్చినా.. విచారణ పరిధి కారణంగా వాటిని న్యాయస్థానం విచారించలేకపోయింది.