breaking news
market value of lands
-
ఏపీలో మరో బాదుడు.. ఆస్తి విలువలు 40–50% పెంపు
సాక్షి, అమరావతి: హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కారు ప్రజలపై పెను భారాలను మోపుతోంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల బాదుడుతో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని అమరావతి మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆస్తుల విలువలను సవరించింది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతోపాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది. ఈమేరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆస్తుల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు సవరించిన విలువలను ఇప్పటికే ఆమోదించాయి. అన్ని కార్యాలయాల్లో పెరిగిన విలువల అప్లోడ్ పనులను వేగంగా చేపట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50 శాతం వరకు పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలు బాగా తక్కువగా ఉన్నాయనే నెపంతో అనేక ప్రాంతాల్లో ఇలా పెంచేశారు. విశాఖపట్నం, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ పెరుగుదల అనూహ్యంగా ఉండనుంది. మిగిలిన చోట్ల కూడా భారీగా పెంచేందుకు ఏర్పాట్లు చేశారు.రూ.13 వేల కోట్ల ఆదాయం లక్ష్యం.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరిస్తోంది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. అపార్ట్మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి.క్లాసిఫికేషన్లు మార్చడం ద్వారా..భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు కూటమి ప్రభుత్వం దొడ్డిదారిని ఎంచుకుంది. భూముల క్లాసిఫికేషన్లనే మార్చేసింది. ప్రతి ఏరియాలో భూమికి ప్రస్తుతం ఒకే విలువ అమలులో ఉంది. ఇప్పుడు దానికి రెండో విలువను జోడిస్తున్నారు. ఇందుకోసం లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తెచ్చారు. గతంలో వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమిగానూ.. ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న భూమిగా క్లాసిఫైడ్ చేశారు. ఇప్పుడు ఒక ప్రాంతంలోని మెట్ట, మాగాణి భూముల్లోనే రకరకాల క్లాసిఫికేషన్లు పెడుతున్నారు. జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్లో చేరుస్తున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలో రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి అనుకున్న భూమికి ఒక ధర, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లో క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒకరేటు, సందుల్లో వాటి వెనుక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు నాలుగైదు రకాలుగా మార్చారు. దీంతో ఒకే ప్రాంతంలోని భూమి విలువ రెండు మూడు రకాలుగా పెరగనుంది. తద్వారా రాష్ట్రంలో వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు భారీగా పెరిగిపోనున్నాయి.అమరావతికి మినహాయింపురాష్ట్రమంతా భూముల విలువలను పెంచేసిన ప్రభుత్వం ఒక్క అమరావతిలో మాత్రం పెంచకుండా కుట్ర పూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమరావతిలో భూముల విలువలను టీడీపీ నేతలు కృత్రిమంగా పెంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాజధాని పేరుతో భూముల రేట్లు పెంచేసి హైప్ తేవాలని యత్నిస్తున్నారు. దీన్ని మరింత పెంచేందుకు అక్కడ మాత్రమే భూముల విలువలను పెంచకుండా మినహాయించారు. కేవలం రాజధాని ప్రాంతంలో మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల నడ్డి విరిచి అమరావతిలో మాత్రం వెన్నపూస రాయడం ఏమిటని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. -
సొంతింటి కల.. మరింత భారం
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకుసొంతింటి కల ఇక మరింత భారం కానుంది. రైతులు అష్టకష్టాలు పడి పొదుపు చేసిన సొమ్ముతో ఎకరానో అరెకరానో పొలం కొనాలన్నా గగన కుసుమమే. ఇంటి జాగా కొనడమూ పెనుభారంగా మారనుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్థిరాస్తుల మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉండడమే ఇందుకు కారణం. భూములు, ఇళ్లు, స్థలాల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేపట్టింది. ‘‘మార్కెట్ విలువలు పెంచడం ఖాయం. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారు. గ్రామాలు, పట్టణాలవారీగా భూములు, స్థలాల వాస్తవ విలువల ప్రాతిపదికన మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రెవెన్యూ డివిజనల్ అధికారులు/జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని మార్కెట్ రివిజన్ కమిటీల అనుమతి తీసుకోవాలి. ఈ దిశగా జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లను సన్నద్ధం చేయండి’’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ విలువల పెంపునకు మంత్రి కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేసి, సీఎం ఆమోదం నిమిత్తం పంపించారని, సీఎం దీనిని ఆమోదించడం లాంఛనప్రాయమేనని ఉన్నతాధికారులు వివరించారు. సీఎం ఆమోదిస్తే సవరించిన విలువలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. భారీ ఆర్జనకు సర్కారు యత్నాలు భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు పెరగడంవల్ల కొనుగోలుదారులపై స్టాంపు డ్యూటీ భారం పెరుగుతుంది. మార్కెట్ విలువపై నాలుగు శాతం ఉన్న స్టాంపు డ్యూటీని ప్రభుత్వం ఇటీవలే ఐదు శాతానికి పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజును అర శాతం నుంచి ఒక శాతానికి పెంచింది. వివిధ రకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టేబుల్ ఫీజులను కూడా పెంచింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఇప్పుడు మళ్లీ మార్కెట్ విలువలను సవరించడం ద్వారా భారీగా ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘ఇక మార్కెట్ రివిజన్ కమిటీలు ఆమోదించిన రిజిస్ట్రేషన్ విలువలే అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ విలువలతో పోల్చితే 20 నుంచి 30 శాతం వరకూ పెరుగుదల ఉండే అవకాశం ఉంది’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు.