breaking news
Makhdumbhavan
-
ప్యాకేజీలో రైతులకు ఒరిగిందేమిటీ?
సాక్షి,హైదరాబాద్: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రైతులకు ఒరిగిందేమిటో చెప్పాలని రైతుసంఘాల పోరాట సమన్వయ సమితి డిమాండ్ చేసింది. రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యంతో పాటు రైతు వ్యతిరేక చర్యలకు కేంద్రం ఒడిగట్టిందని విమర్శించారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో్ల భాగంగా బుధవారం మఖ్దూంభవన్ ఆవరణలో నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ..వ్యవసాయం, దాని అనుబంధ, మత్స్యరంగాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయించిన రూ.1.63 లక్షల కోట్ల మొత్తాన్నే మళ్లీ ప్యాకేజీలో ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా చెప్పి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. లాక్డౌన్ పొడిగింపు కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేకపోయారని, మద్దతు ధరలు లభించకపోగా 30% తక్కువ ధరలకు రైతులు తమ దిగుబడులను విక్రయించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం రుణమాఫీ చేయాలి రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలు మాఫీ చేయాలని, పాత కిసాన్ క్రెడిట్ కార్డులను రద్దుచేసి కొత్త ఖరీఫ్ కేసీపీ కార్డులివ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు మద్దతు ధర వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి డిమాండ్ చేసింది. పాలు, పండ్లు, కూరగాయలు కూడా ప్రభుత్వమే కొనాలని విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహా రక మందుల ధరలను ఈ సీజన్లో 50% తగ్గించాలని సూచించాయి. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, రుణమాఫీ, పంటబీమా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ నిరసనల్లో సారంపల్లి మల్లారెడ్డి, వేములపల్లి వెంకట్రామయ్య, పశ్యపద్మ తదితరులు పాల్గొన్నారు. -
మరో సమరానికి సిద్ధమవ్వాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో.. అందుకు వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాల్సి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం రాలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మఖ్దూంభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం చాడ మాట్లాడుతూ... ధరల పెరుగుదల, అవినీతి, ప్రజాస్వామ్య విలువలు, లౌకిక వ్యవస్థపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, సిద్ధి వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, కె.శ్రీనివాసరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, ఉజ్జిని రత్నాకరరావు, టి.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.