ఊరచెరువును రిజర్వాయర్‌గా మారిస్తే మేలు
                  
	ఎడమ కాల్వ పక్కనే ఉండి ఎండిపోతున్న మునగాల చెరువు
	రిజర్వాయర్‌గా చేస్తే వందలాది ఎకరాలకు సాగునీరు
	పరిసర ప్రాంతాల్లో పెరగనున్న భూగర్భ జలమట్టం
	పలు గ్రామాల్లో తీరనున్న తాగునీటి కష్టాలు
	చెరువు ఆక్రమణలకు చెక్ పడుతుందంటున్న స్థానికులు
	మునగాల : మండలకేంద్రంలోని ఊరచెరువుకు సాగర్‌నీరు అందించి రిజర్వాయర్‌గా మారిస్తే ఈ ప్రాంతం కొంతవరకు సస్యశ్యామలం కానుంది. ఇదేకాక పక్కనే ఉన్న మూడు గ్రామాలకు తాగునీటి సమస్య కూడా తీరనుంది. ఊరచెరువు విస్తీర్ణం దాదాపు 350ఎకరాలుండగా ఇప్పటికే దాదాపు సగానికి పైగా ఆక్రమణలకు గురైంది. ఈ చెరువులోకి వరదనీరు వచ్చే అవకాశం లేదు. గతంలో గట్టునుంచి వచ్చే వరద కాలువ సాగర్ ఎడమకాలువ తవ్వకంతో కనుమరుగైంది.  దీంతో కొన్నేళ్ల తరబడి ఈ చెరువుకు పూర్తిస్థాయిలో వరదనీరు రాకపోవడంతో చెరువు ఆయకట్టు పరిధిలోని బోర్లు, బావుల్లో భూగర్భజల మట్టం తగ్గిపోతోంది. ఫలితంగా దాదాపు 600ఎకరాల సాగు స్థిరీకరణ కలిగిన ఈ చెరువు ఆయకట్టు కొంత మెట్టపంటల సాగుకు పరిమితంకాగా మిగతాది బీడుగా మారుతోంది.  ఈ నేపథ్యంలో కొందరు చెరువు శిఖాన్ని ఆక్రమించుకుని అందులోనే బావులు తవ్వుకొని వరిసాగు చేసుకుంటున్నారు.
	ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే...
	ఈ ఊరచెరువు పక్కనుంచే సాగర్ ఎడమ (పాలేరు)కాలువ పోతోంది. కేవలం కాలువకు, చెరువుకు మధ్య వంద అడుగుల దూరం మాత్రమే ఉంటుంది. ఎడమకాలువపె ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి నేరుగా చెరువులోకి సాగర్నీరును తరలించవచ్చు. ఇందుకోసం రెండు 100హెచ్‌పీ.మోటార్లు ఏర్పాటు చేస్తే సాగర్ ఎడమకాలువకు నీరు విడుదల చేసిన వెంటనే నేరుగా ఎత్తిపోతల ద్వారా నీటిని చెరవుకు మళ్లించే అవకాశముంది. ఇందుకోసం పెద్దగా వ్యయం కూడా కాదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిమాండ్ ఎప్పుటినుంచో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
	రిజర్వాయర్ ఏర్పాటుతో మునగాల సస్యశ్యామలం
	మునగాల ఊరచెరువును రిజర్వాయర్‌గా మారిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడమే కాక మునగాలతోపాటు పక్క గ్రామాలకు తాగునీటి సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చు. ఎత్తిపోతల పథకం కోసం కావల్సిన 16గంటలు విద్యుత్ సరఫరా లైన్ కూడా అందుబాటులో ఉంది. ఇందుకోసం చెరువు ఆయకట్టు రైతాంగమే ముందుకు వచ్చి  విరాళాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికైనా ఎడమకాలువపై ఎత్తిపోతల పథకానికి అనుమతిని తీసుకురావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత రాజకీయ పార్టీల నాయకులు ముందుకు రావాలని.. ప్రభుత్వం కూడా తమ సమస్యను దష్టిలో ఉంచుకుని ఊర చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.  
	
	సాగునీరు పుష్కలంగా లభిస్తుంది – మిడిసినిమెట్ల నాగేశ్వరరావు,రైతు, మునగాల
	మునగాల ఊరచెరువును రిజర్వాయర్‌గా మార్చి సాగర్‌నీటితో పూర్తిస్థాయిలో నింపితే ఆయకట్టు పరిధిలో భూగర్భజల æమట్టం పెరిగి సాగునీరు పుష్కలంగా లభిస్థోంది. ఫలితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యే అవకాశముంది.
	
	రిజర్వాయర్ అయితే తీరనున్న కష్టాలు –వీరస్వామి, మునగాల
	మునగాల ఊరచెరువును రిజర్వాయర్‌గా మారిస్తే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పుంజుకుంటాయి. రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో పంటలు పండడమే కాక మునగాలలోని పదివేల జనాభాతోపాటు పక్కనున్న పలు గ్రామాలకు తాగునీటి సమస్యలకు పరిష్కారం కానున్నది.