breaking news
Mahavira
-
ఇంద్రియాలను జయించిన మహావీరుడు
ఏప్రిల్ 13న మహావీరుడి జయంతి హిందూ, జైన, బౌద్ధ, సిక్కు వుతాల్లో బౌద్ధ, జైనమతాలు కొంచెం భిన్నమైనవి. అహింస, సత్యవాక్పాలన, ఆస్తేయం (దొంగతనం చేయకుండా ఉండటం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కబళించకపోవటం) అనే ఐదు సూత్రాల ఆధారంగా ఏర్పడినదే జైనమతం. జినులు అంటే జయించినవారు అని అర్థం. వారు జయించింది ఇంద్రియాలను, ఆ తర్వాత జనుల హృదయాలను. జైనమత వ్యాపకుడైన వర్థమాన మహావీరుడు రాజుగా పుట్టాడు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వర్ధమానుడు. పెరిగి పెద్దవాడయ్యాక ఆయన ఇతర రాజ్యాల మీద దండెత్తి రాజులను జయించి ఉంటే అందరూ వీరుడని కొనియాడేవారేమో! అయితే వర్థమానుడు అలా చేయలేదు. రాగద్వేషాలను, అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలను జయించి మహావీరుడయ్యాడు. క్రీ.పూ. 599లో నేటి బీహార్లోని విదిశ (నాటి వైశాలి) లో త్రిశల, సిద్ధార్థుడు అనే రాజదంపతులకు జన్మించిన వర్థమానుడు బాల్యం నుంచి ప్రాపంచిక విషయాల మీద ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదట. యశోధర అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రుల మరణానంతరం భార్యాబిడ్డలను వదిలి సన్యాసం స్వీకరించాడు. వృషభనాథుడు ప్రతిపాదించిన జైనమతాన్ని తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా బలోపేతం చేశాడు. వర్థమాన మహావీరుడిని ఆనాటి ప్రజలు సాక్షాత్తూ భగవంతుడి ప్రతిరూపంగా ఆరాధించారు. - డి.వి.ఆర్. వర్థమానుడి తత్వం ద్వైతం. ఆయన సిద్ధాంతం ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవుడు, రెండు అజీవుడు. జీవుడంటే ఆత్మ, అజీవుడంటే పదార్థం. అజీవుడు అణునిర్మితమైతే, జీవుడు అమర్త్యం. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మల కారణంగానే జన్మలు ఏర్పడతాయి. జన్మరాహిత్యం చేసుకోవాలంటే మోహవికారాదులను, ఇంద్రియానుభవాలను తగ్గించుకోవాలి. అందుకు సన్యాసం, తపస్సు రెండూ అవసరమవుతాయి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. అంటే నిష్క్రియాత్మకమైన, నిర్మలమైన శాశ్వతానందం. నిర్వాణం లక్ష్యంగా ఉన్నవారు దుష్కర్మలను పరిహరించాలి. అంతేకాదు, నూతనకర్మలు చేయకుండా ఉన్న కర్మలను క్రమంగా నశింపజేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అంటే సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన. -
కర్మలను నాశనం చేసుకుంటేనే బంధవిముక్తి
అతి ప్రాచీనమైనదిగా, ఉత్తమోత్తమమైన మతంగా గుర్తింపు పొందినది జైనమతం. ఈ మతం ఎప్పుడు నెలకొల్పబడిందో ఇతమిత్థంగా తెలియనప్పటికీ, ఋగ్వేద మంత్రాలలో సైతం జైనమత వ్యవస్థాపకుడైన ఋషభుని గురించిన ప్రస్తావన ఉన్నదంటేనే ఆ మతం ఎంత ప్రాచీనమైనదో అర్థం చేసుకోవచ్చు. జైనమతానికి మొత్తం 24 తీర్థంకరులున్నారు. తీర్థంకరులు అంటే జీవన స్రవంతిని దాటడానికి వారథిని నిర్మించినవారు అని అర్థం. వర్థమాన మహావీరుడు జ్ఞాత్రికా తెగకు చెందినవాడు. వైశాలి దగ్గరగల కుందగ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడాయన. యశోదతో ఈయన వివాహం జరిగింది. వారికి ప్రియదర్శన అనే కుమార్తె కలిగింది. ముప్పైసంవత్సరాల వయసులో వర్థమాన మహావీరుడికి జీవితంపై విరక్తి కలిగి, ఇల్లు వదిలి సన్యాసం స్వీకరించాడు. శరీరాన్ని కృశింపజేసే కఠోరమైన జైనమత ఆచార నియమాలు పాటిస్తూ సుమారు పుష్కరకాలంపాటు దేశ సంచారం చేశాడు. వర్థమానుడు దాదాపు సంవత్సరకాలంపాటు ఒక వస్త్రాన్ని ధరిచి, ఆ తర్వాత ఆ వస్త్రాన్ని కూడా విసర్జించి దిగంబరంగా జీవించాడు. పన్నెండేళ్లపాటు రుజుపాలిక నదీతీరంలోగల జృంభిక గ్రామసమీపంలో ఒక సాలవృక్షం కింద కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. కర్మకాండను, కులాధిక్యభావనను తిరస్కరించి పవిత్రమైన జీవితం గడపాలని బోధించాడు. ఈ ప్రపంచమంతా చేతన, అచేతన జీవులతో నిండి ఉందని,అంతేగాని, జాతి, కుల, మత, వర్ణ, లింగ వివక్షత పాటించడం అవివేకమన్నాడు. కర్మ ఆత్మను అంటిపెట్టుకుని ఉంటుందని, కామ, క్రోధ, లోభ మోహాదులు కర్మకు కారణాలని, కర్మల ఫలితాలను అనుభవించడం కోసమే ఆత్మ జన్మ, పునర్జన్మలను అనుభవించవలసి వస్తోంది. దీర్ఘ తపస్సు చేత, పూర్వార్జిత కర్మలను నాశనం చేసుకున్నప్పుడు జీవుడు బంధవిముక్తుడవుతాడని, కాబట్టి జనన మరణాల నుండి విముక్తి పొందడమే జీవిత లక్ష్యంగా భావించాలని బోధించాడు. సల్లేఖన వ్రతం: జైనమత కఠోర నియమం సల్లేఖన వ్రతం. జైన సన్యాసులుగా దీక్ష స్వీకరించేవారు కఠిన నియమాలను పాటించవ లసి ఉంటుంది. ఏవిధమైన సాధనాలూ ఉపయోగించకుండా తలవెంట్రుకలను తనంతట తానుగా తొలగించుకోవడం, పరిమితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ తీక్షణమైన ఎండ వానలను లెక్కచేయకుండా కఠోర తపస్సులో నిమగ్నం కావడం జైనమత నియమాలు. అన్నింటికంటే చాలా కష్టతరమైనది సల్లేఖన వ్రతం. ఆహారం కాని, నీరు కానీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం సల్లేఖన వ్రతంలోని ప్రధానాంశం. సల్లేఖన వ్రతం ద్వారానే మోక్షానికి చేరువ కావచ్చునన్నది జైనమత విశ్వాసం. జైనమతానికి 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడు ఆశ్వయుజమాసంలో అమావాస్యనాడు తన భౌతిక కాయాన్ని వదిలి నిర్యాణం చెందాడు. ఆయన నిర్యాణ సమయంలో దేవతలందరూ వచ్చి ఆయన చుట్టూ నిలిచారని, వారి శరీరాలనుండి వెలువడిన వెలుగు రేఖలతో అమావాస్య చీకట్లు తొలగి కాంతికిరణాలు వెలువడ్డాయని, అందుకు గుర్తుగానే జైనమతానుయాయులు దీపావళినాడు దీపాలు వెలిగిస్తారు.