'షేర్ ఖాన్' శ్రీహరి కన్నుమూత
టాలీవుడ్ నటుడు శ్రీహరి బుధవారం హఠాన్మరణం చెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీహరి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో మరణించారు. ప్రముఖ సినీ డ్యాన్సర్ డిస్కో శాంతి భర్త. ఇటీవల మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటన ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆయన వయస్సు 49. శ్రీహరి మరణవార్తతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనైంది.
గత కొద్దికాలంగా ఆయన కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 97 సినిమాల్లో నటించారు. 1964 ఆగస్టు 15 తేదిన హైదరాబాద్ లోని బాలానగర్ జన్మించారు. ఫైటర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా పలు చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తమిళంలో మా పిళ్లై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రంతో సినీ జీవితాన్ని ఆరంభించారు.
పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. శ్రీహరి చివరి చిత్రం తుఫాన్.ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. అకాల మరణం చెందిన తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి. మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాల్లో.సేవలందిస్తున్నారు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. నువ్వు వస్తానంటే వద్దొంటానా, బృందావనం, ఢీ చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలు ఆయనకు పేరును తీసుకువచ్చాయి.
శ్రీహరి నాకు ఎంతో ఆప్తుడు. శ్రీహరి ఇకలేరన్న వార్తను నమ్మలేకపోతున్నాను అని నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. హరికృష్ణతోపాటు పలువురు చిత్ర రంగానికి చెందిన ప్రముఖులతోపాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు.