Luxury Items
-
గుడ్లు తేలేస్తున్న అమెరికా
కనీవినీ ఎరగని కొరత. ఆకాశాన్నంటిన ధరలు. అంతంత పెట్టయినా కొందామంటే వాటిపైనా ఆంక్షలు. మొత్తమ్మీద అగ్ర రాజ్యం అక్షరాలా ‘గుడ్లు’ తేలేస్తోంది. తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలలుగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోందే తప్ప తెరిపిన పడే సూచనలే కన్పించడం లేదు...! దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయిన దుస్థితి! ఎందుకీ సమస్య? అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికీ పెరిగిపోతోంది. బర్డ్‌ఫ్లూగా పిలిచే హెచ్5ఎన్1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలో ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మూడేళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు. వీటిలో 1.7 కోట్ల కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అంతమొందించారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11 శాతం తగ్గుదల! అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపు దాలి్చంది. కొద్ది రోజులుగా డజను గుడ్లు్ల ఏకంగా 5 డాలర్లకు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే 435 రూపాయలు. ఒక్క గుడ్డు రూ.36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోనే ఆల్‌టైం గరిష్టం! అంతేకాదు, షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా 8 నుంచి 10 డాలర్ల దాకా ఎగబాకింది!! దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్మార్కెట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా 2 గుడ్లే అమ్ముతున్నాయి! డెన్సీస్, వాఫుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చెయిన్లు ఒక్కో గుడ్డుపై 50 సెంట్ల సర్‌చార్జీ కూడా వడ్డిస్తున్నాయి!ధరలు మరింత పైపైకే? సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కన్పించకపోవడం అమెరికన్లను మరింత కలవరపెడుతోంది. కోళ్ల కొరతను అధిగమించడానికే కనీసం మరికొద్ది నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. అప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం. గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం ఎగబాకాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి. ఇది ఇక్కడితో ఆగదని, ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం 40 శాతానికి పైగా పెరగవచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది! ట్రంప్ సర్కారు కూడా పరోక్షంగా అదే చెప్పింది. ‘‘ఏడాదిన్నరలోగా డజను గుడ్ల ధర ఎప్పట్లా 2 డాలర్ల లోపుకు దిగొచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ చెప్పుకొచ్చారు! దాంతో గుడ్ల కొరతను అధిగమించేందుకు తుర్కియే వైపు చూస్తోంది. గతంలో కెనడా, నెదర్లాండ్స్, బ్రిటన్, చైనా నుంచీ అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్నా కొన్నేళ్లుగా ఒక్క తుర్కియేకే పరిమితమైంది. ఆ దేశం నుంచి ఈ ఏడాది కనీసం 42 కోట్ల గుడ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును, ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెబుతున్నారు.ఇవీ లెక్కలు..→ అమెరికాలో ఏటా సగటున 9,000 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తవుతాయి. → ఫ్లూ కారణంగా మూడేళ్లలో 14 కోట్ల కోళ్లను చంపేయాల్సి వచ్చింది. → 2021లో 1.6 డాలర్లున్న డజను గుడ్ల ధర ఇప్పుడు 5 డాలర్లను దాటేసింది. → 2024లో తుర్కియే నుంచి 7 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకున్నారు. → ఈసారి ఏకంగా 42 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకోనున్నారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం! → అయినా డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇది ఏమాత్రమూ చాలదంటున్నారు.ట్రంప్ బిలియన్ డాలర్ ప్లాన్ గుడ్ల కొరతను అధిగమించి వాటి ధరలను నేలకు దించేందుకు బిలియన్ డాలర్ల ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. అందులో ఏమున్నాయంటే... → బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు. → బర్డ్‌ఫ్లూ చికిత్స, వ్యాక్సిన్ల అభివృద్ధి తదితరాలకు 10 కోట్ల డాలర్లు → పౌల్ట్రీఫారాల యజమానులకు ఆర్థిక సాయానికి 40 కోట్ల డాలర్లు → దిగమతుల ద్వారా ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకుని కొరతను అధిగమించడంబైడెన్ సర్కారు ఏం చేసింది? ఫ్లూపై పోరుకు బైడెన్ ప్రభుత్వం మూడేళ్లలో 150 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఫ్లూ బారిన పడ్డ కోళ్లను అంతమొందిస్తూ వచ్చింది. ఈ వైరస్ మనుషులకు పాకకుండా చూసేందుకు 60 కోట్ల డాలర్లు కేటాయించింది. వ్యాక్సిన్ల వృద్ధి తదితరాలపై దృష్టి పెట్టింది. ఎంత చేసినా గుడ్ల కొరత నానాటికీ పెరుగుతూనే వచ్చింది. బైడెన్ ప్రభుత్వ అర్థంలేని చర్యల వల్లే సమస్య విషమించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన చర్యలతో పరిస్థితి ఎంతో కొంత అదుపులోకి రాగలదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
షాపింగ్ ఓ రేంజ్లో..!
న్యూఢిల్లీ: విలాసవంతమైన ఉత్పత్తుల పట్ల అభిరుచి చిన్న పట్టణాలకూ విస్తరిస్తోంది. ఖరీదైన పాదరక్షలు, వాచీలు, వ్రస్తాలు, యాక్సెసరీల కోసం దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల పట్టణ వాసులు సైతం ఆర్డర్ చేస్తున్నారు. దీంతో లగర్జీ ఉత్పత్తుల కొనుగోళ్లు ప్రధానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర మెట్రోలకే పరిమితం అన్న అభిప్రాయం క్రమంగా చెరిగిపోతోంది. గుజరాత్లో 2 లక్షల జనాభా కూడా లేని బోటాడ్ నుంచి వీటి కోసం ఆర్డర్లు వస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఇందుకు వారధిగా నిలుస్తున్నాయి. టాటా క్లిక్ లగ్జరీ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు తెలిశాయి. ‘‘లగ్జరీ అన్నది ఇక ఎంత మాత్రం అధిక ధనవంతులకు సంబంధించిన విభాగం కాబోదు. టైర్–2, 3 పట్టణ వాసులు, మెట్రో పరిధిలో కొత్త భౌగోళిక ప్రదేశాలు పరిశ్రమకు కొత్త పునరుజ్జీవాన్నిస్తున్నాయి’’అని టాటా క్లిక్ లగ్జరీ నివేదికలో అనలిస్టులు పేర్కొన్నారు. సంపన్నులు కాని అధిక ఆదాయ వర్గాలతో (హెన్రీ) కూడిన వినియోగ వర్గం గురించి ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. వీరు లగ్జరీ ఉత్పత్తుల అనుభవాన్ని కోరుకుంటున్నట్టు తెలిపింది.నాన్ మెట్రోల్లోనే అధిక అమ్మకాలు.. టాటా క్లిక్‌లో లగ్జరీ ఉత్పత్తుల ప్రత్యేక విభాగమైన ‘టాటా క్లిక్ లగ్జరీ’పై జరిగే విక్రయాల్లో 55 శాతం నాన్ మెట్రోలైన పంచకుల, మైసూరు తదితర పట్టణాల నుంచే ఉంటున్నాయి. ‘‘ఇలా కొనుగోలు చేసే వారంతా ఉద్యోగాలు చేస్తూ, అధిక ఆదాయం సంపాదిస్తున్న వారు. విలాస అనుభం, ఉత్పత్తుల వినియోగాన్ని కోరుకుంటున్నారు. దీంతో సౌందర్య ఉత్పత్తులు, యాక్సెసరీలు, వస్త్రాలు, పాదరక్షల విక్రయాల్లో అధిక విక్రయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. మెట్రో వినియోగదారుల మాదిరే వీరి కొనుగోళ్ల విలువ కూడా ఉంటోంది’’అని టాటా క్లిక్ లగ్జరీ సీఈవో గోపాల్ ఆస్థానా తెలిపారు. సంపన్నులే కాకుండా చిన్న పట్టణాల్లోని వృత్తి నిపుణులు సైతం లగ్జరీ వస్తువులకు వినియోగదారులుగా మారుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బల్గరీ తదితర అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల సహకారంతో భారత్‌లో కొత్త కస్టమర్లను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అజియో లగ్జే సైతం అంతర్జాతీయ బ్రాండ్లకు చిన్న పట్టణాల్లో భౌతిక స్టోర్లు తెరవాల్సిన అవసరాన్ని తప్పిస్తోంది. సంప్రదాయ లగ్జరీ షాపర్లకు భిన్నంగా.. కొత్త కస్టమర్లు తగిన పరిశోధన తర్వాతే ఆర్డర్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియా వేదికలు, వెబ్సైట్లు, కస్టమర్ల రివ్యూలను ఉపయోగించుకుంటున్నారు. కనీసం ఆరేడు బ్రాండ్ల ఉత్పత్తులను పరిశీలించిన తర్వాతే చివరికి ఒకటి ఎంపిక చేసుకుంటున్నారు. → అధిక ఆదాయంతో మెరుగైన అనుభవానికి మొగ్గు → పలు బ్రాండ్లను పరిశీలించిన తర్వాత కొనుగోలు → సరైన పరిశోధన తర్వాతే ఉత్పత్తి ఎంపిక → జెన్ జెడ్, జెన్ ఆల్ఫా భవిష్యత్ లగ్జరీ కస్టమర్లు → ఈ కామర్స్ రూట్లో అంతర్జాతీయ బ్రాండ్లు → నాన్ మెట్రోల నుంచే 55 శాతం అమ్మకాలు -
వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా విలువైన వస్తువులను తీసుకొస్తుంటే కస్టమ్స్ అధికారులు పసిగట్టి పట్టేస్తుంటారు. అలాంటి సంఘటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకున్న చేతి గడియారాల విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. మొత్తం ఏడు గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వజ్రాలు పొదిగిన వైట్ గోల్డ్ వాచ్ విలువ ఏకంగా రూ.27 కోట్లు ఉంటుందటా.. అత్యంత విలువైన ఏడు చేతి గడియారాలని అక్రమంగా తీసుకొస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద విలువైన గడియారాలతో పాటు వజ్రాలు పొదిగిన బ్రెస్లెట్, ఐఫోన్ 14ప్రోను సైతం సీజ్ చేశారు. లగ్జరీ వస్తువులకు పన్నులు, ఇతర సుంకాలు చెల్లించకుండానే దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా జువెలరీ, వాచ్ తయారీ సంస్థ జాకబ్ అండ్ కో.. తయారు చేసిన ఓ వాచ్‌లో విలువైన వజ్రాలు పొదిగారని, అది సంపన్నులు మాత్రమే ధరిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం పట్టుబడిన వస్తువుల విలువ రూ.28 కోట్లకుపైగా ఉంటుందని, ఈ స్థాయిలో పట్టుకోవటం ఇదే తొలిసారిగా వెల్లడించారు. 60 కిలోల బంగారంతో సమానమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఎల్జీ సాబ్ జస్ట్ చిల్.. మీలా నా భార్య సైతం చేయలేదు’.. కేజ్రీవాల్ ట్వీట్ -
సమోసా, కచోరీలపై భారీ పన్ను!
పాట్నా: కప్పు చాయ్, ఒక సమోసా తింటే కడుపు నిండిన సంతృప్తి సామాన్యుడికి. కానీ రానురాను ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో చేరిపోయి.. అవి కూడా సామాన్యుడికి అందని ద్రాక్షల్లా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా బిహార్‌లోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసా, కచోరీలను విలాస వస్తువుల జాబితాలో చేర్చి.. వాటిపై ఏకంగా 13.5శాతం పన్ను విధించింది. అభివృద్ధి అజెండాతో ముందుకుసాగుతున్న నితీశ్ సర్కార్ అందుకు తగిన నిధులను పన్నులరూపంలో సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా విలాస వస్తువులపై 13.5 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. కిలోకు రూ. 500 కన్నా అధికంగా ధర కలిగిన మిఠాయిలు, దోమల్ని నిరోధించే మస్కిటో కాయిల్స్ వంటివాటిని ఈ విలాస వస్తువుల జాబితాలో చేర్చింది. సీఎం నితీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిఠాయిలతోపాటు సాల్టీ ఆహార పదార్థాలైన సమోసా, కచోరీలపైనా 13.5 శాతం పన్ను విధిస్తున్నామని కేబినెట్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రజేశ్ మెహోత్రా తెలిపారు. అదేవిధంగా అన్ని రకాల యూపీఎస్ వస్తువులపైనా ఈ విలాస పన్ను ఉంటుందని, ఇసుక, సౌందర్య సాధన ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, తలనూనె వంటివాటిపై కూడా 13.5శాతం పన్ను విధించనున్నామని ఆయన చెప్పారు. -
ఆన్లైన్లో ‘ఖరీదు’ చేద్దామా..!
నేటి తరానికి చెందిన ఐటీ ఉద్యోగి మాధవీ గణేషన్‌కి ఆన్లైన్ షాపింగ్ అంటే మహా క్రేజీ. ఇంటిలోని కిరాణ వస్తువుల దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లోనే కొంటుంది. కానీ ఖరీదైన వస్తువుల విషయానికి వస్తే వెనుకంజ వేస్తోంది. దీనికి కారణం ‘ఆన్లైన్లో దొరికే లగ్జరీ వస్తువులపై పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడమే. లగ్జరీ వస్తువుల విషయంలో కొంతమంది ఆన్లైన్ రిటైలర్లు మోసాలకు పాల్పడుతున్నారని, అసలుదా, నకిలీదా అన్నది గుర్తుపట్టడం కష్టం’ అని అంటున్నారామె. ఒక్క మాధవినే కాదు చాలా మంది లగ్జరీ వస్తువుల విషయంలో ఇలానే వ్యవహరిస్తున్నారట. ఖరీదైన వస్తువులకు సంబంధించిన వివరాలను, వాటి సమీక్షలను తెలుసుకోవడానికే ఆన్‌లైన్‌కు పరిమితమవుతున్నారని, చివరకు వస్తువు కొనే సరికి నేరుగా షోరూంకు వెళ్ళి కొంటున్నారట. తాజా గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తుల విక్రయాల్లో ఆన్లైన్ వాటా కేవలం 6 శాతం మాత్రమే ఉందని, ఇది 2020 నాటికి 12 శాతానికి చేరుతుందని రీసెర్చ్ సంస్థ మెకిన్సే అంచనా వేస్తోంది. కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే ఆన్లైన్లో కూడా లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో లగ్జరీ వస్తువులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించాల్సిన అంశాలను ఇప్పుడు చూద్దాం.. ఇవి గమనించండి.. ఈ-కామర్స్ కంపెనీల రిటర్న్ పాలసీ, డిస్క్లైమర్ను పూర్తిగా వినియోగదార్లు చదవాలి అని రిటైల్ నిపుణులు కలిశెట్టి నాయుడు సూచించారు. ధ్రువీకరణ, డెలివరీ హామీ, కస్టమర్ కేర్ నంబరు ప్రముఖంగా ఉన్నదీ లేనిదీ కస్టమర్లు గమనించాలి. విక్రయిస్తున్న బ్రాండ్స్ వివరాలు, ఉత్పత్తుల ఫొటోలు, కస్టమర్ల కామెంట్లు, రేటింగ్స్, తాజా ఫ్యాషన్ తీరు, డిజైనర్ల గురించిన సమాచారం ఉంటే ఆ వెబ్‌సైట్‌కు విశ్వసనీయత ఉంటుంది. తాము ఏకైక అధికారిక రిటైలర్ అని ఏదైనా వెబ్సైట్ ప్రకటించుకున్నట్టయితే ఆ బ్రాండ్ ఉత్పత్తులు మరేదైనా వెబ్సైట్లో లభిస్తున్నాయా లేదా పరిశీలించండి. బ్రాండ్ అధీకృత వెబ్సైట్ అయితే నడుస్తున్న సీజన్ కలెక్షన్‌ను గుర్తించవచ్చు. ప్రయోజనం ఏమిటంటే.. సాధారణంగా లగ్జరీ వస్తువులకు సంబంధించిన షోరూంలు పెద్ద పెద్ద నగరాలు, పట్ణణాలకే పరిమతమవుతాయి. దీనివల్ల మీకు వీటిని కొనాలని ఉన్నా అవి అందుబాటులో ఉండవు. అదే ఆన్లైన్లో అయితే ఎక్కడి నుంచైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. మీకు నచ్చిన సమయంలో కొనే వెసులుబాటు ఉంటుంది. ఇక లగ్జరీ షోరూంల నిర్వహణ అనేది చాలా వ్యయంతో కూడుకున్నది. సాధారణంగా లగ్జరీ షాపులు సంపన్నులు అధికంగా ఉండే ఖరీదైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అద్దెలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు అమ్ముతున్న వస్తువులకు తగ్గట్టుగా షాపును సుందరంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు. ఈ వ్యయాలన్నీ మన నుంచే ముక్కు పిండి వసూలు చేస్తారు. అదే ఆన్లైన్లో అయితే ఈ ఖర్చులేమీ ఉండవు. దీనితో చౌకగా ఈ వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యం దొరుకుతుంది. సాధారణంగా బ్రాండెడ్ షోరూంతో పోలిస్తే ఆన్లైన్లో 10 శాతం తక్కువ ధరకే లగ్జరీ వస్తువులు లభిస్తాయని ఆన్లైన్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఉత్పాదన నకిలీదైతే.. మీరు స్వీకరించిన ఉత్పాదన నకిలీదైతే కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు ఉత్పాదనను వెనక్కి తీసుకుంటాయి. వెనక్కి తీసుకోకపోతేనే అసలు సమస్య. కంన్సూమర్ ఫోరంలో ఆ వెబ్‌సైట్‌పై ఫిర్యాదు చేయవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను నలుగురికి తెలియజేయండి. గౌరవానికి భంగం కలుగుతుందన్న భయంతోనైనా ఆ వెబ్సైట్ నుంచి మీ డబ్బులు మీకు రావొచ్చు. నకిలీది కాబట్టి బ్రాండ్లు ఈ విషయంలో ఏమీ సహాయం చేయవు. అందుకే బ్రాండ్స్‌కు చెందిన సొంత వెబ్సైట్లు లేదా పాపులర్ వెబ్సైట్ల ద్వారా షాపింగ్ చేయడం ఉత్తమం. ధర విషయంలో.. కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు 80 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంటాయి. లగ్జరీ బ్రాండ్ల విషయంలో ఇంతే స్థాయిలో డిస్కౌంట్ ఉంటే మాత్రం జాగ్రత్త వహించాలి. బ్రాండ్ షాపులో లేదా ఆ బ్రాండ్ వెబ్సైట్లో ఉన్న ధర కంటేతక్కువకే అమ్మితే ప్రామాణికతను పరిశీలించాలి అని క్లాసిక్ పోలో తెలంగాణ పంపిణీదారు గుండుబోయిన శ్రీకాంత్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రెడీమేడ్స్ విషయంలో 4 నెలలకోసారి కొత్త సరుకు మార్కెట్లోకి వస్తుంది. అప్పుడు పాత సరుకుపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. సరుకును కొన్న వ్యాపారి ఆన్లైన్ విక్రేతలు లేదా రిటైలర్లకు కొంత ధర తగ్గించి విక్రయిస్తారు’ అని వివరించారు. భారత్‌లో ధరపై నియంత్రణ లేదు. స్టాక్ చాలా మిగిలిపోతే కంపెనీలు భారీగా డిస్కౌంట్ ఇవ్వడం సహజం. కానీ లగ్జరీ వస్తువుల విషయంలో డిస్కౌంట్ అనేది అంత ఎక్కువ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తనిఖీ చేయండి.. ఆన్లైన్లో ఉత్పాదన స్వీకరించగానే ట్యాగ్, డస్ట్ బ్యాగ్, వారంటీ కార్డ్‌ను పరిశీలించండి. బ్రాండెడ్ గూడ్స్ ముఖ్యంగా లగ్జరీ ఉత్పత్తులు ఇవి లేకుండా విక్రయించవు. కొన్ని బ్రాండ్లు ఉత్పత్తి లేదా ప్యాక్‌పై ఒక కోడ్‌ను ముద్రిస్తాయి. ఈ కోడ్ ఆధారంగా అసలుదా, నకిలీదా ట్రాక్ చేయవచ్చు. విక్రయానంతర సేవను ఈ బ్రాండ్లు ఆఫర్ చేస్తాయి. ఇవేవీ లేవంటే మీరు నకిలీ ఉత్పాదనను కొన్నారన్న మాట. దుస్తులైతే వస్త్రం, కుట్లు (స్టిచ్చింగ్) ఎలా ఉన్నాయో గమనించాలి. వినియోగదార్లు సాధ్యమైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవాలి. మార్కెట్ ప్లేస్ విధానంతో.. సాధారణంగా లగ్జరీ బ్రాండ్లు చాలామటుకు సొంత ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారానే విక్రయిస్తున్నాయి. సొంతంగా ఈకామర్స్ వెబ్‌సైట్స్ లేకపోతే మార్కెట్ ప్లేస్ విధానాన్ని అనుసరిస్తాయి. అంటే ఈ-కామర్స్ కంపెనీలతో చేతులు కలిపిన రిటైల్ విక్రేతలే ఉత్పత్తులను సరఫరా చేయడాన్ని మార్కెట్ ప్లేస్ విధానం అంటారు. ఇలాంటి సమయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రిటైల్ సంస్థలు మోసాలు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలుదా నకిలీదా అన్ని గుర్తుపట్టలేనంతగా వీటిని తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇలా నకిలీ వస్తువులు విక్రయిస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే ఆ రిటైల్ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నాయి. అందుకే మీరు ఆర్డరు ఇచ్చే ఆన్లైన్ రిటైల్ సంస్థ ఎంత నమ్మకమైనదన్న విషయం కూడా ఇక్కడ ముఖ్యమే.