breaking news
lotty
-
ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు
నటుడిగానే కాకుండా రాజకీయాల పరంగానూ వార్తల్లో నిలుస్తున్న స్టార్ హీరో విశాల్. ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడుతుంటారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన లత్తీ చార్జ్ (తెలుగులో లాఠీ) చిత్రం ఈ నెల 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు విషయాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. అవేంటో చూద్దాం ప్ర: లత్తీ చార్జ్ చిత్రం గురించి? జ: నేను ఇంతకు ముందెన్నడూ చేయని కథా, కథనాలతో కూడిన చిత్రం ఇది. తొలిసారిగా పోలీస్ కానిస్టేబుల్‌గా నటించాను. సమాజంలో పోలీస్ కానిస్టేబుళ్ల పాత్ర కీలకం. అయితే వారి వ్యక్తిగత జీవితం మాత్రం కష్టాల కడలే. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా పరుగులు తీయాల్సిన పరిస్థితి. అలాంటి ఒక కానిస్టేబుల్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం లత్తీ చార్జ్. ఈ చిత్రం కోసం శక్తికి మించి శ్రమించాల్సి వచ్చింది. ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి క్లైమాక్స్ సన్నివేశాలను ఇందులో చూస్తారు. ప్ర: లత్తీ చార్జ్‌ను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడంపై? జ: పాన్ ఇండియా చిత్రాలు అనడాన్ని నేను సమరి్ధస్తాను. తమిళ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతున్నాయి. తెలుగు, మలయాళం చిత్రాలు తమిళనాడులో ఆడుతున్నాయి. కన్నడ చిత్రాలు తమిళనాడులో ఎక్కువగా విడుదల కాకపోయినా, ఆ చిత్ర పరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే పాన్ ఇండియా అనే చట్రంలో ఇరుక్కుపోతే బయట పడటం కష్టం. ప్ర: మెగాఫోన్ ఎప్పుడు పట్టబోతున్నారు? జ: లత్తీ చార్జ్ తరువాత మార్క్ ఆంటోని చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తండ్రీకొడుకులుగా చేస్తున్నాను. నటుడు ఎస్జే సూర్య కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ చిత్రంలో విశాల్ కనిపించడు.. పాత్రలే కనిపిస్తాయి. తదుపరి నేను దర్శకత్వం చేసే చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. యానిమల్స్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం. దీని తరువాత తుప్పరివాలన్ 2 చిత్రానికి దర్శకత్వం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్ర: మళ్లీ మిష్కిన్ దర్శత్వంలో నటిస్తారా? జ: కచ్చితంగా నటిస్తాను. ఆయన ఇప్పుడు ఫోన్ చేసినా ఆయన ఆఫీస్‌కు వెళ్తాను. మిష్కిన్ అద్భుతమైన దర్శకుడు. అయితే ఒక నిర్మాతగా మాత్రం నేను ఆయన్ని క్షమించను. నాకు అంత ద్రోహం చేశారు. ప్ర: త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ తరుఫున కుప్పం నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారట? జ: ఒసామా (చిరునవ్వు) అలాంటి ప్రచారం నా దృష్టికి వచ్చింది. విశేషం ఏమిటంటే కుప్పం నియోజకవర్గంతో నాకున్న అనుబంధాన్ని, అక్కడి ప్రజలతో సత్సంబంధాలు వంటి వివరాలు సేకరించి కుప్పంలో చంద్రబాబు నాయుడుకు గట్టి పోటీ ఇచ్చే సత్తా విశాల్‌కే ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావించినట్లు ప్రచారం జరిగిన మాట నిజమే. నిజంగానే కుప్పంతో నాకు అనుభవం ఉంది. మా నాన్న అక్కడ గ్రానైట్ వ్యాపారం చేశారు. ఆ సమయంలో నేను మూడేళ్ల పాటు కుప్పంలో తిరిగాను. అక్కడ ప్రతి వీధి నాకు పరిచయమే. అక్కడి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కుప్పం నియోజకవర్గంలో 40 శాతం తమిళులు ఉన్నారు. అయితే కుప్పంలో నేను పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ప్ర: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? జ: రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. అసలు రాజకీయం అంటే ప్రజాసేవ. అలా మీరు కూడా ఏదో ఒక అనాధాశ్రమానికి సాయం చేసే ఉంటారు. అదీ రాజకీయ సేవే. తుపాన్ సమయంలో నేనూ నా మిత్రులం కలిసి సహాయ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రజాసేవ చేయడానికి ఇన్ని రాజకీయ పార్టీలు అవసరమా? ప్ర: మీ కాలేజ్ మేట్ ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీని గురించి మీ స్పందన? జ: ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడం సంతోషంగా ఉంది. సినీ రంగం అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెన్నైలో ఫిలిం సిటీని అభివృద్ధి చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఫిలిం సిటీలు ఉన్నాయి. చెన్నైలో లేకపోవడం బాధాకరం. -
వైఎస్ జగన్ అంటే అభిమానం: తమిళ స్టార్ విశాల్
సాక్షి, తిరుచానూరు (తిరుపతి జిల్లా): రాజకీయ నేతల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే తనకు అభిమానమని తమిళ సినిమా స్టార్ విశాల్ తెలిపారు. లాఠీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం తిరుపతిలోని పలు కళాశాలల్లో విద్యార్థులతో విశాల్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తిరుç³తి ఎస్డీహెచ్ఆర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్ పలు ఆసక్తికర విషయాలను వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎవరంటే ఇష్టమని అడిగిన విద్యార్థికి తనకు జగన్ అంటే అభిమానమన్నారు. కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయని, అయితే అక్కడ నుంచి తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకే రానవసరం లేదన్నారు. సినిమాల్లో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. మోహన్‌బాబు మాట్లాడుతూ తాను హీరోగా నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ సినిమాకు విశాల్ తండ్రి నిర్మాత అని, ఆ కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్న అనుబంధంతోనే లాఠీ ప్రమోషన్ ఫంక్షన్‌కు వచ్చినట్టు తెలిపారు. -
పోలీసులు ఉన్నా.. హత్యను ఆపలేకపోయారు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం పట్టపగలు జరిగిన రమేష్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులే కాదు.. సామాన్యులనూ ఉలిక్కిపడేలా చేసింది. రమేష్‌ను ఇద్దరు వ్యక్తులు వెంటాడి మరీ నరుకుతుంటే పోలీసులు సమీపంలో ఉండి కూడా స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏ కష్టమొచ్చినా, ముప్పు ఎదురైనా ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే. అలాంటి ఖాకీలే చేష్టలుడిగి చూస్తుంటే తమకు ఇక రక్షణ ఎక్కడన్నది ఇప్పుడు ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్న. ‘ఆధునికత’ అంటూ దూసుకుపోతున్న పోలీసింగ్‌లో ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీస్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చినా ఉపయోగమేంటి? అత్తాపూర్‌లో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు నడిరోడ్డుపై ఛేజింగ్ జరిగింది. ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు వెంటాడుతూ చంపడానికి ప్రయత్నించారు. ‘డయల్–100’కు ఫోన్ చేసినా.. ఐదు నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉది.. అయితే అలా వచ్చిన పోలీసుల స్పందన ఏంటన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రమేష్‌ను హత్య చేస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసు వాహనంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందులోంచి దిగిన ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ప్లాస్టిక్ లాఠీలతో హతుడు, హంతకుల సమీపం నుంచి తిరిగారే తప్ప అడ్డుకోవడానిగాని, హంతకులను బంధించడాని గాని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఫోన్ వచ్చాక ఎంత తక్కువ సమయంలో స్పందించినా ఉపయోగమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయుధం ఉంటే తప్పేంటి? రమేష్ హత్య ఉదంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుళ్లు సరిగ్గా స్పందించక పోవడానికి ప్రధాన కారణం వారు నిరాయుధులై ఉండడం. ఆయుధం అవసరం లేని ట్రాఫిక్ పోలీసులు.. అవసరమైన క్రైమ్ పోలీసులు సైతం ‘ఒట్టి చేతుల తో’ ఉండాల్సి వచ్చింది. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాలు అమల్లోకి వచ్చాక ఆయుధాలు అటకెక్కాయి. ఒకప్పుడు ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రివాల్వర్స్ లేదా పిస్టల్స్, ఆ కింద స్థాయి సిబ్బంది వద్ద 303 లేదా ఎస్ఎల్ఆర్లు ఉండేవి. ఆయుధం పోలీసులకు యూనిఫాంలో భాగమే కాదు.. శరీరంలో భాగం లాంటిదని వారికి శిక్షణ నుంచే చెబుతుంటారు. అలాంటిది ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఈ ఆయుధాలను పక్కన పెట్టేశారు. చంపైనా ప్రాణాలు కాపాడుకునే అవకాశం.. సమాజంలో ప్రతి వ్యక్తికీ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉంటుంది. దాడి చేస్తూ ప్రాణహాని తలపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చంపైనా తనను తాను కాపాడుకునే అవకాశాన్ని చట్టం సామాన్య ప్రజలకే కల్పించింది. పోలీసులకు కూడా కళ్ల ముందు దారుణం జరుగుతుంటే దుండగులను కాల్చడమో, గాల్లోకి కాల్పులు జరిపి నిలువరించి పట్టుకోవడమో చేసే అధికారం ఉంటుంది. అత్తాపూర్ ఉదంతంలో ఆ కానిస్టేబుళ్ల వద్ద తుపాకీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితా? ‘సాఫ్ట్ టార్గెట్’గా పేరున్న హైదరాబాద్ అనునిత్యం ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంటుంది. స్థానిక ఉగ్రవాదుల నుంచి జాతీయ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థల వరకు అదను చూసి గురిపెడుతుంటాయి. నిత్యం కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి రాజధాని నగరంలో నిరాయుధులతో పోలీసింగ్ సురక్షితం కాదని పోలీస్ శాఖకు చెందిన నిపుణులు చెబుతున్నారు. బృందాలుగా రంగంలోకి దిగడం, బాంబు పేలుళ్ల వంటివి కాకుండా తుపాకులతో జనసమర్థ ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. సామాన్యులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఉదంతమే పోలీసులకు ఎదురైతే పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు తెచ్చుకోవడమో, ‘ఇంటర్సెప్షన్’ వాహనాన్ని పిలవడమో చేయాలి. (ఈ వాహనాల్లోనే ఆయుధాలతో పోలీసులు ఉంటారు. ఇలాంటివి 17 వెహికల్స్ సిటీలో మాత్రమే ఉన్నాయి) ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. బ్యాంకుల వద్ద కాపలా కాసే సెక్యూరిటీ గార్డుల వద్దే తుపాకీ ఉండగా పోలీసుల వద్ద ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడు కమిషనరేట్లలో పరిస్థితి ఇదీ.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో కలిపి 140 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని మినహాయించినా మిగిలిన వాటిలో ప్రతి ఠాణాకు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా 3 చొప్పున పెట్రోలింగ్ కోసం ఇన్నోవా వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనంలో డ్రైవర్ సహా నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరికి హెడ్–కానిస్టేబుల్ లేదా ఏఎస్సై నేతృత్వం వహిస్తారు. ఆ వాహనంలో ప్రాథమిక చికిత్స చేసే కిట్లు, రెయిన్కోట్లు, కోన్స్లతో పాటు ప్లాస్టిక్ లాఠీలే ఉంటున్నాయి. అతి తక్కువ వాహనాల్లో మాత్రమే ‘స్టోన్ గార్డ్’ (రాళ్లు తగలకుండా ధరించే కోట్లు) వంటివి ఉంటున్నాయి. ప్రతి ఠాణాకు 2 నుంచి 4 వరకు పెట్రోలింగ్ బైక్‌లు (బ్లూకోల్ట్స్) ఉన్నాయి. దీనిపై ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున తమ పరిధుల్లో గస్తీ నిర్వహిస్తుంటారు. వీరి వద్ద వాకీటాకీ, ట్యాబ్, సెల్‌ఫోన్ మినహా కనీసం లాఠీ కూడా ఉండదు. అవసరమైనప్పుడే లాఠీలు పట్టుకెళతారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డివిజన్‌కు ఒకటి చొప్పున మొత్తం 17 ‘ఇంటర్సెప్టార్’ వాహనాలు ఉన్నాయి. ఒక్కో డివిజన్లో 3 నుంచి 5 ఠాణాలు ఉండగా.. ఈ వాహనాల్లోని సిబ్బంది వద్ద మాత్రమే తుపాకులు ఉంటున్నాయి. అదుపు తప్పిన సందర్భాల్లేవ్.. చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఫ్రెండ్లీ పోలీసింగ్ అటకెక్కుతుందని భావించడం సమంజసం కాదన్నది నిపుణుల మాట. నాలుగేళ్ల కిందటి వరకు అన్ని స్థాయిల అధికారుల వద్దా ఆయుధాలు ఉండేవి. దోపిడీ, బందిపోటు ముఠాల కదలికల నేపథ్యంలో ఉమ్మడి సైబరాబాద్‌లో కానిస్టేబుళ్లు ఎస్ఎల్ఆర్లతో పెట్రోలింగ్ చేసేవారు. ఇప్పటి వరకు పోలీసులు అదుపు తప్పిన, విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన సందర్భాలు లేనేలేవు. గడిచిన 15 ఏళ్లలో చూసినా మక్కా మసీదులో పేలుడు జరిగిన 2007 మే 18న మాత్రమే పోలీసు తూటా పేలింది. అది కూడా అల్లరిమూకలు పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికే కాల్పులు జరిపారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఎలాంటి కాల్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల వెంట తుపాకులు ఉంటే తప్పేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
లాఠీ విసరడంతో మహిళ మృతి
యాడికి (అనంతపురం): మోటార్ బైక్ పైకి పోలీసు లాఠీ విసరడంతో ఓ మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం కుందన కుంటలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్ పైన అత్తా అల్లుడు వెళుతుండగా ఎక్సైజ్ పోలీస్ లాఠీ విసిరాడు. బైక్ పై నుంచి కింద పడి అత్త బసమ్మ (50) మృతి చెందగా, అల్లుడు వెంకటేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.