breaking news
loan vavier papers
-
48 లక్షల మంది రైతులకు రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు బ్యాంకర్లు ప్రభుత్వానికి లెక్కలు సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 48 లక్షల మంది రుణమాఫీకి అర్హత సాధించినట్లు తెలిసింది. వారందరికీ కలిపి రూ.30 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని ఎస్ఎల్బీసీ అధికారులు వెల్లడించారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేశాక మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా పంటల రుణమాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్ 11లోపు రుణాలు తీసుకున్నవారికే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించిందంటే, ఐదు విడతల్లో రుణాలను బ్యాంకులకు చెల్లించే అవకాశముంది. ఏ సంవత్సరం నుంచి లెక్కలోకి తీసుకుంటుందోనన్న విషయంపై స్పష్టత రావడంలేదు. గతం కంటే 12.69 లక్షల మంది అదనం తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 16,138 కోట్ల రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో కేటాయించి మాఫీ చేసింది. అప్పటి కంటే ఈసారి అదనంగా మరో 12.69 లక్షల మంది రుణమాఫీకి అర్హత సాధించనున్నారని బ్యాంకర్లు అంటున్నారు. సొమ్ము కూడా దాదాపు రూ.14 వేల కోట్లు అధికంగా కేటాయించాల్సి వస్తోంది. రెండేళ్లలో రైతులు తీసుకున్న రుణాలు గత రెండు సీజన్లలో తీసుకున్న పంటరుణాలను పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం ఒక్కో రైతు సరాసరి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు రుణం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. రెండు సీజన్ల లెక్క ప్రకారం 2017–18 ఖరీఫ్, రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఆ ఏడాది రూ. 31,410 కోట్ల రుణాలను బ్యాంకులు రైతులకు ఇచ్చాయి. 2018–19లో ఇప్పటివరకు 26.45 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులు మొత్తం రూ. 23,488 కోట్ల రుణాలు ఇచ్చాయి. అందులో ఈ ఖరీఫ్‌లో 22.21 లక్షల మంది రైతులు రూ. 19,671 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత రబీలో ఇప్పటివరకు 6 లక్షల మంది రైతులు రూ. 5 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. కొందరు రెండుసార్లు తీసుకొని ఉండొచ్చు. అలా మొత్తం రుణమాఫీకి అర్హులయ్యే వారు 48 లక్షలు ఉన్నారని అంచనా వేశారు. ఎన్నికల్లో ప్రచారాస్త్రం... రుణమాఫీని ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ జరుగుతుందని చెబుతున్నారు. దాంతోపాటు వచ్చే మే, జూన్ నెలల్లో రైతుబంధు సొమ్ము కూడా రైతుల ఖాతాలో వేస్తామని చెబుతున్నారు. పైగా గతంలో ఏడాదికి ఎకరానికి రూ. 8 వేలు రైతుబంధు సొమ్ము ఇస్తే, ఈసారి నుంచి ఏడాదికి రూ. 10 వేలు ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్నారు. -
రుణమాఫీ పత్రాల పంపిణీలో జాప్యమా?
హైదరాబాద్: వ్యవసాయ రుణమాఫీ పత్రాలను రైతులకు అందించడంలో అధికారులు చేస్తున్న జాప్యంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పత్రాలను వెంటనే రైతులకు అందించాలని పదేపదే చెబుతున్నా అది కార్యరూపం దాల్చకపోవడం క్షమార్హం కాదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వ్యవసాయ అభివృద్ధి, మిషన్ కాకతీయ కార్యక్రమాలపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్యతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రుణమాఫీ పత్రాలను ఈ నెల 16 నుంచి 21 లోగా రైతులకు అందించాలన్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు ప్రచారం ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ ప్రతాల అందజేతలలో నిజామాబాద్, నల్లగొండ జిల్లాలు ముందుండగా, మహబూబ్‌నగర్ వెనుకబడి ఉందని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘మిషన్’తో రాష్ట్రం సస్యశ్యామలం: హరీశ్ ‘మిషన్ కాకతీయ’కు సహకరించేందుకు అనేక సంస్థలతోపాటు వ్యక్తులు కూడా ముందుకు వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చెరువుతో ముడిపడి ఉందని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు బోర్లు, చెరువులు, బావులు ఎండిపోవడమే కారణమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో ‘మిషన్ కాకతీయ’ ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. ‘మిషన్ కాకతీయ’కు స్పందించిన ఆమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ... ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకు లక్ష డాలర్లను కేటాయించి ఐదుగురు విద్యార్థులను రాష్ట్రానికి పంపించిం దని మంత్రి చెప్పారు.